ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Sep 26, 2022, 8:41 PM IST

Dussera Navratri Celebrations
దసరా శరన్నావరాత్రి ఉత్సవాలు

Navratri Celebrations: రాష్ట్రంలో దసరా సందడి నెలకొంది. ఇంద్రకీలాద్రి, శ్రీశైలంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ఆలయాల్లో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ చోట్ల కలశ ప్రదర్శనలు, అభిషేకాలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Dussera Navratri Celebrations : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. సింహవాహనాన్ని అధిష్ఠించిన జగజ్జననీ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ ఆయుధాలు ధరించారు. గవర్నర్‌ దంపతులు కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఉషా శ్రీ చరణ్‌, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి దేవినేని ఉమా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం ఈవో లవన్న, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి, అర్చకులు భ్రమరాంబ దేవికి పసుపు, కుంకుమ సమర్పించారు. స్వామి అమ్మవార్ల యాగశాలలో విశేష పూజలు జరిగాయి.

నెల్లూరులోని రంగనాథుని దేవస్థానం నుంచి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు కలశాలతో భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు. పెన్నా జలాలను వెయ్యి ఎనిమిది కలశాలలో నింపి అమ్మవారికి అభిషేకం చేశారు. వెండి రథానికి సంప్రోక్షణ చేశారు. ఆత్మకూరులో 108 కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు.

బాపట్ల జిల్లా చీరాలలోని సంతబజార్‌లో ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 516 మంది మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి జలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దసరా ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు. వైయస్సార్​ జిల్లా ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు రజిత కవచాలంకృత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని బాలాత్రిపుర సుందరిదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అలంకారంలో అభయ ప్రదానం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం, ముమ్మడివరం, తాళ్లరేవు మండలాల్లో తొలిరోజు దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు కలశస్థాపనలో పాల్గొన్నారు. కూడళ్లలో ప్రత్యేకంగా మండపాలు నిర్మించి అమ్మవారిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. భవానీ దీక్షాదారులు మాలధారణ చేసుకున్నారు. విశాఖ శారదా పీఠంలోని రాజశ్యామల అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో కనిపించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు.. చండీ హోమం, రాజశ్యామల హోమాలకు అంకురార్పణ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.