ETV Bharat / city

'ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం'.. ఎగ్జిబిటర్ల మెడపై ప్రభుత్వం కత్తి

author img

By

Published : Jun 17, 2022, 7:37 AM IST

Govt on online movie tickets sales: టికెట్‌ ధరలు, అదనపు షోల కుదింపు సమస్యలతో నిన్నమెున్నటి వరకూ ఇబ్బంది పడిన సినీ పరిశ్రమపై ఆన్‌లైన్ టికెట్లు అంటూ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తుందంటూ ఇచ్చిన ఉత్తర్వులతో ఎగ్జిబిటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోకుంటే లైసెన్స్‌ రద్దు చేస్తామనే హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు.

ap govt on online movie tickets sales
ap govt on online movie tickets sales

Online Movie Tickets in AP: "ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు మేమే అమ్ముతాం... వసూళ్ల సొమ్ము నేరుగా మా నిర్వహణలోని ఖాతాకే చేరుతుంది. తర్వాత అందులో సేవారుసుము మినహాయించుకుని మిగతా మొత్తాన్ని మీ ఖాతాల్లో వేస్తాం. దీనికి తప్పనిసరిగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవాల్సిందే. కాదంటే మీ లైసెన్సు రద్దవుతుంది" థియేటర్ల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేస్తున్న హుకుం ఇది. వారి మెడపై కత్తి పెట్టి మరీ ఇలా ఒత్తిడి చేస్తోంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాన్ని తప్పనిసరి చేస్తూ ఈ నెల 2న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 30 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)తో ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంది. ఇప్పటికే ఒప్పందపత్రాలను (ఎంవోయూ) థియేటర్ల యాజమాన్యాలకు పంపించింది. వాటిలో నియమ నిబంధనలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఎగ్జిబిటర్లు.. స్పష్టత రానిదే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ససేమిరా అంటున్నారు. గడువులోగా ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సు రద్దు చేస్తామంటూ అధికారులు ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సీఎం జగన్‌కు తాజాగా లేఖ రాసింది. ‘టికెట్ల విక్రయాలను తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వారా చేపట్టాలి. ఆ లింక్‌ను ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీకి అందజేస్తాం. తద్వారా ఆన్‌లైన్‌ టికెట్ల ఆదాయం, థియేటర్‌ ఆక్యుపెన్సీ లాంటివి ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఆ లేఖలో వివరించారు.

ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోతే అడగగలమా? : ‘ఒప్పందంపై సంతకాలు చేస్తే సినిమా టికెట్ల వసూళ్లన్నీ ప్రభుత్వ నిర్వహణలో ఉండే ఖాతాల్లోకి వెళ్లిపోతాయి. వారు సకాలంలో ఆ సొమ్ము మాకు ఇవ్వకపోతే గట్టిగా అడిగి రాబట్టుకోగలమా? టికెట్ల డబ్బులే వారికి మేం ఇస్తుంటాం. ఇప్పుడా డబ్బు ప్రభుత్వం వద్ద ఆగిపోతే.. మా పరిస్థితి ఏంటి?’ అని ఓ ఎగ్జిబిటర్‌ ప్రశ్నించారు.

ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలకు విఘాతం : "పేటీఎం, బుక్‌ మై షో లాంటి ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సంస్థలతో ఇప్పటికే చాలా థియేటర్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటి కాలపరిమితి ముగియడానికి ఇంకా ఏళ్లు పడుతుంది. ఆయా సంస్థలు భారీగా అడ్వాన్సులు కూడా ఇచ్చాయి. ఇప్పుడు మేము ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంటే... వారి సర్వీసు ప్రొవైడర్‌ రూపొందించిన పోర్టల్‌ ద్వారానే బుక్‌ మై షో, పేటీఎం లాంటి సంస్థలు విక్రయాలు జరపాలి. ఇప్పటికే మేము ఆ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు అది విరుద్ధం. ఆయా సంస్థలు అడ్వాన్సులు తిరిగివ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం" అని రాజమహేంద్రవరానికి చెందిన ఓ ఎగ్జిబిటర్‌ ప్రశ్నించారు.

ఎగ్జిబిటర్ల ప్రశ్నలకు బదులేది?

  • సినిమా ప్రదర్శన లేకపోతే అడ్వాన్సు టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి డబ్బులు ఎవరు చెల్లించాలి?
  • థియేటర్‌కు నేరుగా వచ్చి టికెట్‌ తీసుకునేవారిపైనా 2% సేవారుసుము ఎందుకు విధిస్తున్నారు?
  • ఒప్పంద ఉల్లంఘన జరిగితే అమరావతిలోని మధ్యవర్తిత్వ కేంద్రంలో పరిష్కరించుకోవాలన్నారు. అందులో అందరూ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే ఎగ్జిబిటర్లకు న్యాయం జరుగుతుందా?

రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఆన్‌లైన్‌ విధానంలో టికెట్లు విక్రయించేందుకు వీలుగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ నిర్వహణ చూసే బాధ్యతల్ని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, జస్ట్‌ టికెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు అప్పగించింది. జస్ట్‌ టికెట్స్‌లో సినీ నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడు అల్లు వెంకటేశ్‌ (బాబీ) డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.