ETV Bharat / city

కొవిడ్ బాధితులకు టీకానే రక్ష

author img

By

Published : May 10, 2021, 7:03 AM IST

Vaccine is Safe
Vaccine is Safe

కొవిడ్ బాధితులకు వ్యాక్సిన్లు రక్షణగా నిలుస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు డోసులు పొందిన వారిలో కొంతమంది కరోనా బారినపడినా త్వరగా కోలుకుంటున్నారని చెబుతున్నారు. వీరి మరణాల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు తెలిపారు.

వైరస్‌ బాధితులకు టీకాలు రక్షణ ఇస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు డోసులు పొందిన వారిలో పలువురు కొవిడ్‌ బారినపడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. వీరిలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు వివరిస్తున్నారు. ఐసీయూల్లో చేరి, వెంటిలేటర్‌ చికిత్స పొందాల్సిన పరిస్థితులు తలెత్తడం లేదంటున్నారు. ప్రతి కొవిడ్‌ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందిలో 10% మంది వరకు వైరస్‌ బారినపడుతున్నా..టీకా రెండు డోసులు పొందిన వారు త్వరగా కోలుకొని విధులకు హాజరవుతున్నారని విజయవాడ జీజీహెచ్‌ సీనియర్‌ వైద్యులు ఒకరు చెబుతున్నారు. ఒక సారి కొవిడ్‌ సోకిన వారిలో సుమారు 5%లోపు వ్యక్తులు రెండోసారి కరోనా బారినపడుతున్నారని, అదే రెండు డోసులు టీకా పొందిన ఇలాంటి వారిలో ఇది ఒక శాతంలోపే ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

టీకాతో యాంటీబాడీల వృద్ధి!
కరోనా బారినపడి కోలుకున్న అనంతరం వారిలో సహజంగానే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. 70% మందిలో ఇవి బాగా వృద్ధి చెందినట్లు కనిపిస్తుండగా 30% మందిలో అంతగా స్పందన కనిపించడంలేదని డాక్టర్లంటున్నారు. రెండు డోసులు టీకా పొందిన వారిలో 14 రోజుల తర్వాత పరిశీలిస్తే అత్యధిక మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని చెబుతున్నారు. ఇవి బాగా వృద్ధి చెందితే కరోనా నుంచి 80శాతం వరకు రక్షణ లభించినట్లేనని వివరిస్తున్నారు. యాంటీబాడీలు వృద్ధి చెందని వారు, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, మధుమేహులు, క్యాన్సర్‌, మూత్రపిండాల రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మళ్లీ మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఎక్కువని, అలాంటి వారు తప్పక టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రెండు డోసుల ప్రభావం నాపై ఉంది

నాకు రక్తపోటు, మధుమేహ వ్యాధులు ఉన్నాయి. ఇటీవల వైరస్‌ సోకింది. గొంతునొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు మాత్రమే సాధారణ స్థాయిలో కనిపించాయి. జ్వరం ఒకసారి మాత్రమే వచ్చింది. క్రమంగా కోలుకుంటున్నా. రెండు డోసులు టీకా పొందడం ద్వారా రక్షణ లభించినట్లు అనిపిస్తోంది.

- డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌

కాస్త భరోసా

కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు, ఇతర సిబ్బందిలో అత్యధికులు రెండు డోసులు పొందిన వారే. గతేడాది మాదిరిగానే వైరస్‌ సోకుతున్నా ఎక్కువ మంది వెంటనే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఒకరు మాత్రం వెంటిలేటర్‌పై ఉన్నారు. కారణాలు తెలుసుకోవాల్సి ఉంది. టీకాల ద్వారా వచ్చే రక్షణను సద్వినియోగం చేసుకోవాలంటే...మాస్కు తప్పక ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి.

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ప్రిన్సిపాల్‌, ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖ

విజయవాడకు చెందిన ఎస్‌.నరసింహారావు(57), రేవతి (54) దంపతులు టీకా రెండు డోసులు పొందారు. ఇంట్లో కుమారుడికి వైరస్‌ సోకడంతో వీరూ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. నరసింహారావుకు బీపీ, షుగర్‌ ఉంది. దంపతులిద్దరిలో లక్షణాలు పెద్దగా కనిపించలేదు. కొవిడ్‌ సోకిన అయిదో రోజు సీటీ స్కాన్‌ తీయించగా ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి. టీకాల ప్రభావం వల్లనే వెంటనే కోలుకోగలిగామని నరసింహారావు చెప్పారు. టీకా పొందని తమ బంధువులు వైరస్‌కు గురై తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి

వేధిస్తోన్న ఆక్సిజన్ కొరత..నూతన ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.