ETV Bharat / city

సైబరాబాద్‌ను చూసినప్పుడు నాకెంతో సంతృప్తి: చంద్రబాబు

author img

By

Published : Aug 7, 2022, 8:30 AM IST

CBN: మంచి విధానాలతో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పడానికి వాజ్‌పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు, తాను తీసుకొచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమని తెలుగేదేశం అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఆయన శనివారం జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

CBN
CBN

CBN: ప్రభుత్వాలు మంచి విధానాలు రూపొందిస్తే చాలు.. డబ్బు ఖర్చు పెట్టకుండానే ప్రజలకు మేలు చేయొచ్చని చంద్రబాబు అన్నారు. దిల్లీలో ఆయన శనివారం జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మంచి విధానాలతో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పడానికి వాజ్‌పేయీ హయాంలో నిర్మించిన స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు, తాను తీసుకొచ్చిన ఐటీ విధానాలే నిదర్శనమన్నారు. ‘అప్పట్లో నేను మలేషియాకు వెళ్లినప్పుడు అక్కడి రోడ్లను చూశాక భారతీయ రోడ్లు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాజ్‌పేయీ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన పెద్దమనసుతో విన్నారు. స్వర్ణ చతుర్భుజికి ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత దేశ రహదారుల ముఖచిత్రమే మారిపోయింది’ అని బాబు గుర్తుచేశారు.

‘నేను ఐటీలో కొత్త విధానం తీసుకొచ్చి, సైబరాబాద్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఆ రంగంలో తెలుగు వారి ప్రాబల్యం రెక్కలు కట్టుకొని ఎగిరింది. ఇప్పుడు ప్రపంచంలోని ఐటీ నిపుణుల్లో తెలుగువారి వాటా 30% మేర ఉంది. విదేశాల్లోనూ అక్కడి రాజకీయాలను మనవాళ్లు ప్రభావితం చేయగలిగే స్థాయికి చేరారు. రాజకీయాల్లో ఓడొచ్చు, గెలవొచ్చు కానీ, మనం ప్రవేశపెట్టిన విధానాల వల్ల తరతరాలకు మేలు కలిగితే ఎంతో సంతృప్తినిస్తుంది. సైబరాబాద్‌ను చూస్తే నాకు అదే భావన కలుగుతుంది’ అని వివరించారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తాను వేసిన పునాదులను ప్రస్తుత ముఖ్యమంత్రి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని చంద్రబాబు విమర్శించారు. ‘జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. అరాచకం సాగిస్తూ, అభివృద్ధిని గాలికొదిలేశారు. నేడు ఏపీ అన్ని రంగాల్లో కుప్పకూలిపోయింది. ఆర్థిక పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. 2029 కల్లా ఏపీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా నేను పునాదులు వేసినప్పటికీ.. జగన్‌ వైఖరితో ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం, అమరావతి నిర్మాణానికి నేను పూనుకుంటే జగన్‌ ఆ రెండింటినీ నాశనం చేశారు. ఏ వర్గం ప్రజలూ ఇప్పుడు సంతోషంగా లేరు’ అని విమర్శించారు.

కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సహా అనేక విపత్తులు ఎదురైనా మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌ తట్టుకొని నిలబడిందన్నారు. యూరోప్‌ సహా అనేక దేశాలతో పోల్చితే భారత్‌ ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉందని, ప్రజల తలసరి ఆదాయం ఎక్కువే ఉందని విశ్లేషించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.