ETV Bharat / city

International Tigers Day: భారత్​లో పులులు సురక్షితమేనా..?

author img

By

Published : Jul 29, 2021, 7:10 PM IST

రాష్ట్రంలో పెరిగిన పులుల సంఖ్య
రాష్ట్రంలో పెరిగిన పులుల సంఖ్య

కళ్లలో క్రౌర్యం.. నడకలో గాంభీర్యం.. పరుగులో మెరుపువేగం.. ఇవన్నీ ఒక్క పులికే సొంతం. అసలు.. ఆ రాజసమే వేరు. ఒక్కసారి గాండ్రించిందంటే అడవి అడవంతా చిన్నబోవాల్సిందే. మిగతా జంతువులు ఉలిక్కి పడాల్సిందే. ఇంతటి ఠీవి ఉన్న పులి మనుగడ ప్రమాదపు అంచుల్లో ఉంది. వేర్వేరు దేశాల్లో ప్రభుత్వాల చర్యల వల్ల ఇటీవల కాలంలో కొంతమేర సంఖ్య మెరుగ వుతున్నా.. నేటికీ ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో పులుల సంరక్షణ, ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. జులై 29 ప్రపంచ పులుల దినోత్సవ వేళ.. జంతుప్రేమికులు, పర్యావరణ వేత్తలు పులుల సంరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు.

భారత్​లో పులులు సురక్షితమేనా..?

ఆధునిక మానవుడి విపరీత చేష్టలకు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. జీవవైవిధ్యానికి విఘాతం ఏర్పడటంతో.. అనేక జీవరాశుల మనుగడ ప్రమాదపు అంచుల్లో నిలుస్తోంది. విలువైన అటవీ సంపద నాశనం అవుతుండటంతో.. క్రూర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోయి.. అంతరించిపోతున్న జంతువుల జాబితాకు చేరుతున్నాయి. ముఖ్యంగా.. అడవికి రారాజుగా పేరొందిన పులుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. గతంలో గుంపులు గుంపులుగా కనిపిస్తూ.. ఇతర జంతువులను వేటాడి చంపుతూ అడవిని శాసించిన ఈ క్రూరమృగాలు.. ఇప్పుడు మనుగడ కోసం మూగపోరాటం చేస్తున్నాయి.

భారత్‌లో ఆశాజనకంగా పులుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో 3, 900 పులులు ఉండగా.. వాటిలో 75% వ్యాఘ్రాలకు భారత్ ఆలవాలం. 20వ శతాబ్దం ప్రారంభం నాటికే ప్రపంచ పులుల జనాభాలో 90% అంతరించి పోయాయి. వందేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష పులులు బతికినట్లు రికార్డులు ఉండగా ఈ శతాబ్ద కాలంలోనే వీటి మనుగడ ప్రమాదపు అంచులకు చేరుకుంది. 2018లో నిర్వహించిన పులుల గణన ప్రకారం.. భారత్‌లో 2,967 పులులు ఉన్నాయి. ఒకే ఏడాదిలో ఆయా పులుల అభయారణయ్యాల్లోని 2,461 పులుల కదలికల్ని కెమెరాల ద్వారా చిత్రీకరించిన కేంద్ర పర్యావరణ , అటవీ మంత్రిత్వ శాఖ.. గిన్నిస్ రికార్డు సైతం కైవసం చేసుకుంది. ఇందుకోసం లక్షా 21వేల 337 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం జల్లెడ పట్టారు. ప్రస్తుతం భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, థాయ్ లాండ్, చైనా, రష్యా తదితర దేశాల్లో మాత్రమే పులుల కదలికలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సంఖ్య

2006లో ఏర్పాటైన జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ-ఎన్‌టీసీఏ ఇప్పటికి 4 సార్లు దేశవ్యాప్తంగా వన్యప్రాణుల గణన చేపట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ నాటి నుంచి దేశంలో పులుల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. 2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య 68 కాగా, 2018 నాటికి ఏపీ, తెలంగాణల్లో కలిపి వీటి సంఖ్య 74కు చేరింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నాయి. డబ్బుల కోసమో .. దర్పం కోసమో.. వేటాడే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఈ సరదా.. పులుల ప్రాణాలు తీస్తోంది. కొన్ని గిరిజన గ్రామాల్లో.. నివాసాలపై పులులు చేసే దాడులను నిలువరించటానికి వాటిని వేటాడుతున్నారు. గతేడాది వేర్వేరు కారణాల వల్ల దేశంలో 100 పులులు మృత్యువాత పడ్డాయి. సరిహద్దుల కోసం పులుల మధ్య ఘర్షణలు, ఇతరులు వాటిని వేటాడటం, ప్రమాదాలు, ప్రకృతివైపరీత్యాల కారణంగా పులులు మృత్యువాత పడినట్లు ఎన్‌టీసీఏ వెల్లడించిది.


