ETV Bharat / city

CS ON PRC: సమ్మెతో సాధించేదేమీ లేదు.. చర్చలకు రండి: సీఎస్​ సమీర్​శర్మ

author img

By

Published : Feb 3, 2022, 6:36 PM IST

Updated : Feb 4, 2022, 5:41 AM IST

CS ON PRC
CS ON PRC

18:34 February 03

కొత్త పీఆర్‌సీ వల్ల ఎవరి జీతం కూడా తగ్గలేదు..

PRC ISSUE IN AP: ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని.. చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమయ్యేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమేనని.. అయితే చర్చించి వాటిని పరిష్కరించుకోవాలని సీఎస్​ సూచించారు. పాత పీఆర్‌సీతో కొత్త పీఆర్‌సీని పోల్చి చూడాలని.. పే స్లిప్‌లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందన్నారు. సమ్మెకు వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్న సీఎస్​.. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధమేనని​ స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే మధ్యంతర భృతి (ఐఆర్‌) వడ్డీ లేని అప్పు లాంటిదని సమీర్​ శర్మ అన్నారు. దాన్ని తర్వాత సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇది ఏ పీఆర్సీలోనైనా జరుగుతుందని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా 30 నెలలపాటు 27% ఐఆర్‌ ఇవ్వలేదని తెలిపారు. ఐఆర్‌ ఉద్యోగుల హక్కు కాదని అన్నారు. తెలంగాణలో కూడా ఇవ్వలేదని అన్నారు. ఇక్కడ కూడా ఐఆర్‌ ఇవ్వకుండా డీఏలే ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు ఆదా అయ్యేదని తెలిపారు. సచివాలయంలో గురువారం సాయంత్రం ఆయన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఎస్‌.ఎస్‌.రావత్‌, శశిభూషణ్‌ కుమార్‌, సమాచారశాఖ డైరక్టర్‌ విజయకుమార్‌రెడ్డిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ‘ఐఆర్‌ విషయంలో సంఘాలు ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో మధ్యంతర భృతి ప్రకటించాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది’ అని చెప్పారు.

ఐఆర్‌ కలపకూడదు: శశిభూషణ్‌

కొత్త పీఆర్సీ కన్నా పాత పీఆర్సీలోనే జీతాలు ఎక్కువని చెబుతున్నారు. 2015 పీఆర్సీ లెక్క వేసినప్పుడు ఐఆర్‌ను లెక్కలోకి తీసుకోకూడదు. పాత పీఆర్సీకన్నా కొత్త పీఆర్సీలో జీతాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం 30 నెలలపాటు 27% ఐఆర్‌ కింద ఉద్యోగులకు రూ.17,918 కోట్లు ఇచ్చింది.

విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సీఎస్‌ సమాధానాలు...

విలేకర్లు: ఉద్యోగులు మూడు డిమాండ్లు పెట్టారు. వాటిని గుర్తించడంలో మీరు ఎందుకు విఫలమవుతున్నారు?
సీఎస్‌: అభ్యంతరాలుంటే వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడటానికి ముందే షరతులు పెడితే ఎలా?

విలేకర్లు: సమ్మెకు సమయం దగ్గరపడుతోంది. ఈలోపు ఉద్యోగులు సంతృప్తిపడేలా సవరణ ప్రకటనలుంటాయా?
సీఎస్‌: వచ్చి మాట్లాడితే అప్పుడు చెప్పొచ్చు.

విలేకర్లు: మీరు రికవరీ లేదంటున్నారు. ఐఆర్‌, డీఏ బకాయిలు సర్దుబాటు చేసిన తర్వాత ఉద్యోగుల నుంచి రికవరీ అవుతుందని ప్రభుత్వ జీవోలే చెబుతున్నాయి.
సీఎస్‌: ఈ విషయంపైనా అభ్యంతరాలుంటే ఉద్యోగ సంఘాలు వచ్చి మాట్లాడవచ్చు కదా.

విలేకర్లు: 2020 ఏప్రిల్‌ నుంచి మానిటరీ ప్రయోజనం ఇస్తున్నందున ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌ రూపంలో సర్దుబాటు చేశారనుకోవచ్చు. అంతకుముందు 9 నెలలు ఎందుకు సర్దుబాటు చేస్తున్నారు?
సీఎస్‌: నాకు తెలిసినంతవరకు ఏ పీఆర్సీలోనైనా సర్దుబాటు ఉంటుంది. ఈ విషయం కూడా వారు చర్చించవచ్చు కదా.

విలేకర్లు: ఇంతకుముందే వారు మాట్లాడారు కదా. అప్పుడు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పారు?
సీఎస్‌: అప్పుడూ చర్చించాం. మంత్రిమండలిలో ఆమోదించాం. జీవోలు ఇచ్చాం.

విలేకర్లు: చర్చలు పూర్తవకుండానే జీవోలు ఇచ్చేశారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ కూడా రికవరీ చేస్తున్నారా?
సీఎస్‌: ఇలాంటి అన్ని విషయాలు వారు వచ్చి చర్చించవచ్చు.

విలేకర్లు: చర్చలకు వచ్చినా వారి అభ్యంతరాలను మీరు పరిగణనలోకి తీసుకోనందుకే కదా సమ్మె దాకా వెళ్లామంటున్నారుగా?
సీఎస్‌: మానవవనరుల అంశాలకు సంబంధించి ఒక కచ్చితమైన డాక్యుమెంటు ఉండదు. అందుకే అనామలిస్‌ కమిటీ ఉంది.

ఇదీ చదవండి..

CHALO VIJAYAWADA: 'చలో విజయవాడ' విజయవంతం.. ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి'

Last Updated :Feb 4, 2022, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.