ETV Bharat / city

అంత్యక్రియలకు వెళ్లకుండా.. దళిత గర్జనలో పాల్గొనకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం..!

author img

By

Published : Jun 4, 2022, 10:47 AM IST

Updated : Jun 4, 2022, 2:51 PM IST

HOUSE ARREST
తెదేపా నేతల గృహ నిర్బంధం

HOUSE ARREST: పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడులో హత్యకు గురైన తెదేపా కార్యకర్త కంచర్ల జల్లయ్య అంత్యక్రియల్లో తెదేపా నేతలు పాల్గొనకుండా.. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు పిఠాపురంలో తలపెట్టిన "దళిత గర్జన"కు హాజరు కాకుండా నేతలను గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

HOUSE ARREST: పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడులో హత్యకు గురైన తెదేపా కార్యకర్త కంచర్ల జల్లయ్య అంత్యక్రియల్లో తెదేపా నేతలను పాల్గొననీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పార్టీ తరుపున త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన చంద్రబాబు.. జిల్లా నేతలంతా కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మృతుని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని జంగమేశ్వరపాడు వెళ్లేందుకు నిర్ణయించారు.

అంత్యక్రియలకు వెళ్లకుండా.. దళిత గర్జనలో పాల్గొనకుండా.. తెదేపా నేతల గృహ నిర్బంధం..!

తెదేపా తరుపున కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, బుద్ధ వెంకన్న, జిల్లా ముఖ్య నేతలు కలిసి జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే.. తెదేపా నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలో తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు గృహనిర్బంధించారు. పోలీసులు అడ్డుకోవడంతో బుద్ధా ఇంటి వద్దే నిరసనకు దిగారు. అటు బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద బీదా రవిచంద్రను పోలీసులు అడ్డుకున్నారు. జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయనను అరెస్టు చేసి వినుకొండ పోలీస్​స్టేషన్​కు తరలించారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును సైతం పోలీసులు గృహనిర్బంధం చేశారు. తేలుకుంట్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను సైతం పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

ఈ నిర్బంధాలపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. హత్యలు చేస్తున్న వారిని రోడ్లపైకి వదిలి.. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేవారిని అరెస్టు చేయటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణంతో తనను ఆపుతున్నారో సమాధానం చెప్పాలని నక్కా ఆనందబాబు పోలీసులను డిమాండ్ చేశారు. అక్రమంగా నన్ను నిర్బంధిస్తే కోర్టులో పిటిషన్ వేస్తానని హెచ్చరించారు. వైకాపా నేతలు చెప్పినట్లు పోలీసులు ఆడితే.. ఇబ్బందులు పడతారని అన్నారు. పల్నాడులో పట్టపగలే హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్యని.. ఎట్టి పరిస్థితుల్లో పల్నాడు వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు.

తెదేపా "ఎస్సీ గర్జన"ను అడ్డుకున్న పోలీసులు: కాకినాడ జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. దళిత గర్జన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే.. ఈ సభకు అనుమతులు లేవంటూ వర్మను పోలీసులు నిన్న రాత్రే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల కళ్లుగప్పి ఆయన నిన్న రాత్రే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు కొందరు ఎస్సీ నాయకులూ.. రాత్రంతా పార్టీ కార్యాలయంలోనే గడిపారు. వర్మ సహా ఎస్సీ నాయకులు పార్టీ కార్యాలయంలో ఉన్నారనే విషయం తెలియగానే.. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎవరూ బయటకు రాకుండా కార్యాలయాన్ని చుట్టుముట్టి పహారా కాస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. కార్యక్రమం నిర్వహించి తీరతామని వర్మ తేల్చిచెప్పారు.

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడలో తెదేపా నేతల వాహనాలను పోలీసులు అడ్డగించారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు, తెదేపా నేత ఎం.ఎస్‌.రాజును పోలీసులు అరెస్టు చేశారు. దళితగర్జనకు మద్దతుగా వస్తున్న నాయకులను పోలీసులు రోడ్డుపై ఆపారు. నాయకులను అడ్డుకోవడంతో తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. సామర్లకోట- పిఠాపురం రహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి.

తెదేపా నేతల గృహ నిర్బంధం

ఇవీ చదవండి:

Last Updated :Jun 4, 2022, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.