ETV Bharat / city

ఓట్ల లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి: సీఎస్‌

author img

By

Published : Sep 18, 2021, 7:06 AM IST

సీఎస్‌
సీఎస్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకొని ఉండాలన్నారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించి.. పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకొని ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ అన్నారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించి.. పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య శ్రవణ విధానం ద్వారా శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

‘లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా కలెక్టరు, ఎస్పీలు కలిసి చర్చించుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి కేంద్రం వద్ద ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని బాధ్యుడిగా పెట్టాలి. జేసీలకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాలి’ అని సీఎస్ ఆదేశించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు తాము అన్ని వేళల్లో సిద్ధంగా ఉంటామని అన్నారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లోనూ సీసీటీవీలతో నిఘాకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ మాట్లాడుతూ లెక్కింపు కేంద్రాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండాలని, అందుకు వీలుగా జనరేటర్లు కూడా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. బ్యాలెట్‌ బాక్సుల్ని కౌంటింగ్‌ హాలులోకి తీసుకొచ్చే సమయంలో పూర్తిగా సీసీటీవీ కవరేజీ ఉండాలని అన్నారు.

ఇదీ చదవండి: CM Jagan: 'గిరిజన ప్రాంతాల్లో నాడు-నేడుకు కేంద్ర సాయం కోరాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.