ETV Bharat / city

ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం

author img

By

Published : Aug 29, 2022, 9:44 PM IST

Updated : Aug 30, 2022, 6:31 AM IST

CENTER ORDERS TO TELANGANA
CENTER ORDERS TO TELANGANA

21:40 August 29

తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆదేశం

CENTER ORDERS TO TELANGANA: ఏపీ జెన్‌కోకు బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించాలని తెలంగాణ విద్యుత్‌ సంస్థలను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌కు రూ.3,441.78 కోట్లు, దీని చెల్లింపులో జాప్యానికి సర్‌ఛార్జీ రూపేణా రూ.3,315.14 కోట్లు (2022 జులై 31 వరకు) కలిపి మొత్తంగా రూ.6,756.92 కోట్లు 30 రోజుల్లో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

‘తెలంగాణ విద్యుత్‌ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి అనేకసార్లు వినతిపత్రాలు వచ్చాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 92 ప్రకారం బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్‌ సరఫరా జరిగినందున విభజన వివాదాలతో దీన్ని ముడిపెట్టడానికి వీల్లేదు. 30 రోజుల్లోగా ఏపీ జెన్‌కోకు ఉన్న బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని ఆదేశిస్తున్నాం’ అని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అనూప్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీచేశారు. వీటిని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డిస్కంల సీఎండీలు, ఏపీ జెన్‌కో ఎండీకి పంపారు.

బకాయిలపై కోర్టులో కేసులు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్‌ సిస్టం ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పోసోకో) 2014 మార్చి 28న ఉమ్మడి రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించింది. విభజన చట్టం నిబంధనల మేరకు తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయాలని 2014 జూన్‌ 18న ఏపీ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌కు (ఏపీఎస్‌ఎల్‌డీసీ) లేఖ రాసింది. దీని ప్రకారం 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది. ఉత్పత్తి సంస్థలతో ఉన్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ధరల ప్రకారం తీసుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కంలు డబ్బు చెల్లించాలి.

ఈ కాలంలో ఏపీ సరఫరా చేసిన విద్యుత్‌కు రూ.3,441.78 కోట్లు కట్టాలి. దీనిపై పలుమార్లు ఏపీ జెన్‌కో లేఖలు రాసినా పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ జెన్‌కో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసు వేసింది. అక్కడా వివాదం పరిష్కారం కాకపోవడంతో కేసును ఉపసంహరించుకొని, తెలంగాణ విద్యుత్‌ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అయినా, ప్రయోజనం లేకపోవడంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విభజన అంశాలను విద్యుత్‌ బకాయిలతో ముడిపెట్టి తెలంగాణ విద్యుత్‌ సంస్థలు కౌంటర్‌ పిటిషన్‌ వేశాయి. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు పేర్కొన్న అంశాలకు, విద్యుత్‌ బకాయిలకు సంబంధం లేదని ఏపీ జెన్‌కో కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఏపీ నుంచి రావాల్సిందే ఎక్కువ

‘రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ పరిధిలోని కేంద్రీయ విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) పరిధిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా మెరుగు పరచడానికి పలు అభివృద్ధి పనులను ప్రతిపాదించారు. దీనికోసం విద్యుత్‌ సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఈ రుణాల చెల్లింపునకు తీసుకున్న మొత్తం రూ.12,941 కోట్లు ఉంటుంది’ అని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవి ఎక్కువేనని, ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు బకాయిలు చెల్లించేది లేదని ఇంతకాలం చెబుతూ వచ్చాయి. విద్యుత్‌ బకాయిల అంశాన్ని ఏపీ ప్రభుత్వం పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

ఇది కచ్చితంగా దేశద్రోహ చర్యే, కేంద్రం ఏకపక్షంగా ఆదేశించింది : మంత్రి జగదీశ్‌రెడ్డి ఖండన

ఏపీ విద్యుత్‌ సంస్థలకు తెలంగాణ బకాయిలు చెల్లించాలని కేంద్రం ఉత్తర్వులివ్వడం కచ్చితంగా దేశద్రోహ చర్య అని తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సోమవారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఏపీ విద్యుత్‌ సంస్థలే తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు రూ.12,941 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వీటిపై కేంద్రానికి మొరపెట్టుకున్నా స్పందించలేదని ఆయన వివరించారు.

‘మాకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా పీపీఏ అమలులోనూ తెలంగాణకు ఏపీ నష్టమే చేసింది. అయినా కేంద్రం జోక్యం చేసుకోలేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినందుకే కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఏపీ రాసిన లేఖలే కేంద్రానికి కనిపిస్తున్నాయి. తెలంగాణ లేఖను మోదీ సర్కారు పట్టించుకోకుండా నెలరోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలని ఏకపక్షంగా ఆదేశాలివ్వడం దుర్మార్గం. జాతీయ ప్రభుత్వం ఇలా చేయకూడదు’ అని పేర్కొన్నారు. గుజరాత్‌తో పాటు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్‌ రంగం సంక్షోభంలో ఉందని, దిల్లీ సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కరెంటు కోతలు విధిస్తున్నా ఒక్క తెలంగాణలోనే కోతల్లేకుండా కరెంటు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

‘విద్యుత్‌ రంగంలో కేసీఆర్‌ సాధించిన విజయాలను భాజపా ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా చేసేందుకే ఇలా ఉత్తర్వులిచ్చింది. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం ఇలాంటి ధోరణే అవలంబిస్తోంది. అపెక్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ విన్నవించినా పట్టించుకోలేదు’ అని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 30, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.