ETV Bharat / city

Fibernet case: ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావుకు బెయిలు

author img

By

Published : Sep 20, 2021, 1:27 PM IST

Updated : Sep 21, 2021, 4:49 AM IST

High Court
High Court

13:24 September 20

సాంబశివరావుకు హైకోర్టులో ఊరట

 

    ఏపీ రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఫ్‌ఎల్‌) తొలిదశ టెండర్ల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావుకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. పిటిషనర్‌ ప్రస్తుతం రైల్వేశాఖలో పనిచేస్తున్నారని, ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ఆయన వద్ద లేవని గుర్తుచేసింది. బెయిలిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం లేదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత సోమవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. 

          ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌(ఐఆర్‌టీఎస్‌) అధికారి సాంబశివరావు 2015 జనవరి 28 నుంచి 2018 డిసెంబరు 10 వరకు డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. 2016 మార్చి 4వరకు ఏపీ మౌలిక వసతుల సంస్థ(ఇన్‌క్యాప్‌) వీసీఅండ్‌ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఫైబర్‌ నెట్‌ తొలిదశ టెండర్లను టెరా సంస్థకు అక్రమ పద్ధతిలో కట్టబెట్టారన్న కారణంతో సాంబశివరావును రెండో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈనెల 18న అరెస్టు చేసింది. దాంతో తనకు బెయిలు ఇవ్వాలని సాంబశివరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘టెండర్లలో అక్రమాలకు తావేలేదు. బిడ్‌ దస్త్రాలను వివిధ కమిటీలు పరిశీలించి, ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం అది. కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా పిటిషనర్‌ను విచారించడానికి వీల్లేదు. అలాంటిది కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనిశా ప్రత్యేక న్యాయస్థానం జడ్జికి... పిటిషనర్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపే అధికారం ఉండదు. ఆ విషయాన్ని జడ్జి ముందు లేవనెత్తితే తోసిపుచ్చారు. ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్టులలోనూ పిటిషనర్‌పై నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. ఆరేళ్ల తర్వాత కేసు నమోదు చేయడం కక్షసాధింపుకోసమే. మాతృసంస్థ రైల్వేలో పిటిషనర్‌ పనిచేస్తున్నందున ఈ కేసు వ్యవహారంలో జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నంకాదు. 48 గంటలకు మించి పిటిషనర్‌ జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉంటే.. ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసే అవకాశముంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తక్షణం బెయిలు మంజూరు చేయండి’ అని కోరారు. 

     సీఐడీ తరఫున అదనపు ఏజీ జాస్తి నాగభూషణ్‌ వాదనలు వినిపిస్తూ... ‘టెరా సంస్థ బిడ్‌ దాఖలు చేసేందుకు వీలుగా టెండర్‌ గడువును పిటిషనర్‌ ఉద్దేశపూర్వకంగా పొడిగించారు. ఈ ఘటన 2018కి పూర్వం చోటు చేసుకున్న నేపథ్యంలో పిటిషనర్‌ను విచారించేందుకు కేంద్రం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ విషయంలో ఎంతమంది పాత్ర ఉందో తేల్చాల్సిన అవసరం ఉంది. బెయిలు ఇవ్వొద్దు’ అని కోరారు. ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సాంబశివరావుకు కొన్ని షరతులు విధించారు. ‘విడుదల అయ్యేందుకు విజయవాడ అనిశా కోర్టులో రూ.లక్షతో రెండు పూచీకత్తులు సమర్పించాలి. అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌వో వద్ద  ప్రతి ఆదివారం హాజరుకావాలి. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, సాక్ష్యాల తారుమారుకు యత్నించకూడదు. దర్యాప్తునకు సహకరించాలి. షరతులను ఉల్లంఘిస్తే బెయిలు రద్దు కోసం అభ్యర్థించే స్వేచ్ఛ ప్రాసిక్యూషన్‌కు ఉంటుంది’ అని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి

AP High Court: హైకోర్టులో ఐఆర్‌టీఎస్‌ అధికారి సాంబశివరావు అత్యవసర వ్యాజ్యం

Last Updated :Sep 21, 2021, 4:49 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.