పక్కా మిడిల్ క్లాస్ బడ్జెట్.. పన్ను మినహాయింపులు గ్యారంటీ.. కొత్త స్లాబ్​లు ఇలా..

author img

By

Published : Jan 31, 2023, 7:01 AM IST

TAX EXEMPTIONS IN BUDGET

ఆదాయపు పన్ను పరిమితుల్లో సగటు వేతన జీవికి కేంద్రంలోని మోదీ సర్కార్ ఊరటనిస్తుందనే అంచనాలు ఈసారి భారీగా ఉన్నాయి. మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఉంటుందని ఆర్థికమంత్రి సీతారామన్ ఇటీవల చెప్పిన తర్వాత ఆశలు పెరిగాయి. వచ్చేలోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి 5 లక్షల వరకూ పెంచుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

లోక్‌సభ ఎన్నికలు ఏడాది మాత్రమే ఉన్న తరుణంలో ఈసారి సంక్షేమానికి బడ్జెట్‌లో కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా వేతన జీవులు ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించి కొత్త పన్ను స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. దీనిపై ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న పాత పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చారు. పాత పన్ను విధానంలో 3 స్లాబ్‌లే ఉండగా కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లను తీసుకొచ్చారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపైన... 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం, రూ.12.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకు25 శాతం, రూ.15 లక్షలు ఆపైన ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను వర్తిస్తుంది. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే దానిపై పన్ను చెల్లింపుదారులకు స్వేచ్ఛ ఉంది. అయితే కొత్త విధానంలో పన్ను మినహాయింపులను చూపించేందుకు అవకాశం లేదు. ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతికి పెద్దపీట వేయాలని భావిస్తున్న మోదీ సర్కారు.. ముఖ్యంగా ఆదాయపు పన్ను విషయంలో ఊరటనిచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం. ప్రస్తుతం 15 లక్షలు, ఆపై ఉన్న మొత్తానికి 30శాతం పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్నీ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రూ.2.5 లక్షల వార్షికాదాయంపై.. ఎలాంటి పన్నూ లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం కలిగిన వారికి.. 5 శాతం పన్ను వర్తిస్తోంది. 60-80 ఏళ్ల వయసు ఉన్నవారికి ఈ పన్ను పరిమితి రూ.3 లక్షలుగా ఉంది. 80 ఏళ్లు పైబడినవారికి.. రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. 60ఏళ్లు లోపు ఉన్నవారికి ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిపై గత కొన్ని బడ్జెట్‌ల్లో నిరాశ ఎదురవుతూనే ఉంది. 2024లో సార్వత్రిక ఎన్నికల దష్ట్యా ఈసారి.. ఆ పరిమితిని పెంచుతారని పన్ను చెల్లింపుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.