ETV Bharat / city

CHANDRABABU: కొవిడ్‌ నిబంధనలు చవితి ఉత్సవాలకేనా..వైఎస్‌ వర్ధంతికి పట్టవా ?

author img

By

Published : Sep 6, 2021, 3:23 PM IST

Updated : Sep 7, 2021, 4:31 AM IST

వినాయక చవితి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక చవితికి ఏ విధంగా వర్తిస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

cbn meeting with party leaders
తెలుగుదేశం అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని తెదేపా అభిప్రాయపడింది. ‘ఇడుపులపాయతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు వర్తించని కొవిడ్‌ నిబంధనలు చవితి ఉత్సవాలకు ఎలా వర్తిస్తాయి? తెలంగాణలో అనుమతించినప్పుడు ఇక్కడెందుకు నిరాకరిస్తున్నారు?’ అని ధ్వజమెత్తింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ఈ నెల 10న చవితిపూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం ఆన్‌లైన్‌లో జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వాటిపై పోరాటానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెదేపా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి జగన్‌.... అమలులో లేని దిశ చట్టాన్ని ఉన్నట్టుగా చూపించి రెండేళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. ‘గుంటూరుకి చెందిన రమ్య హత్య జరిగి 21 రోజులవుతున్నా నిందితుడికి శిక్ష పడలేదు. వాజీబీ, అనూషా వంటి బాధిత మహిళల కేసుల్లోను చర్యల్లేవు’ అని ధ్వజమెత్తారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 9న నరసరావుపేటలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు, ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు ఇవీ...!

జగన్‌రెడ్డి అండ్‌ కో లూటీ కోసమే అప్పులు..!

  • జగన్‌రెడ్డి అండ్‌ కో లూటీ కోసమే అప్పులు చేశారు గానీ... సంక్షేమం కోసం, కరోనా నివారణ కోసం కాదు. కరోనా కష్టకాలంలోను పన్నులు పెంచి ప్రజలపై రూ.75 వేల కోట్ల భారం మోపారు. రూ.2 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఆ నిధుల్ని లూటీ చేశారు కాబట్టే అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాల్లోనూ కోతలు పెడుతున్నారు. పైగా జగన్‌రెడ్డి అప్పుల విషయంలో తెదేపాపై బురదజల్లుతున్నారు.
  • రాష్ట్రంలో రోడ్లన్నీ ధ్వంసమైనా జగన్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డు సెస్‌ రూ.1200 కోట్లు ఏం చేశారు? దీనిపై తెదేపా ఉద్యమిస్తుంది.
  • మత్స్యకారుల ఉనికికి గొడ్డలిపెట్టులాంటి జీవో నెం.217ని వెంటనే రద్దు చేయాలి. చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై పూర్తి హక్కుల్ని మత్స్యకార సొసైటీలకే అప్పగించాలి.
  • విశాఖ మన్యంలో జగన్‌రెడ్డి అండ్‌ కో లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ని ఇష్టానుసారం తవ్వేస్తోంది. రూ.15 వేల కోట్ల ప్రజా సంపదను కొల్లగొట్టేందుకు అక్రమ మైనింగ్‌ చేస్తోంది. దాన్ని అడ్డుకునేందుకు తెదేపా ఆధ్వర్యంలో పోరాటం.
  • గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉత్తరాంధ్రలో జొన్నలు కొనేవాళ్లులేరు. రాయలసీమలో టమాటా, ఉల్లి, బొప్పాయి పంటల్ని కొనడంలేదు. పంట రుణాలు, ఎరువులు, పంట బకాయిలు అందక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల క్రాప్‌ హాలీడేలు ప్రకటించే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తెదేపా పోరాడుతుంది. ప్రభుత్వం కమీషన్ల కోసం బయటి నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. విద్యుత్‌ ఛార్జీల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్లపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం.
  • జగన్‌ దశలవారీ మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు.మద్య నిషేధం కోసం మహిళలతో కలసి పోరాటం ధరలను పెంచడంతో పాటు, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. మద్యంలో ఇప్పటికే రూ.25 వేల కోట్ల కుంభకోణం జరుగుతోంది. అది చాలదన్నట్టు మద్యం అమ్మకాల్ని ఇంకా పెంచాలని నిర్ణయించడం మహిళల మాంగల్యాలను తెంచే చర్య. దీనికి నిరసనగా మహిళలతో కలసి తెదేపా పోరాడుతుంది.
  • చిత్తూరు జిల్లాలో పట్టుబడుతున్న ఎర్రచందనం దొంగలంతా వైకాపాకి చెందినవారే. రూ.వందల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను తక్షణమే అరికట్టాలి.
  • సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన దియ్యా రామకృష్ణను హైకోర్టు స్టే ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్‌ను, పోలీసుల్ని అడ్డుపెట్టుకుని జగన్‌రెడ్డి చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్‌, దియ్యా రామకృష్ణ తదితర నేతల అక్రమ అరెస్టులపై ప్రైవేటు కేసులు పెట్టాలని, న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయం.
  • పాఠశాలల ఆవరణల్లో చట్ట విరుద్ధంగా 1,100 రైతు భరోసా కేంద్రాల్ని ప్రభుత్వం నిర్మించింది. వాటిని తొలగించమని హైకోర్టు ఆదేశించింది. దుర్వినియోగం చేసిన రూ.వేల కోట్లను ప్రభుత్వానికి జగన్‌రెడ్డి జమ చేయాలి.
  • ఉపాధి హామీ పథకంలో మస్టర్ల కుంభకోణం ద్వారా పేద కూలీల డబ్బుల్నీ కాజేస్తున్నారు. దీనిపై కేంద్రం విచారణ జరిపించాలి.
  • అమూల్‌ కంపెనీకి లాభాలు చేకూర్చేందుకు ఉపాధి హామీ నిధుల్ని తరలించడాన్ని ఖండిస్తున్నాం.
  • సమావేశంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, కాలవ శ్రీనివాసులు, లోకేశ్‌, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు..

ఇదీ చదవండి..

EX MINISTER DEVINENI UMA: 'రైతుల హక్కులను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు?'

Last Updated :Sep 7, 2021, 4:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.