ETV Bharat / city

కన్నవాళ్లను ఒప్పించలేక... కలిసి బతకలేక..

author img

By

Published : Dec 20, 2020, 6:20 PM IST

ఒకరి ప్రేమ జీవిత భాగస్వామిని కోరుకుంటుంది... మరొకరి ప్రేమ పిల్లల భవిష్యత్తు కోసం పరితపిస్తుంది. ఒక మనసు పెద్దల్ని అయినా ఎదిరించమంటుంది.. మరో మనసు సమాజ అడ్డుగోడలు దాటలేక సతమతమవుతుంది. ఈ నేపథ్యంలో.... పెద్దల్ని ఒప్పించలేక పిల్లలు... పిల్లలకి నచ్చజెప్పలేక పెద్దలు ఇద్దరూ అంతులేని మానసిక సంఘర్షణల్లో నలిగిపోతున్నారు. చివరికి ఎవరిని బాధ్యులు చేయాలో తెలియక... తమ ప్రాణాలను తీసుకుంటున్నారు కొందరు ప్రేమికులు.

కన్నవాళ్లను ఒప్పించలేక.. కలిసి బతకలేక..
కన్నవాళ్లను ఒప్పించలేక.. కలిసి బతకలేక..

కన్నవాళ్లను ఒప్పించలేక.. కలిసి బతకలేక..

ఎప్పుడు ఏ క్షణం.. ఎవరిపై ప్రేమ పుడుతుందో ఎవరికీ తెలియదు. బహుశా అలా తెలిసుంటే.. ఆ క్షణాన ఏ అమ్మాయి గడప దాటదు. ఒక చిత్రంలోని డైలాగ్‌ ఇది. కానీ, అక్షరాల సత్యం. అందుకే, ఆస్తి, అంతస్తులతో సంబంధం లేకుండా... కుల, మతాలకతీతంగా ప్రేమ ఇద్దరిని కలుపుతుంది. ఎన్నో అవరోధాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ... కలిసి బతకాలనే కోరిక వారిని ముందుండి నడిపిస్తుంది. పెద్దల్ని ఒప్పించి కొందరు పెళ్లి చేసుకుంటుంటే... ఒప్పించ లేక పారిపోయి ఒక్కటవుతున్నారు కొందరు. కానీ.. కొంతమంది మాత్రం ఆ ప్రయాణంలో అడుగులు ఎటువేయాలో తెలియక చివరకు ప్రాణాలనే అర్పిస్తున్నారు.

మీ పెద్దోళ్లున్నారే.. ఎప్పటికీ అర్థం చేసుకోరు

ప్రేమ కారణంగా దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంలో 2017లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం ప్రేమ సంబంధిత కారణాలతో 5,000మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తేల్చారు. వన్‌సైడ్‌ లవ్, ప్రేమ తర్వాత తగాదాలు, బ్రేకప్‌లు, ఇలా ఎన్నో కారణాలవుతున్నాయి ఈ బలన్మరణాలకు. కానీ వారి ప్రేమ ఫలించింది అనుకున్న తర్వాత.. పెద్దల్ని ఒప్పించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందరిది. ప్రేమ మీద పెద్దలకు ఎందుకు నమ్మకం లేకుండా పోతుంది..? ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎందుకంత ఆగ్రహిస్తున్నారు..? వారి వారి వయసుల్లో వారికి నచ్చిన ప్రేమ పిల్లల విషయానికొచ్చేసరికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.? పిల్లల మనసుల్లో తొలుస్తున్న ప్రశ్నలివి.

ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అవాంతరాలు

జాతీయ నేర గణాంక సంస్థ అంచనాల ప్రకారం దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకొకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కానీ కోటి ఆశలు, కొత్త ఆకాంక్షలతో ప్రపంచానికి స్వాగతం చెప్పాల్సిన యువతరం ప్రేమపేరుతో ఆ జాబితాలో చేరడమే జీర్ణించుకోలేని విషయం. కులం, మతం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆర్థిక స్తోమత, ఇలా ఎన్నో కారణాలు ప్రేమజంటల్ని దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నాయి. అయితే పరువు హత్యలు, లేదంటే ఇలా ఆత్మహత్యలతో ప్రణయకావ్యాలు కాస్తా విషాదగీతాలు అవుతున్నాయి.

మీ సంతోషమే మేము కోరుకుంటాం.. కానీ..

ఈ విషయంలో తప్పెవరిది? ఒప్పెవరిది? తరతరాలుగా తేలని ఈ ముచ్చట మీద పాత – కొత్త తరాల మధ్య అంతులేని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వలపువలకు - పేగు పాశానికి మధ్య గెలుపు ఓటములు ఇప్పట్లో తేలే విషయాలు కావు. పెద్దలు మాత్రం తమ వాదనలు స్పష్టంగా చెబుతున్నారు. మా కడుపు కాల్చుకుని మీ ఆకలి తీరుస్తాం. మీకు చిన్న దెబ్బ తగిలితే ఎంతగానో తల్లడిల్లిపోతాం. మమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోరు అనే... వారి ఆవేదనంతా. ముందు బాగా చదువుకోండి, బాగా స్థిరపడండి. అప్పుడు మీ ప్రేమ గురించి చెప్పండి. ఆలోచిస్తామో లేదో చూడండని చెబుతున్నారు... కొంతమంది తల్లిదండ్రులు.

ఓపికతో గెలవండి..

మరికొందరు తల్లిదండ్రులు పిల్లలతో ఈ విషయాలు నేరుగానే చర్చిస్తున్నారు. మీరు బాగుండటమే మా జీవిత ఆశయం. మీరు ఎవరినో ప్రేమిస్తారు. వాళ్ల గురించి మీకు తెలిసినంత మాకు తెలియదు కదా! ప్రేమ గురించి చెప్పగానే ఒప్పుకోవడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. మేం ఒప్పుకునేంత వరకూ వేచి చూడండి. వేరే సంబంధాలు చూస్తుంటే వ్యతిరేకించండి. మీకు ఇష్టం లేకుండా ఒక చిన్న వస్తువు కూడా కొనం. అలాంటిది మీ జీవితంలోకి ఒక మనిషిని తీసుకు వస్తాం అంటే ఎలా నమ్ముతారు. అంతే గానీ, ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఎలా..? జీవితానికి ఎలాంటి భరోసా లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా..? మా సంగతి పక్కన పెట్టండి. మీరు ఎలా బతుకుతారు..? అని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు.

నిపుణులేమంటున్నారు

ఇలా ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తూ పోవడం కాకుండా ప్రేమకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి ఓ వేదిక ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. ప్రేమంటేనే బతుకు... బతుకంటేనే ప్రేమ. కాబట్టి... ప్రేమను గెలిపించుకునే వరకు పోరాడండి..? అంతే కానీ, ప్రాణాలు తీసుకుని కన్నవాళ్లకు పుట్టెడు శోకాన్ని మిగల్చకండి... అని హితవు పలుకుతున్నారు నిపుణులు.

ఇదీ చూడండి: కువైట్ నుంచి చేరుకుంది.. గన్నవరంలో అదృశ్యమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.