ETV Bharat / city

తెలుగు భాషపై చిన్నచూపు... ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే: జీవీఎల్‌

author img

By

Published : Jul 12, 2021, 7:46 PM IST

mp gvl narasimha Rao letter to cm jagan
ముఖ్యమంత్తి జగన్​కు జీవీఎల్‌ నరసింహారావు లేఖ

భాజపా ఎంపీ నరసింహారావు (mp gvl Narasimha Rao)... ముఖ్యమంత్రి జగన్​కు బహిరంగ లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. తెలుగు భాష ప్రాముఖ్యతను తగ్గించాలనే ఆలోచనగానే కన్పిస్తోందని విమర్శించారు. ఈ అనాలోచిత నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు (mp gvl Narasimha Rao) వ్యాఖ్యానించారు. తెలుగు భాషను చిన్నచూపు చూడడం.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమేనని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్​కు బహిరంగ లేఖ రాశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు భాష ప్రాముఖ్యతను కించపరిచే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. "తెలుగు భాష.. మన సంస్కృతి, ఉనికికి ఆధారం. ఆ భాషను చిన్నచూపు చూడటం... తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే" అని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు.

అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా..?

మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుభాష ఔన్నత్యాన్ని తగ్గించే అధికారం మూన్నాళ్లకు ఎన్నుకోబడే ప్రభుత్వాలకు ఎక్కడిది? అని ముఖ్యమంత్రిని జీవీఎల్ ప్రశ్నించారు. మన భాషపై మనకే మక్కువ లేకపోవడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అని నిలదీశారు. బ్రిటిష్ వారు పరిపాలించినపుడే ఇంత సాహసం చేయలేదని... ఆంగ్లభాషకు ఎవ్వరూ వ్యతిరేకం కాదని అన్నారు. విదేశీ భాష మోజులో మన భాషను మరుగున పడేయాలనుకోవటం భావ్యం కాదని పేర్కొన్నారు.

విద్యార్థులకు శాపంగా..

తెలుగు మాధ్యమంలో చదువుకునే వేలాదిమంది విద్యార్థులకు ఇది శాపంగా మారిందన్నారు. ఒకవైపు.. ఉన్నతవిద్యతోపాటు సాంకేతిక విద్యను మాతృ భాషల్లో బోధించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆంగ్లమయం చేయాలనుకోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

జాతీయ విద్యా విధానానికి విరుద్ధం

"గత వారమే ప్రధాని నరేంద్ర మోదీ.. భారతీయ భాషల్లో సాంకేతిక విద్య ఉండాలని చెప్పారు. దానికి అనుగుణంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తెలుగుతో సహా ఎనిమిది భారత భాషల్లో వచ్చే విద్యా సంవత్సరానికి బీటెక్ పాఠ్యపుస్తకాలు సిద్ధం చేసింది. జాతీయ విద్యా విధానానికి, ప్రణాళికలకు విరుద్ధంగా పనిచేయటం ఎంతవరకు సబబు" అని జీవీఎల్​ తన లేఖ ద్వారా సీఎంను ప్రశ్నించారు.

దురుద్దేశంగా కన్పిస్తోంది..

తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. తెలుగుభాష ప్రాముఖ్యతను తగ్గించాలనే దురుద్దేశంగా కన్పిస్తోందని విమర్శించారు. సంస్కృత భాషాభివృద్ధి చేయాలనుకోవడం మంచి నిర్ణయమే... కానీ దానికి తెలుగు అకాడమీ కార్యకలాపాల్లో తెలుగు భాష ప్రాధాన్యతను తగ్గించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సంస్కృతానికి కొత్త అకాడమీ స్థాపించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవొచ్చని సలహా ఇచ్చారు.

యువత భవిష్యత్తుకు విఘాతం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలుగు భాషను, తెలుగువారి సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. వాటి పర్యవసానం మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర యువతకు, వారి భవిష్యత్తుకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అనాలోచిత నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని లేఖ ద్వారా ఎంపీ జీవీఎల్ (mp gvl) విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర నీటి హక్కుల్ని తెలంగాణ హరిస్తున్నా..ఎందుకు అడ్డుకోవట్లే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.