ETV Bharat / city

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలను ఖండించిన కాకతీయ సేవా సమాఖ్య

author img

By

Published : Aug 25, 2022, 5:23 PM IST

Kakatiya Seva Samakhya
కాకతీయ సేవా సమాఖ్య

Kakatiya Seva Samakhya కమ్మ సామాజిక వర్గంపై వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలను కాకతీయ సేవా సమాఖ్య తీవ్రంగా ఖండించింది. సమాజ అభివృద్ధికి, సేవా దృక్పథానికి మారుపేరుగా నిలిచే కమ్మవారి పట్ల విద్వేషం వెళ్లగక్కడం దారుణమని మండిపడింది. ఎంపీ నగ్న వీడియో అంశాన్ని పక్కదోవ పట్టించడానికి కులంపై అక్కసు వెళ్లగక్కడం ఏంటని సమాఖ్య నాయకులు ప్రశ్నించారు. సీఎం, మంత్రులు సహా వివిధ పదవుల్లో ఉన్నవారు కూడా వివిధ సందర్భంగా కించపరిచేలా మాట్లాడారని ఇకపై ఇలాంటి వాటిని సహించబోమని హెచ్చరించారు.

Kakatiya Seva Samakhya: రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గంపై గత మూడేళ్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని గుంటూరులో కాకతీయ సేవా సమాఖ్య నిర్వహించిన సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. తమ సామాజిక వర్గం ఏ రాజకీయ పార్టీకి, ఏ ఇతర సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదని కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అన్నారు. కానీ హిందూపురం ఎంపీ ఒంటిపై నూలుపోగు లేకుండా వీడియోలో కనిపించి.. దానికి మమ్మల్ని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గం తరపున సమాజానికి ఉపయోగపడే పనులు ఎన్నో తాము చేస్తున్నామన్నారు. ఆ వీడియోలకు తమ కులానికి సంబంధం లేదన్నారు. వీడియో మార్ఫింగ్ అయితే దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. గాంధీ మాదిరిగా ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే పరిస్థితి లేదని.. రెండు చెంపలు పగులగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్ఛరించారు. కొన్ని కమ్మ సామాజిక వర్గం వారు ప్రజల కోసం, సమాజం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన విషయం ప్రస్తావించారు. పార్లమెంటుకు మంచి వక్తల్ని పంపించాలే గానీ... ఇలా అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడే వారిని కాదని స్పష్టం చేశారు. ఈ దిశగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఆలోచించాలని కోరారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా కులం పేరుతో మాట్లాడుతున్నారని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా కమ్మ వారిపై నెపం మోపి... సమాజం నుంచి కమ్మ కులాన్ని వేరు చేసే కుట్ర జరుగుతోందన్నారు. అయితే ఈ పరిణామాల్ని కమ్మ కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు కొందరు మౌనంగా చూస్తున్నారని.. వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతామని కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు హెచ్చరించారు.

కాకతీయ సేవా సమాఖ్య

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.