ETV Bharat / city

అనుమతి ఇచ్చి.. మళ్లీ కొర్రీలా.. కాళేశ్వరంపై అధికారులతో తెలంగాణ సీఎం

author img

By

Published : Oct 19, 2022, 9:32 AM IST

telangana cm KCR
తెలంగాణ సీఎం కేసీఆర్​

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ అనుమతి ఇచ్చి ఇప్పుడు పలు అంశాలకు సమాచారం కావాలని కోరడం ఆశ్చర్యంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం.

కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇచ్చి.. నిర్మాణం చేపట్టిన తర్వాత మళ్లీ పలు అంశాలకు సమాచారం కావాలని కోరడం ఆశ్చర్యంగా ఉందని, దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు టీఎంసీ పనికి అనుమతి కోరుతూ సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను నీటిపారుదల శాఖ కేంద్ర జలసంఘానికి సమర్పించింది.

గోదావరిలో వరద నీటి లభ్యత ఉండే రోజులు తగ్గినందున తక్కువ రోజుల్లో ఎక్కువ నీటిని ఎత్తిపోసేందుకు పని చేపట్టామని.. తీసుకొనే నీటిలో, ఆయకట్టులో ఎలాంటి మార్పులేదని డీపీఆర్‌లో పేర్కొంది. నిర్మాణ అంచనా వ్యయం మాత్రం రూ.80,500 కోట్ల నుంచి రూ.లక్షా ఏడువేల కోట్లకు పెరిగినట్లు వివరించింది. దీనిపై పలు కొర్రీలు వేస్తూ జలసంఘం లేఖ రాసింది.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఎత్తిపోసిన నీళ్లు, వినియోగించిన విద్యుత్‌, నిర్వహణ వ్యయం, టెండర్లు, గుత్తేదారులు తదితర అంశాలకు సంబంధించి వివరాలు కోరింది. ఇటీవల పంపుహౌస్‌లు మునగడానికి కారణాలు, పంపుహౌస్‌ల మట్టాలు, గోదావరిపై ఎక్కువ నీటిని నిల్వచేసేలా బ్యారేజీలు నిర్మించకుండా ఆన్‌లైన్‌ రిజర్వాయర్లు ఎక్కువ సామర్థ్యంతో ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ఇలా మొత్తం 12 ప్రశ్నలు వేసింది.

దీనికి సమాధానమిచ్చేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు చేశారు. అయితే దీల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ హరిరాం, సీఎంఓ ప్రత్యేకాధికారి శ్రీధర్‌ దేశ్‌పాండేలు సోమవారం అక్కడికి వెళ్లారు. ముఖ్యమంత్రి అధికారులతో చర్చించిన తర్వాత.. గతంలో అనుమతించిన ప్రాజెక్టు గురించి మళ్లీ వివరాలు కోరడం ఆశ్చర్యంగా ఉందని, దేశంలో ఎక్కడా ఇలా జరగలేదని అన్నట్లు తెలిసింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు రెండు టీఎంసీలకు టీఏసీ అనుమతి ఇచ్చి, మళ్లీ ఇప్పుడు అదే అంశానికి సంబంధించి వివరాలు అడగడమేమిటంటూ.. అన్ని అంశాలపై చర్చించిన తర్వాత ప్రస్తుతం ఎలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.