ETV Bharat / city

నేటి నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ

author img

By

Published : Aug 21, 2022, 10:01 AM IST

EAMCET Counselling from to
తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

TS EAMCET Counseling తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి.

TS EAMCET Counseling: కళాశాలల పేర్లు.. కోడ్‌లు ఒకే రకంగా ఉన్నప్పుడు నమోదులో అయోమయానికి గురైతే మంచి కళాశాలకు బదులు నాసి కళాశాలలో సీటు వచ్చే ప్రమాదం ఉంది. బీటెక్‌ సీఎస్‌ఈ బదులు పొరపాటుగా సీఎస్‌సీ అని ఆప్షన్‌ ఇస్తే సైబర్‌ సెక్యూరిటీలో సీటు రావొచ్చు. ఉత్తమ ర్యాంకు వచ్చినా పొరపాట్ల కారణంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడు విడతల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగే కీలకమని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కళాశాలలు, వాటి ఎంసెట్‌ కోడ్‌లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్‌లను వెబ్‌సైట్‌లో ఉన్న మాన్యువల్‌ ఆప్షన్‌ ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 29 వరకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈనెల 23 నుంచి 30 వరకు తమకు కేటాయించిన సమయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు మినహా మిగతావన్నీ ఆన్​లైన్​లోనే పరిశీలించి నిర్ధారిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 17 నుంచి 21 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మొదటి విడత తర్వాత మిగిలిన ఇంజినీరింగ్ సీట్ల కోసం సెప్టెంబరు 28 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. సెప్టెంబరు 28, 29న రెండో విడత ఆన్ లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబరు 30న ధ్రువపత్రాల పరిశీలన... సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించి.. అక్టోబరు 4న రెండో విడత సీట్లు కేటాయిస్తారు. అక్టోబరు 11న తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. అక్టోబరు 11, 12న స్లాట్ బుకింగులు, 13న ధ్రువపత్రాల పరిశీలన, 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి... 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. మిగిలన సీట్ల కోసం అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు.

ఈ నెల 23 నుంచి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఈక్రమంలో ఆప్షన్ల ప్రక్రియ సకాలంలో మొదలవుతుందా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది.

ధ్రువపత్రాల పరిశీలనకు ఇవి అవసరం..

* ఎంసెట్‌ హాల్‌టికెట్‌

* ఆధార్‌/పాన్‌ కార్డు/డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర ఒక గుర్తింపు కార్డు

* ఎంసెట్‌ ర్యాంకు కార్డు

* ఇంటర్‌ మార్కుల పత్రం

* టీసీ

* పుట్టిన తేదీ కోసం పదో తరగతి మార్కుల ధ్రువపత్రం

* 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్‌

* రిజర్వేషన్‌ వర్తిస్తే కుల ధ్రువీకరణ పత్రం

* ఈడబ్ల్యూఎస్‌ వర్తిస్తే ఆ ధ్రువపత్రం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.