ETV Bharat / business

స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ టాప్​-8 టిప్స్​ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 3:06 PM IST

Stock Market Investment Tips In Telugu : మీరు స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటూనే, మంచి రాబడులు రావాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. పెట్టుబడులు పెట్టే ముందు ఏయే అంశాలను పరిశీలించాలి? ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

share market investment tips
stock market investment tips

Stock Market Investment Tips : స్టాక్​ మార్కెట్ పెట్టుబడుల్లో లాభ, నష్టాలు రెండూ ఉంటాయి. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. గత కొన్నేళ్లుగా మన దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో కొనసాగుతున్నాయి. అందుకే చాలా మంది లాభపడుతున్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్టాక్​ మార్కెట్ పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా ఇబ్బందిపడక తప్పదు.

  1. పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్​ : మన పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నష్టభయం తక్కువగా ఉంటుంది. లాభం వచ్చే ఛాన్స్​ ఎక్కువ అవుతుంది. మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్‌ పనితీరులను గమనిస్తూ, మన ఆర్థిక లక్ష్యాల సాధనకు అనుగుణమైన పథకాలను ఎంచుకోవాలి.
  2. లక్ష్యం : పెట్టుబడులు పెట్టేముందే మన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. మన లక్ష్యాన్ని ఎంత కాలంలో చేరుకోవాలి. మనం ఎంత మేరకు నష్టాన్ని భరించగలమనే అంచనాలు వేసుకోవాలి. ఏ ఇద్దరి ఆర్థిక ప్రణాళికలు కూడా ఒకేలా ఉండవు. కానీ అవసరాలు మాత్రం దాదాపు ఒకేలా ఉంటాయి. కనుక మీకు వచ్చే ఆదాయాన్ని అనుసరించి, పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది.
  3. పెట్టుబడి ప్రణాళిక : కొన్ని పెట్టుబడుల్లో నష్టభయం అధికంగా ఉంటుంది. కానీ మంచి రాబడులను అందిస్తాయి. మరికొన్ని సురక్షితంగా ఉంటాయి. కానీ తక్కువ రాబడిని ఇస్తాయి. అందువల్ల మీ వయస్సు, ఆదాయం, లక్ష్యాన్ని చేరేందుకు ఉన్న కాల వ్యవధిని అనుసరించి, పెట్టుబడి ప్రణాళికలు వేసుకోవాలి.
  4. ఈక్విటీ ఇన్వెస్ట్​మెంట్స్​ : స్టాక్​మార్కెట్లో (ఈక్విటీ) ఎంత మేరకు పెట్టుబడులు పెట్టాలి? అనే ప్రశ్నకు సరైన సూత్రం అంటూ ఏమీ లేదు. అయితే ఆర్థిక నిపుణుల ప్రకారం, 100 నుంచి మీ వయస్సును తీసివేస్తే వచ్చే జవాబు, మీ ఈక్విటీ పెట్టుబడుల శాతంగా ఉండాలి. ఉదాహరణకు మీ వయస్సు 30 సంవత్సరాలు అయితే, మీ మొత్తం పెట్టుబడుల్లో 70 శాతం వరకూ ఈక్విటీ ఇన్వెస్ట్​మెంట్స్​కు కేటాయించవచ్చు.
  5. కాల వ్యవధి : దీర్ఘకాలిక పెట్టుబడులు అనేవి మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని, మీకు మంచి రాబడిని ఇస్తాయి. అయినప్పటికీ ఈ దీర్ఘకాల పెట్టుబడులను కనీసం 6 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి అయినా సమీక్షించుకోవాలి. వాటిలో కాలానుగుణమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలి. అప్పుడే మీ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి.
  6. కాలానికి అనుగుణంగా : జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన పెట్టుబడుల స్వరూపాన్ని మారుస్తుంటాయి. ముఖ్యంగా వివాహం, పిల్లలు, ఉద్యోగంలో మార్పు, అనుకోని ప్రమాదాలు లాంటివన్నీ మన ఆర్థిక లక్ష్యాలను మారుస్తూ ఉంటాయి. అందుకు అనుగుణంగా మన పెట్టుబడులను సర్దుబాటు చేసుకోవాలి. పదవీ విరమణ నాటికి కోటి రూపాయల నిధి ఉండాలంటే, సురక్షిత పెట్టుబడి పథకాలతో దానిని సాధించడం కష్టం. అందువల్ల రిస్క్​, రివార్డ్ ఎక్కువగా ఉంటే, స్టాక్​ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న రాబడిని, భవిష్యత్‌లో వచ్చే ఆదాయాలను బేరీజు వేసుకొని, పెట్టుబడి ప్రణాళిక వేసుకోవాలి.
  7. సమీక్ష : మార్కెట్‌ పనితీరు బాగున్నప్పుడు మీ పెట్టుబడి పథకాలపై మంచి రాబడి వస్తుంది. ఒకవేళ మార్కెట్ బాగున్నప్పటికీ, మీ రాబడి పెరగలేదంటే, మీరు ఎంచుకున్న పథకాలను ఒకసారి సమీక్షించుకోవాల్సిందే. లేకపోతే అవి మరింత దిగజారి, తీవ్రమైన నష్టాలను మిగులుస్తాయి.
  8. బ్యాలెన్సింగ్​ : ఫిక్స్​డ్ డిపాజిట్లు లాంటి సురక్షిత పథకాలు, ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్లు, బంగారం, స్థిరాస్తి ఇలా విభిన్న పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్​ చేయాలి. ఈ పెట్టుబడులను క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలను తీసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు.

అదానీ బౌన్స్​ బ్యాక్​- భారత్​లో అత్యంత ధనవంతుడిగా అవతరణ

కారు మైలేజీ పెంచుకోవాలా? ఈ టిప్స్ పాటిస్తే మీకు ఎదురే ఉండదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.