ETV Bharat / city

అమరావతి రైతుల పాదయాత్రపై హింస... దాడులే నిదర్శనం

author img

By

Published : Oct 19, 2022, 8:22 AM IST

Amaravati farmers Maha Padayatra
పాదయాత్రపై హింస

Obstacles to Padayatra: అమరావతి రైతుల పాదయాత్రపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ప్రాయోజిత హింసకు దిగుతోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. వైకాపా నేతలు యాత్రపై వరుసగా చేస్తున్న దాడులే ఇందుకు నిదర్శనం. ప్రతిపక్షాలు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు ఇలా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినా అరెస్టులు, నోటీసులు, నిర్బంధాల పేరిట అడ్డుకునే పోలీసులు.. రైతుల యాత్రపై వైకాపా నేతలు దాడులు చేస్తుంటే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అధికార పార్టీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు.

పాదయాత్రపై హింస

Obstacles to Padayatra: మీరు నిరసనలు చేసుకోండి..కానీ..అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దు. యాత్రలో వైకాపా నిరసనలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఇదీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన సమాధానం. ఇదే వైకాపా శ్రేణులకు అలుసుగా మారింది. ఆందోళనలు, కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాల్సిన పోలీస్‌ బాసే.. నిరసనలు చేసుకోండి అని బహిరంగంగా ప్రకటిస్తే ఇక వైకాపా నేతలకు అడ్డుంటుందా. ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు రెచ్చిపోతూ.. అమరావతి రైతులపై దాడులకు తెగపడుతున్నారని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన దగ్గరి నుంచే అడుగడుగునా సృష్టించిన ఆటంకాలు.. రాజమహేంద్రవరం చేరేసరికి పరాకాష్టకు చేరుకున్నాయని వారు గుర్తుచేస్తున్నారు.

అధికార పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు ఇదే తరహాలో నిరసనలు చేపడితే పోలీసులు ఊరుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడల్లా కిలోమీటర్ల మేర బారికేడ్లు పెట్టి, పరదాలు కప్పేసి, ప్రతిపక్ష నాయకులను, ప్రశ్నించే గొంతులను అరెస్టులు, గృహనిర్బంధాలు చేస్తున్న పోలీసులు.. కోర్టు అనుమతితో యాత్ర సాగిస్తున్న రైతులపై దాడులకు దిగుతున్న వైకాపా నాయకులను నిరసనలు చేసుకోండి అని అనుమతివ్వడం ఏంటి. ఇది పోలీసు ప్రాయోజిత అరాచకం కాదా. వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో యాత్రపై దాడికి దిగి రణరంగం సృష్టించడం, పోలీసుల సమక్షంలోనే పెట్రోల్‌ బాటిల్స్‌, నీటి సీసాలు, రాళ్లు విసరడం వీటి ఫలితం కాదా. ఇదంతా డీజీపీ వ్యాఖ్యల ఫలితమే కాదా అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అమరావతి రైతుల పాదయాత్రపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతారని, అడ్డుకుంటారని.. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అందరూ ఊహించిందే. సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఇతర వైకాపా నేతల ప్రకటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటప్పుడు స్వయంగా పర్యవేక్షించాల్సిన తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో లేరు. కోనసీమ జిల్లా ఎస్పీగా ఉన్న ఆయన.. మంగళవారం ఘటనాస్థలికి కాదు కదా రాజమహేంద్రవరానికే రాలేదు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేసిన ఐశ్వర్య రస్తోగి కొన్ని నెలల కిందట కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లారు. సున్నితమైన ఈ జిల్లాలో, అదీ పాదయాత్ర జరుగుతుందని తెలిసినా ఎస్పీని ఎందుకు నియమించలేదన్నది ప్రశ్నగా మారింది.

పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడానికి ముందు.. యాత్ర చేస్తే ఉద్రిక్తతలు తలెత్తుతాయని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అనుమతి నిరాకరించారు. మరి వైకాపా శ్రేణులు రైతులపై దాడికి తెగబడుతుంటే వారికి ఏ అనుమతి ఉందని అక్కడికి రానిస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నల్లబెలూన్లు ఎగరేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఏ అనుమతి ఉందని పోలీసులు సహకరిస్తున్నారు. యాత్రను అడ్డుకుంటామని మంత్రులు, ఇతర వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దాడులు జరిగే పరిస్థితి వచ్చేవరకూ ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేని పరిస్థితి.

ఉత్తరాంధ్ర గర్జన ఉందని తెలిసీ అదే రోజున పవన్‌కల్యాణ్‌ విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ప్రజల్ని రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే ఇలా చేశారని వైకాపా నేతలు ఆరోపించారు. పైగా పవన్‌ను విశాఖ విడిచిపెట్టి వెళ్లిపోవాలని నోటీసులిచ్చారు. నారా లోకేశ్‌ కడప పర్యటనకు వెళ్తుంటే స్థానిక తెదేపా నేతలు ఆయన పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులిచ్చారు. మరి అమరావతి రైతులు నెలన్నరగా యాత్ర చేస్తుంటే యాత్ర ఏ ఊరిలో సాగుతుంటే అక్కడ వైకాపా నాయకులు నిరసనల పేరిట అలజడులు సృష్టిస్తున్నారు. ఇది రెచ్చగొట్టడం కాదా. అధికార పార్టీకి ఓ న్యాయం. రైతులకు, ప్రతిపక్షాలకు మరో న్యాయమా. అసలు శాంతిభద్రతల సమస్యకు కారణం అవుతున్న వైకాపా నేతలను పోలీసులు ఎందుకు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.