ETV Bharat / city

జనభేరి...అమరావతి ఉద్యమ స్ఫూర్తితో మారుమోగి

author img

By

Published : Dec 17, 2020, 5:01 PM IST

జనభేరి.. అమరావతి ఉద్యమ స్ఫూర్తితో మారుమోగి
జనభేరి.. అమరావతి ఉద్యమ స్ఫూర్తితో మారుమోగి

రాయపూడి వేదికగా అమరావతి ఐకాస నిర్వహించిన సభ... రాజధాని రైతుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏడాది కాలంగా ఎన్నో ఆటుపోట్లతో రాజధాని కోసం పోరాడుతున్న వారికి లక్ష్యం చేరుకోగలమనే విశ్వాసం కలిగించింది. అధికార పార్టీ, సీపీఎం మినహా అన్ని రాజకీయపక్షాలు సభకు హాజరై అమరావతికి జైకొట్టడమే దీనికి కారణం.

రాజధానికి భూములు ఇచ్చి.. రోడ్డున పడ్డ అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాయపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. సభా ప్రాంగణంలో 12 వేల కుర్చీలు వేశారు. మరో 10 వేల మంది కింద కూర్చునేలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. చాలామంది వెనక వైపు, అలాగే సభాస్థలికి అటూ ఇటూ నిల్చుని ఉన్నారు. 30 వేల మంది వస్తారని నిర్వాహకులు భావించగా... వారి అంచనాలు ఏ మాత్రం తప్పలేదు.

పోలీసులు ఆంక్షలు విధించడంతో బయటి ప్రాంతాల నుంచి జనం వచ్చే వీలు లేకపోయింది. కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలను అనుమతించినా సభికుల సంఖ్య రెట్టింపయ్యేది. కేవలం రాజధాని గ్రామాల నుంచి మాత్రమే ఇంత భారీగా తరలిరావటం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. అమరావతి పోరాటం మొదలయ్యాక ఇంత భారీ స్థాయిలో జన సమూహం ఓ చోటకు రావడం ఇదే మొదటిసారి. మూడు రాజధానుల పట్ల తమ వ్యతిరేకత, అమరావతి రాజధానిగా ఉండాలనే ఆకాంక్షను రాజధాని రైతులు ఈ సభ ద్వారా వ్యక్తపరిచారు. ఎప్పటిలాగే మహిళల సంఖ్య ఎక్కువగా కనిపించింది. అమరావతిని రాజధానిగా సాధించే వరకు ఈ పోరాటం ఆపేది లేదని.. రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి ఇకనైనా కళ్లు తెరవాలని కోరారు.

రాయపూడి సభకు వైకాపా, సీపీఎం మినహా అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. తెదేపా తరఫున చంద్రబాబు సహా అగ్రనేతలంతా తరలివచ్చారు. సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాగా... జనసేన, భాజపా నుంచి ఆ పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సీపీఎం మాత్రం భాజపాతో కలిసి వేదిక పంచుకోలేమని చెబుతూ ఐకాస కన్వీనర్​కు లేఖ రాసింది. అమరావతి పోరాటానికి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. భాజపా నుంచి హాజరైన సత్యమూర్తి, పాతూరి నాగభూషణం ఇద్దరూ... అమరావతి కోసం పోరాడతామని హామీ ఇవ్వటం కీలకంగా రైతులు భావిస్తున్నారు. తమకు రాజకీయంగా అన్ని పక్షాల మద్దతు దొరకడం సానుకూల అంశంగా అభిప్రాయపడుతున్నారు. న్యాయ పోరాటంతో పాటు రాజకీయంగా ఉద్యమం తీవ్రం చేస్తామని తెలిపారు.

రాజధాని రైతులు, మహిళలు వాలంటీర్లుగా మారి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేలా చూశారు. సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భోజనం, తాగునీరు అందించారు.

ఇదీ చదవండి: ఉక్కు పాదాల కిందే..ఉవ్వెత్తున ఉద్యమజ్వాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.