ETV Bharat / city

CBN: మోసపూరిత క్యాలెండరు ఉపసంహరించాలి: చంద్రబాబు నాయుడు

author img

By

Published : Jul 20, 2021, 4:27 AM IST

మోసపూరిత క్యాలెండరు ఉపసంహరించాలి: చంద్రబాబు నాయుడు
మోసపూరిత క్యాలెండరు ఉపసంహరించాలి: చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం మోసపూరిత ఉద్యోగ క్యాలెండరును ఉపసంహరించుకుని.. మరిన్ని ఖాళీలతో కొత్తది విడుదల చేసేవరకూ తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేసింది. యువతకు ఉద్యోగాలు రావాలంటే జగన్‌ దిగిపోవాల్సిన పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తింది. ప్రభుత్వ వైఖరిపై ఉద్యమిస్తున్న వందలాది మంది యువనేతల అక్రమ అరెస్టులను ఖండించింది.

వైకాపా ప్రభుత్వం మోసపూరిత ఉద్యోగ క్యాలెండరును ఉపసంహరించుకుని.. మరిన్ని ఖాళీలతో కొత్తది విడుదల చేసేవరకూ తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేసింది. యువతకు ఉద్యోగాలు రావాలంటే జగన్‌ దిగిపోవాల్సిన పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తింది. ప్రభుత్వ వైఖరిపై ఉద్యమిస్తున్న వందలాది మంది యువనేతల అక్రమ అరెస్టులను ఖండించింది. సోమవారం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నిమ్మకాయల చినరాజప్ప, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అశోక్‌బాబు, టీడీ జనార్థన్‌, పార్టీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమ, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు

తీర్మానం-1: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి సమీపంలో మహిళపై అత్యాచారం జరిగి నెల రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోకపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసే వరకూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి.

తీర్మానం-2: 1.5 కోట్ల కుటుంబాలకు ఉపయోగపడే ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టుకు అవినీతి రంగు పూసేందుకు సీఎం జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.149కే అంతర్జాలం, టీవీ, ఫోన్‌ సౌకర్యం కల్పించేందుకు తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ప్రధాని మోదీ అభినందించారు. వైకాపా నేతల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు తెదేపాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫైబర్‌నెట్‌ నెల రుసుము రూ.300కు పెంచి ప్రజలపై భారం వేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలి.

తీర్మానం-3: కేంద్రం తెచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీరందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇది వ్యవసాయ రంగానికి గొడ్డలిపెట్టులా మారుతోంది. జగన్‌ కేంద్రానికి లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులకు భయపడి నదీ జలాలపై రాష్ట్ర హక్కుల్ని ధారాదత్తం చేస్తున్నారు. సీఎం వైఖరి కారణంగా రాష్ట్రానికి నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం సాగునీటి రంగంలో లేనిపోని సమస్యలు సృష్టిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేయడాన్ని ఖండిస్తున్నాం.

తీర్మానం-4: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11 శాతం డీఏ ప్రకటించినా.. వైకాపా ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఉద్యోగులకు 7 డీఏలను పెండింగ్‌లో పెట్టింది. వేతనాలు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వకుండా వేధిస్తోంది. ఉద్యోగులకు అండగా ఉద్యమించాలి.

తీర్మానం-5: రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన రహదారుల విస్తరణ, మరమ్మతులు చేపట్టాలి. ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరమ్మతులు లేక అధ్వాన స్థితికి చేరుకున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ రోడ్డూ గోతుల్లేకుండా కనిపించడం లేదు. ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు.

తీర్మానం-6: వైకాపా ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని మంటగలిపింది. నిధులు, విధులు ఉండే ఛైర్మన్‌ పోస్టులను బలహీనవర్గాలు, మహిళలకే ఇవ్వలేదు.

తీర్మానం-7: రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి. నాలుగు నెలలు గడుస్తున్నా వాటిని విడుదల చేయకుండా దుబారా ఖర్చులు చేస్తోంది. వ్యవసాయ పెట్టుబడి రోజురోజుకూ పెరుగుతుంటే ప్రభుత్వ రాయితీలందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

తీర్మానం-8: అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండే.. ప్రజా వేదికను రాత్రికి రాత్రి నిర్ధాక్షిణ్యంగా కూల్చి జగన్‌ విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు. కృష్ణా-గుంటూరు జిల్లాలను కలిపేలా తెదేపా హయాంలో ప్రారంభించిన ఐకాన్‌ బ్రిడ్జి కోసం నిర్మించిన ప్లాట్‌ఫామ్‌ను ధ్వంసం చేశారు. రాజధాని వ్యవహారం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా.. దాన్ని ఎలా ధ్వంసం చేస్తారు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయి.

తీర్మానం-9: సేవాభావానికి మారుపేరైన మాన్సాస్‌ ట్రస్టుపై ప్రభుత్వ దుష్ప్రచారం గర్హనీయం.

తీర్మానం-10: సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే పోలీసులతో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు గురిచేస్తే... నిరసన తెలిపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలపై దాడులు, అక్రమ కేసులు, గృహ నిర్బంధాలను ఖండిస్తున్నాం.

ఇదీ చదవండి:

'దేశ ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఆ కథనాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.