నీళ్లున్నా రైతులకు అందని దుస్థితి.. భారతీ సిమెంట్స్‌, వారి చేపల చెరువులకే లబ్ధి

author img

By

Published : Jun 17, 2022, 6:56 AM IST

Updated : Jun 17, 2022, 9:22 AM IST

farmers struggle for cultivation water

రాష్ట్రంలో వందల కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు నిర్మించినా.. ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. గండికోట జలాశయం, సర్వారాయ సాగర్, వామికొండ సాగర్‌లో పుష్కలంగా నీళ్లున్నా.. ఆయకట్టుకు నీళ్లందించే ప్రధాన కాల్వలు, పిల్లకాల్వలు తవ్వకపోవడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఈ మూడేళ్లలో జరిగిందేమిటంటే.. సర్వారాయ సాగర్‌ నుంచి భారతి సిమెంట్స్‌తోపాటు వైకాపా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల చేపల చెరువులకు నీరందించడం మాత్రమేనని రైతులు అంటున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి తొలిదశలో 35 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉన్నా.. 15వందల ఎకరాలకు మాత్రమే ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.

నీళ్లున్నా రైతులకు అందని దుస్థితి..

Kadapa farmers Struggle for Water: ప్రభుత్వం ఏ ప్రాజెక్టు కట్టినా.. రైతులకు ప్రయోజనం దక్కేలా చేయడమే లక్ష్యం. కానీ రాష్ట్రంలో భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నా.. కొన్నిచోట్ల ప్రయోజనాలు మాత్రం ప్రైవేటు వారికే దక్కుతున్నాయి. వైఎస్​ఆర్​​ జిల్లాలో సర్వారాయ సాగర్, వామికొండ సాగర్ పరిస్థితీ ఇదే. గండికోట నుంచి నీరు తీసుకొచ్చి 3 టీఎంసీల నీరు నిలబెట్టినా.. ఆయకట్టు రైతులు ఏమాత్రం వినియోగించుకోలని దుస్థితి ఏర్పడింది. వైఎస్​ఆర్​ జిల్లా, చిత్తూరు జిల్లాలోని 35 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ రిజర్వాయర్ల ద్వారా నీరందించాల్సి ఉంది. కాలువల ద్వారా సాగు నీటిని, ఆ ప్రాంత ప్రజల దాహార్తినీ తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు. మూడేళ్లుగా కనీసం ఒక్క ఎకరా ఆయకట్టును కూడా జోడించలేదు. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వమే బడ్జెట్‌లో స్పష్టంగా పేర్కొంది. 2019 నాటికి సర్వారాయ సాగర్ కింద 15వందల ఎకరాలకు నీరిచ్చినట్టు చెప్పిన ప్రభుత్వం.. ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్లోనూ ఇదే విషయం చెప్పింది. అదే సమయంలో.. ఈ రిజర్వాయర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పైపులైన్ ద్వారా భారతి సిమెంట్స్‌కు నీరందిస్తోంది. అలాగే ముఖ్యమంత్రితో బంధుత్వం ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు చెందిన 150 ఎకరాల చేపల చెరువులకు నీరిస్తోంది.

గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం కింద శ్రీశైలం నుంచి 38 టీఎంసీల వరద జలాలు మళ్లించాలనేది ప్రణాళిక. రెండు దశల్లో కలిపి వైఎస్సార్​, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2 లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. కాలువల వెంబడి ఉన్న 640 గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని 5 లక్షల జనాభాకు తాగునీటి సరఫరా కూడా ఇందులో భాగమే. తొలిదశలో గండికోట జలాశయానికి నీళ్లు పంపి... అక్కడి నుంచి వీరపనాయునిపల్లె, మైదుకూరు మండలాల్లోని సర్వారాయ సాగర్, వామికొండ సాగర్‌ జలాశయాలకు తరలించాలి. ఆ పరిధిలో 35 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి. అనుకున్నట్లే ప్రాజెక్టుల్లో నీళ్లు నిల్వ చేసినా.. ఆయకట్టుకు మాత్రం అందించడం లేదు.

ఈ రెండు జలాశయాల కింద ప్రధాన కాలువలు, పిల్ల కాలువల నిర్మాణానికి 212 కోట్లతో ప్రతిపాదనలు పంపినా... ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి 720 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణ కోసమే 40 కోట్లు అవసరమని లెక్కగట్టారు. కుడికాలువ 10 కిలోమీటర్ల మేర, ఎడమ కాలువ 16.5 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. అలాగే 82 కిలోమీటర్ల మేర పిల్లకాలువల పనులు చేపట్టాల్సి ఉంది. కాలువలు ఎప్పటికి తవ్వుతారో, ఎప్పటికి సాగునీరు అందుతుందో అని రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

రిజర్వాయర్‌ నుంచి పైపుల ద్వారా తరలించడం, భూగర్భ జలాలను తోడుకోవటం తప్ప.. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నేరుగా నీళ్లు అందడం లేదని రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. సర్వారాయ సాగర్, వామికొండ సాగర్‌ ప్రాజెక్టులతో మాదన్నగారిపల్లె, కోనాపురం, బందెగారిపల్లెకు ఊట నీటి సమస్య ఏర్పడింది. బోరునీటితో చీనిమ్మ పండించుకుంటున్న రైతులు కూడా ఊట సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


ఇదీ చదవండి:

Last Updated :Jun 17, 2022, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.