ETV Bharat / city

Rains in AP: రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు.. ఆనందంలో అన్నదాతలు

author img

By

Published : Jun 6, 2022, 11:48 AM IST

Rains in Andhra Pradesh
రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు

Rains in AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జోరుగా వర్షాలు పడుతున్నాయి. కోస్తాతీరంలో తెల్లవారుజాము నుంచి వానలుపడుతున్నాయి. ఖరీఫ్​ ఆరంభంలోనే వానలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు

Rains in AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

  • గుంటూరు జిల్లాలో.. జోరుగా వానలుపడుతున్నాయి. మేడికొండూరు, పిరంగీపురం మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మేడికొండూరు రహదారిపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విసదలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మేరకపూడి, వేములూరిపాడు గ్రామాల్లో ప్రధాన రహదారిపై చెట్లు విరిగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. అమీనాబాద్‌లో విద్యుత్‌ స్తంభం విరిగి ఇంటి ప్రహరీపై పడింది.
  • బాపట్ల జిల్లాలోనూ.. జోరుగా వానలు కురుస్తున్నాయి. పర్చూరు, మార్టూరు, చీరాల, అద్దంకి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ శబ్దంతో ఎన్నడూలేని విధంగా ఉరుములు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెనుగాలుల బీభత్సానికి ఇంకొల్లు -పర్చూరు రహదారిలో చింత చెట్లు నేలకొరిగాయి.దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మార్టూరు, పర్చూరు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాత్రి నుంచి సరఫరా నిలిచిపోయింది. చినగంజాం ఉప్పు కొఠార్ల లో వర్షపునీరు నిలిచి.. తీయాల్సిన ఉప్పు వర్షపు నీటి కి కరిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన జోరు వానలుపడ్డాయి. అమలాపురంలో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షాపు నీరు చేరింది. అంబాజీపేట, మామిడికుదురు, పి. గన్నవరం రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

కొనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాకినాడలో మబ్బులు కమ్మేయడంతో చీకటి వాతావరణం తలపించింది. ఈదురుగాలులతో కాకినాడ నగరం, గ్రామీణ మండలాలతో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిపివేశారు..

  • విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. మబ్బులు కమ్మేయడంతో పూర్తిగా చీకట్లు అలముకున్నాయి. విశాఖలోని మధురవాడ, పి ఎం పాలెం,ఆనందపురం చంద్రంపాలెం, రిషికొండ, ఎండాడ, డెయిరీ ఫామ్, గాజువాక, సీతమ్మధార, డాబా గార్డెన్స్, కూర్మన్నపాలెంలో గంటన్నర పాటు ఎడతెరుపు లేకుండా వర్షం కురిసింది. నర్సీపట్నంలోనూ భారీ వర్షం కురిసింది.
  • కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కురిసిన వర్షాలకు కల్లివంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటే ప్రయత్నంలో కారు నీటిలో కొట్టుకుపోయింది. గుల్బర్గా జిల్లా నాల్వర్‌కు చెందిన వైద్యుడు జాహిద్ అన్సారీ సైతం కొట్టుకుపోయారు. కారుకు ఓపెన్‌టాప్‌ ఉండటంతో బాధితుడు అందులో నుంచి క్షేమంగా బయటపడ్డారు.
  • కడప జిల్లా పులివెందులలో వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా పెద్ద గాలి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పులివెందులలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ తీగలు తెగి పడిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాలి వానకు పెద్ద పెద్ద చెట్లు విరిగి వాహనాల పైన ఇళ్లపైన పడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వర్షపు నీటిలో బైకులు, కార్లు కాస్త దూరం కొట్టుకుపోయాయి. దాదాపు రెండున్నర గంటల పాటు వర్షం ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రింగ్ రోడ్డు చుట్టూ చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.