జీవవైవిధ్యంలో ప్రత్యేకంగా నిలిచే.. అటవీ ప్రాంతంలో అతిపెద్ద క్రూరమృగాల్లో ఒకటైన పులుల సంరక్షణ కోసం కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఏటా జులై29న ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తారు. 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఓ సదస్సులో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పులులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు సంరక్షించటం .. వేటాడకుండా ప్రజల్లో అవగాహన కల్పిచటం లాంటి చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య ఎంతో కొంత పెరిగినప్పటికీ.. రక్షణ చర్యలు అంతంతమాత్రంగా ఉండటం వల్ల ఆందోళన వీడటం లేదు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ముందంజ

పులుల సంరక్షణ కోసం ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ.. గ్లోబల్ టైగర్ ఫోరం ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్యను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 2022 నాటికి పులుల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించుకున్న ఈ సంస్థ.. మిగిలిన దేశాలను లక్ష్యం దిశగా సమాయత్తం చేస్తోంది. ప్రత్యేకించి భారత్ మిగిలిన దేశాలతో పోలిస్తే పులుల సంరక్షణలో ముందుంది. 1973 నాటికి దేశంలో పులుల అభయారణ్యాలు 9 మాత్రమే ఉండగా.. వీటి సంఖ్య ప్రస్తుతం 51కి చేరుకుంది. తమిళనాడులోని మేఘమలై, శ్రీవల్లి పుత్తూరు అటవీప్రాంతాన్ని..పులుల అభయారణ్యంగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. తెలంగాణలో పులుల కోసం అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలు ఉండగా.. ఏపీలో శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యం దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ అభయారణ్యంలో కనీసం 70 పులులు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అంతరించిపోతున్న పులుల జాతులు

పులులలో 41 రకాల ఉప జాతులున్నా.. ప్రస్తుతం ఆరు ఉపతెగలే మనుగడ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 6 తెగల్లో బెంగాల్ టైగర్, అమూర్‌ టైగర్, దక్షిణ చైనా, సుమత్రాన్, ఇండో చైనీస్, మలయన్ రకాల పులులు ఉన్నాయి. కెస్పియన్, జవాన్, బాలి అనే 3 రకాల పులులు ఇది వరకే అంతరించిపోయాయి. అంతరించిపోయే పరిస్థితిలో ఉన్న పులి జాతులు రక్షించుకోవడానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నా.. చాలా దేశాల్లో పులుల గణాంక వివరాలు లేకపోవటం సమస్యగా మారింది. 20 నుంచి 30 లక్షల సంవత్సరాలుగా పులులు భూమిపై సంచరిస్తున్నాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. చారిత్రకంగా పులుల సంతతికి ఎన్నో ప్రమాదాలు ముంచుకొచ్చాయని ఎన్నో నివేదికలు వెల్లడించాయి. వివిధ రకాల పులుల సంతతికి సంబంధించి చాలా తక్కువ ఆధారాలు కనుగొన్నారు పరిశోధకులు.


భారత్‌లోని పులుల్లో.. బెంగాల్‌ పులి రాజసమే వేరు. చూస్తేనే వణుకు పుట్టేలా ఉండే రాయల్ బెంగాల్ టైగర్‌లు.. పశ్చిమబంగ, బంగ్లాదేశ్‌ల్లో విస్తరించిన సుందర్‌బన్‌ అడవుల్లో జీవిస్తాయి. ఇప్పటికే అంతరించే స్థాయికి చేరుకున్న ఈ పులులు వచ్చే 50 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 10వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న మడ అడవుల్లో ప్రస్తుతం వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా సుందర్‌బన్‌ అడవులు 2070 నాటికి అదృశ్యం అవుతాయని.. బెంగాల్‌ పులులు, ఇతర జాతులు అంతరించిపోతాయని ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్‌ కుక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.


పులి గరిష్ఠ ఆయుష్షు 26 సంవత్సరాలు అయినా అనేక రకాల సమస్యల వలన 10ఏళ్లకు మించి బతుకుతున్నట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతం బతికి ఉన్న పులుల్లో ఎక్కువశాతం జంతు ప్రదర్శన శాలల్లోనే ఉన్నాయి. అడవులలో చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇందుకు కారణం వేట. పులి ఉచ్చులో పడితే వేటగాళ్ల పంట పండినట్లే. గోళ్ల నుంచి చర్మం, ఎముకలు.. ఇలా అన్ని భాగాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పెద్దపులి చర్మం 25 లక్షల రూపాయల ధర పలుకుతున్నట్లు సమాచారం. పెద్దపులి చర్మం, గోళ్లు, ఎముకలకు అంతర్జాతీయంగా గిరాకీ ఉంటోంది.

పులులను కాపాడుకోవాలంటున్న పర్యావరణ వేత్తలు

ఒక్క పులిని కాపాడుకోవాలంటే 25 వేల ఎకరాల అడవి పరిరక్షించుకోవాల్సి ఉంటుందనేది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. అంటే.. అటవీ విస్తీర్ణం పెంచుకోవటమే.. అరుదైన పులి జాతులు సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించే ఏకైక మార్గం అని అర్థం అవుతోంది. సంరక్షణ కేంద్రాల్లోని పులులకూ భద్రత కరవుఅవటమే .. ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి.. వరల్డ్ యానిమల్ డే చట్టం ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి. ఎలాంటి బాధ,అసౌకర్యం కలిగించకూడదు. వ్యాధులు గాయాల నుంచి కాపాడాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప.. క్షేత్రస్థాయిలో ఆచరణ కావటం లేదు.


వన్యప్రాణి సంరక్షణ చట్టానికి 2006లో సవరణ తెచ్చి, జాతీయ పులుల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసింది కేంద్రం. పులుల్ని వేటాడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తెచ్చింది. వాటి సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. జీవవైవిధ్యం లో ప్రతీ జీవి కీలకమే. తనకంటూ ఓ ప్రత్యేకత కలిగి.. ప్రకృతి సమతుల్యత కీలక పాత్ర పోషించే జీవరాశులను కాపాడుకోలేకపోతే మానవాళికే నష్టం. ప్రపంచ పులుల దినోత్సవం వేళ పర్యావరణ వేత్తలు ప్రపంచానికి అందిస్తున్న సందేశం ఇదే.

ఇదీ చూడండి:

కొత్తగా 1,180 పోస్టులు..ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.