ETV Bharat / city

CM Jagan: రోగులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలి: సీఎం

author img

By

Published : Sep 30, 2022, 5:13 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలను పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. రోగులకు మంచి మెను తయారు చేసి ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆరోగ్య శ్రీ జాబితాలో కొత్త చికిత్సల చేరికను అక్టోబరు 5కు బదులు... అక్టోబరు 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. అదే రోజున ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించారు. డిసెంబరు నాటికి మరో 432 కొత్త 104 వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను ఎప్పటి కప్పుడు భర్తీ చేసేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు.

Jagan
ముఖ్యమంత్రి జగన్

వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తోన్న ఆహారం, నాణ్యతపై ముఖ్యమంత్రి చర్చించారు. మరింత రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ డైట్‌ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100కు పెంచాలని ఆదేశించారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలని సీఎం సూచించారు.

జూనియర్‌ డాక్టర్ల స్టై ఫండ్‌ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. వైఎస్​ఆర్ ఆరోగ్య శ్రీలోకి కొత్త చికిత్సల చేరికలపై ప్రగతిపై సీఎం ఆరా తీశారు. వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సల చేరిక దాదాపు ఖరారు చేసినట్లు అధికారులు... ముఖ్యమంత్రికి తెలిపారు. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా కార్యక్రమం ప్రారంభానికి సమయం కావాలని కోరారు. అక్టోబరు 5కు బదులు... అక్టోబరు 15న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. దీనితో పాటు ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు ప్రారంభించాలని నిశ్చయించారు.

ప్రస్తుతం వైఎస్​ఆర్​ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉండగా.. కొత్త వాటి చేరికతో 3,254కు చికిత్సల సంఖ్య చేరనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగిందని సీఎం తెలిపారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా 2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు 300 కోట్ల108,104ల కోసం సుమారు మరో రూ.400 కోట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా దాదాపు 3వేల 200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి మరో 432 కొత్త 104 వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 676 వాహనాలు సేవలందిస్తుండగా...కొత్తవి చేరితే వాటి సంఖ్య 1108కి చేరనుంది. అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 748, 108 వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

విలేజ్‌ క్లినిక్స్‌లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. కొవిడ్‌ కిట్‌ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం నిర్దేశించారు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతినెలా ఆస్పత్రుల వారీగా ఆడిట్‌ చేయాలని, ఆ‌ నివేదికలు అధికారులకు చేరాలన్నారు. క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షించాలని సూచించారు.

ఎక్కడ సిబ్బంది ఖాళీ ఉన్నా వెంటనే మరొకర్ని నియమించే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం జగన్​ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూసేందుకు, నిరంతరం ఈ ప్రక్రియను మానిటర్‌ చేసి తగిన చర్యలు తీసుకునేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు ఆలోచన చేయాలన్నారు.

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపైనా సమీక్షించిన ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై మరింత ధ్యాస పెట్టాలన్నారు. అర్బన్‌హెల్త్‌ క్లినిక్స్‌ల నిర్మాణం నవంబర్‌ నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం 10 అవార్డుల్లో 6 ఏపీకే వచ్చాయని తెలిపారు. ఆరోగ్య రంగంలో సీఎం తీసుకుంటున్న చర్యలకు వచ్చిన గుర్తింపు అని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.