ETV Bharat / city

రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని కేంద్రం కూడా చెప్పింది: పయ్యావుల

author img

By

Published : Jul 20, 2022, 4:14 PM IST

రాష్ట్రంలోనూ శ్రీలంక పరిస్థితులు నెలకొంటాయని 4 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ హెచ్చరించిందని... అదే విషయాన్ని నిన్న కేంద్రం మరోసారి తెలిపిందని పయ్యావుల కేశవ్‌ వివరించారు.

పయ్యావుల
పయ్యావుల

రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని కేంద్రం కూడా చెప్పింది

రాష్ట్రం శ్రీలంక తరహా పరిస్థితుల దిశగా సాగుతోందని 4 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ హెచ్చరించిందని.., అదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసిందని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరిగి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీలంక కంటే 4 రెట్లు అధికంగా ఏపీ అప్పు చేసినందున.., సంక్షోభం తలెత్తక మరేమవుతుందని పయ్యావుల నిలదీశారు. సీఏజీ పూర్తిస్థాయి ఆడిట్​కు సిద్ధపడతారా ? లేక శ్వేతపత్రం విడుదల చేస్తారా ? అని ఆర్థికమంత్రికి సవాల్ విసిరారు. చేస్తున్న అప్పులకు ఎందుకు లెక్కలు చూపట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్​గా తాను అడిగిన వాటికి లెక్కల వివరాలు చెప్పట్లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి సంబంధించి వందలాది పీడీ అకౌంట్లకు లెక్కలు లేవని అన్నారు.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఇంకా మెతక వైఖరితో ఉండటానికి రాజకీయ కారణాలా ? లేక సమాఖ్య స్ఫూర్తా ? అనేది అర్థం కావట్లేదన్నారు. కేంద్రం కూడా అప్పులు చేసి తప్పు చేస్తోందని వైకాపా భావిస్తే.. ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్​లోనే నిలదీయొచ్చు కదా అని పయ్యావుల ఆక్షేపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తప్పిదాలను ఎండగడుతుంటే, వైకాపా ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. పులులు అని చెప్పుకునేవారు ఏ విషయంలోను కేంద్రాన్ని నిలదీయకపోవటం గత కొంతకాలంగా చూస్తున్నామన్నారు. బుగ్గన పీఏసీ ఛైర్మన్​గా ఉన్నప్పుడు ఆ పదవిలో ఉన్న ఎవరినైనా గౌరవించాల్సిందేనని నాటి ఆర్థిక మంత్రి యనమల స్వయంగా అధికారులను హెచ్చరించారని గుర్తుచేశారు. తనని ఉద్దేశించి ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ కించపరుస్తూ లేఖ రాస్తే.. దీనిపై ప్రభుత్వ స్పందన కరవైందని ఆక్షేపించారు. రాష్ట్రంలో శ్రీలంక తరహా పరిస్థితులపై ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేంద్రం ఓ ప్రజెంటేషన్ రూపొందించింది తప్ప రాజకీయ కోణంలో చేసింది కాదన్నారు. ఆర్బీఐ నివేదికకు ఎంచుకున్న దాదాపు 10 అంశాల్లోనూ ఏపీ అగ్రస్థానంలోనే ఉందని వెల్లడించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.