ETV Bharat / city

CM Jagan: 'గిరిజన ప్రాంతాల్లో నాడు-నేడుకు కేంద్ర సాయం కోరాలి'

author img

By

Published : Sep 17, 2021, 5:28 PM IST

Updated : Sep 18, 2021, 4:18 AM IST

హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించారు. ఆసరా, చేయూత, అమ్మఒడి పథకాలతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు.

గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం

గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న ‘నాడు-నేడు’ కార్యక్రమాలకు కేంద్ర సహకారం కోరాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని అన్ని గ్రామసచివాలయాలకు ఆధార్‌ కేంద్రాలుగా గుర్తింపు అడగాలని సూచించారు. ప్రతి గిరిజన గ్రామానికి ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలందించేలా ఒక విధానాన్ని రూపొందించి దాని అమలుకు కేంద్ర సహకారం కోరాలని నిర్దేశించారు. వామపక్ష తీవ్రవాదంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈనెల 26న దిల్లీలో సమావేశం నిర్వహించనుంది. అందులో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామసచివాలయాలున్న ప్రతిచోటా పోస్టాఫీసు ఉండాలని, ఈ మేరకు మ్యాపింగ్‌ చేసి లేనిచోట్ల వాటిని ఏర్పాటుచేసేలా కేంద్రానికి విన్నవించాలని, గిరిజన విశ్వవిద్యాలయం త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. ‘గ్రామసచివాలయాల ఉద్యోగులుగా, వాలంటీర్లుగా గిరిజనులను నియమించాం. తద్వారా వారి గ్రామాల్లోనే పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాం. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చాం. వాటిని పొందినవారికి రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఆ భూముల్లో బోర్లు వేసి పంటల సాగు కార్యాచరణ రూపొందించాం. 31,155 ఎకరాల డీకేటీ పట్టాలను 19,919 మంది గిరిజనులకు ఇచ్చాం. స్థానిక ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే పూర్తిగా రిజర్వేషన్‌ కల్పించాం. ఇవన్నీ వారి జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయి’ అని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో మావోయిస్టులు 50 మందే : డీజీపీ

రాష్ట్రంలో మావోయిస్టుల సంఖ్య 50కి పరిమితమైందని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ సీఎంకు వివరించారు. మావోయిస్టుల్లో చేరేందుకు గిరిజన యువకులు ఆసక్తి చూపించడం లేదని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే దీనికి కారణమని చెప్పారు.

ఇదీ చదవండి

CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

Last Updated : Sep 18, 2021, 4:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.