ఎలాన్ మస్క్ నయా షాక్.. మరోసారి ఉద్యోగాలు కోత

author img

By

Published : Jan 8, 2023, 12:51 PM IST

Twitter laid off half its employees

ఉద్యోగులకు మరోసారి ట్విట్టర్‌ షాకిచ్చింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ఇప్పటికే అందులో పనిచేస్తున్న దాదాపు సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. తాజాగా ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ విభాగంలో మరికొందరిపై వేటు వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.

సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే ట్విట్టర్‌లో పనిచేస్తున్న 3వేల 700 మంది ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ.. తాజాగా మరికొందరికి ఉద్వాసన పలికింది. ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్‌ ఈ విషయం వెల్లడించింది. డబ్లిన్‌, సింగపూర్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు డజను మందికిపైగా ఉద్యోగులను శుక్రవారం రాత్రి తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ వార్తలను ట్విట్టర్ ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ వైస్‌ ప్రెసిడెంట్ ఎల్లా ఇర్విన్‌ ధ్రువీకరించినట్లు వెల్లడించింది. అయితే తొలగించిన ఉద్యోగుల వివరాలను ఇర్విన్ తెలియజేయలేదు. ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ విభాగంలో కొందరినే తొలగించామని.. అయితే ఈ విభాగంలో వేలాది మంది పనిచేస్తున్నారని ఇర్విన్‌ చెప్పినట్లు సమాచారం.

ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. వ్యయ నియంత్రణ, ట్విట్టర్ అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది. గత నవంబరులో దాదాపు 3వేల 700 మంది ఉద్యోగులకు ట్విట్టర్‌ ఉద్వాసన పలికింది. వీరిలో భారత్‌లో పనిచేస్తున్న వారు 250 మంది ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.