ETV Bharat / city

yanamala: ప్రభుత్వానికి 17 ప్రశ్నలు.. సంధించిన యనమల

author img

By

Published : Sep 15, 2021, 2:21 PM IST

yanamala
యనమల

వైకాపా ప్రభుత్వానికి తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు 17 ప్రశ్నలను సంధించారు. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. బీసీ బ్యాక్​లాక్ పోస్టుల భర్తీ ఏమైందని నిలదీశారు. మత్స్యకార సొసైటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేయటం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వానికి తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు 17 ప్రశ్నలను సంధించారు. బీసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. జీవో నెం.217తో మత్స్యకార సొసైటీలను నిర్వీర్యం చేయడం వాస్తవమా? కాదా? చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 56 కార్పొరేషన్లపై హడావుడి తప్ప.. వాటికిచ్చిన నిధులెన్ని, చేసిన ఖర్చు ఎంతని ప్రశ్నించారు. నేతన్న నేస్తం అంటూ లక్షకు పైగా అందే సబ్సిడీలను, ప్రోత్సాహకాలను ఎత్తేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. ఆదరణ పనిముట్లు తుప్పుపట్టించి... డిపాజిట్లను కూడా స్వాహా చేశారని ఆరోపించారు.

విదేశీ విద్య నిలిపివేసి బీసీ విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేశారని యనమల ధ్వజమెత్తారు. బీసీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఎందుకు చేపట్టలేదో చెప్పాలన్నారు. బీసీ జనగణనపై జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. సెంటు పట్టా పేరుతో బీసీల నుంచి వేలాది ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. మడ అడవుల్ని నాశనం చేసి మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించి 16,800 మందిని రాజకీయాలకు దూరం చేశారని దుయ్యబట్టారు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం జగన్ రెడ్డి ఎందుకు నోరెత్తడం లేదని నిలదీశారు. రిజర్వేషన్లపై పలు రాష్ట్రాలు పోరాడుతుంటే.. జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. బీసీ కార్పొరేషన్ నుంచి నిధుల మళ్లించి.. కార్పొరేషన్​ను నిర్వీర్యం చేయడం దుర్మార్గమన్నారు. నిధులు, విధులు ఉన్న నామినేటెడ్ పదవులు సొంత వారికి కట్టబెట్టిన జగన్‌..., నిధులులేని, కనీసం కుర్చీల్లేని పదవులు బీసీలకు ఇచ్చారని విమర్శించారు. ఉచిత ఇసుకను రద్దుతో 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని దెబ్బతీశారని ఆక్షేపించారు. రెండేళ్లలో 254 మంది బీసీలపై దాడులకు పాల్పడి... ఆస్తులు ధ్వంసం చేశారని ఆరోపించారు. 11 మంది తెలుగుదేశం బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: tdp protest: 'రైతు కోసం తెలుగుదేశం'... నేతలను అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.