ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లలో కలిసిరావట్లేదా? ఇది కాస్త బెటరేమో!

author img

By

Published : May 21, 2022, 6:00 PM IST

Mutual Funds Investment: కొన్ని నెలలుగా స్టాక్‌ మార్కెట్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. జీవన కాల గరిష్ఠాల దగ్గర్నుంచి ఎంతో కిందకు వచ్చింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, జీడీపీ వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, అంతర్జాతీయ పరిణామాలు ఇలా ఎన్నో దీనికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ పరిస్థితులు కొత్త మదుపరులను కలవరపెడుతున్నాయి. కానీ, దీర్ఘకాలిక వ్యూహంతో.. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడులు కొనసాగించే వారికి ఇది సానుకూల పరిణామం.

mutual funds investment
mutual funds investment

Mutual Funds Investment: స్టాక్‌ మార్కెట్‌ అంటేనే అస్థిరత. హెచ్చుతగ్గులు ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. కొత్త మదుపరులు ఇప్పటికే తమ పెట్టుబడి విలువలో 10 శాతానికి పైగా క్షీణత చూశారు. స్వల్పకాలంలో ఇది మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈ అస్థిరతే ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి సహాయం చేస్తుంది.

అర్థం చేసుకుంటూ..: సూచీల్లో ఎప్పుడూ దిద్దుబాటు వస్తూనే ఉంటుంది. ఇది 2-5 శాతం వరకూ ఉన్నప్పుడు సాధారణ విషయమే. 10 శాతానికి మించినప్పుడు పెట్టుబడి వ్యూహాలను రచించుకోవాలి. పతనం తర్వాత మార్కెట్‌ బలంగా ముందుకెళ్లిన సందర్భాలు ఎన్నో చూశాం. చరిత్ర సంగతి ఎలా ఉన్నా.. కొవిడ్‌-19 తరువాత పరిస్థితులు మనకు స్పష్టంగా తెలుసు కదా.. భయాందోళనలతో పెట్టుబడిని వెనక్కి తీసుకున్న వారు మార్కెట్‌ వృద్ధి చెందినప్పుడు వచ్చిన ఫలితాలను అందుకోలేకపోయారు. తక్కువ విలువతో అందుబాటులోకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న వారు అధిక రాబడులను అందుకున్నారు.

ఈక్విటీల్లో..: షేర్లలో పెట్టుబడి అంటే.. నష్టభయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లే. కానీ, దీర్ఘకాలంలో ఇది అంతగా ఉండదు. పైగా అధిక రాబడికీ అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో పెట్టుబడిని 3-5 ఏళ్లపాటు వెనక్కి తీసుకోకూడదు. ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్నదీ ప్రధానమే. 40 ఏళ్ల వ్యక్తి తన పెట్టుబడి మొత్తంలో 70 శాతం వరకూ ఈక్విటీ ఫండ్లకు కేటాయించవచ్చు. 40-55 ఏళ్ల వారు 30-60 శాతం, 55 ఏళ్లపైబడిన వారు 30 శాతంలోపే ఈక్విటీ పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి.

సిప్‌.. ఆపొద్దు: హెచ్చుతగ్గుల్లో రూపాయి సగటు ప్రయోజనం అందుకునేందుకు ప్రయత్నించాలి. దీనికోసం మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ఒక మార్గం. తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసిన యూనిట్లు, దీర్ఘకాలంలో సంపదను పెంచడంలో సహాయం చేస్తాయి.

అవసరం లేకుండా..: మార్కెట్లో పెట్టిన నిధులు.. ఒక లక్ష్యంతో కొనసాగిస్తూ ఉండాలి. చిన్న అవసరాలకు ఫండ్‌ యూనిట్లను విక్రయించడం మంచి నిర్ణయం కాదు. మీ లక్ష్యం ఒక ఏడాది లోపున్నప్పుడు, ప్రాణావసరాల్లో నిధులు కావాల్సినప్పుడు మాత్రమే ఆ మేరకే పాక్షికంగా తీసుకోవాలి.
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిస్థితుల్లో అదనపు పెట్టుబడులను పరిశీలించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా.. ముందుగా లిక్విడ్‌ ఫండ్లలో మదుపు చేసి, ఆ తర్వాత క్రమానుగత బదిలీ విధానంలో ఈక్విటీ ఫండ్లకు మళ్లించాలి. అదే సమయంలో నష్టాన్ని భరించే సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. హెచ్చుతగ్గుల సమయంలో మీరు చేసే పెట్టుబడులే దీర్ఘకాలంలో సంపద సృష్టికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్‌ తగ్గుతున్నప్పుడల్లా వ్యూహాత్మక పెట్టుబడికి అవకాశంగా భావించాలి.

- అధిల్​ శెట్టి, సీఈఓ, బ్యాంక్​బజార్​

ఇదీ చదవండి: సొంతిల్లు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.