ETV Bharat / city

ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన సీఎం ఏం చేస్తున్నారన్న తెదేపా నేతలు

author img

By

Published : Aug 23, 2022, 3:50 PM IST

Lepakshi Knowledge hub Land Scam ప్రభుత్వ ఆస్తులను కాపాడలేరా అంటూ ముఖ్యమంత్రి జగన్​ను తెదేపా నేతలు ప్రశ్నించారు. లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే-గ్యాంగ్ ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డు పెట్టుకుని భారీ లూటీకి తెగబడిందని ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన సీఎం ఏం చేస్తున్నారన్న తెదేపా నేతలు
ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన సీఎం ఏం చేస్తున్నారన్న తెదేపా నేతలు

TDP On Lepakshi Knowledge hub Land Scam లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే-గ్యాంగ్ ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డుపెట్టుకుని భారీ లూటీకి తెగబడిందని తెలుగుదేశం సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. వివిధ బ్యాంకుల్లో ఇందూ తాకట్టు పెట్టిన అత్యంత విలువైన లేపాక్షి భూములను కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేశారని మండిపడ్డారు. రూ.500 కోట్ల నామమాత్రపు చెల్లింపులతో.. వేల కోట్ల ఆస్తులు కాజేసేలా పకడ్బందీ ప్రణాళిక అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్ల విలువైన ప్రజల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకూడదనేదే తమ ఉద్దేశమన్న పయ్యావుల.. ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించారు. తాను లేఖ రాసినా కనీసం స్పందించలేదని మండిపడ్డారు.

ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన సీఎం ఏం చేస్తున్నారన్న తెదేపా నేతలు

"ప్రజల భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదనేదే మా ఉద్దేశం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. ప్రజల భూములను కాపాడతారా.. మీ బంధువుల తరఫున నిలబడతారా ? అనేది సీఎం జగనే చెప్పాలి. ఆ భూములకు తెదేపా కాపలాగా ఉంటుంది తప్ప ఎవరికీ అప్పనంగా పోనివ్వం. నేను విషయాన్ని బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయట్లేదు? ఆ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆనాడు తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. రాంకీ, అరబిందో సంస్థలు మీ భాగస్వామ్య సంస్థలు కాదా? భూములను మళ్లీ ప్రజలకు అప్పగించేందుకు వైకాపా ప్రభుత్వం ఏమైనా చేసిందా? త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలోనైనా ఆ భూములపై మాట్లాడతారా? ఎన్‌సీఎల్‌టీలో ప్రభుత్వ వాదనలు ఎందుకు వినిపించలేకపోతున్నారు? రూ.10వేల కోట్ల విలువైన భూములను రూ.500 కోట్లకే కట్టబెడతారా?" -పయ్యావుల కేశవ్‌, తెదేపా సీనియర్ నేత

ప్రభుత్వ ఆస్తులను కాపాడలేరా ?: అమరావతిలో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ యాగీ చేసి కేసులు పెట్టిన వైకాపా ప్రభుత్వం అనంతపురంజ జిల్లాలో 5 వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను లేపాక్షిహబ్‌కు కట్టబెట్టిన వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. భూమల అప్పగింత వ్యవహారంలో కీలకంగా ఉన్న అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ఇంతవరకూ ఉపాధి కల్పించని.. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసి ఆ భూములను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని నిగ్గదీశారు. జనం కళ్లకు గంతలు కట్టి జగన్ మేనమామ కుమారుడు ఆ భూములు తన్నుకుపోతున్నారని.. దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులను ముఖ్యమంత్రి జగన్‌ కాపాడలేరా ? అని ప్రశ్నించారు.

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్ కుంభకోణం నేపథ్యమిదీ..: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో కారుచౌకగా అత్యంత విలువైన భూములను కట్టబెట్టారు. అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్‌ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా.. కేవలం రూ.500 కోట్లకే దక్కనున్నాయి.

పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పవన్‌ కల్యాణ్‌ వైకాపా ముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్దేశించుకున్నారని.. తెలుగుదేశం సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంత్రులు ఊరికే నోరుపారేసుకోకుండా పవన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హితవు పలికారు. చేస్తున్న పాపాలకుగాను ఈ దఫా అధికారంలోకి రాకపోతే జైళ్లకు పోక తప్పదనే భయంతోనే జనసేన అధినేతపై వైకాపా విమర్శలు గుప్పిస్తోందన్నారు. జగన్ అరాచక పాలనలో ఏపీ 30 ఏళ్ల వెనక్కి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.