ETV Bharat / business

ఆ కంపెనీల షేర్లతో కాసుల పంట పండించిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

author img

By

Published : Aug 14, 2022, 5:07 PM IST

Rakesh Jhunjhunwala Stock Market రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మరణంతో ​భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. ఈక్విటీల్లోకి ఎంటర్‌ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ఆయన వ్యూహాలు, పెట్టుబడుల తీరుపై కంప్యూటర్లలో వెతక్కుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. రాకేశ్​ ఝున్‌ఝున్‌వాలాకు లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు గురించి ఓ సారి తెలుసుకుందాం. అలాగే ఆయన ఎదిగిన తీరును చూద్దాం.

rakesh jhunjhunwala stock markets
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా

Rakesh Jhunjhunwala Stock Market: భారత్‌లో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకునే ప్రతి ఔత్సాహిక మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా గురించి తెలుసుకోకుండా ఉండరు. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆయనలా సంపాదించాలని కలలు కనకా మానరు. బహుశా.. ఈక్విటీల్లోకి ఎంటర్‌ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ.. ఆయన వ్యూహాలు, పెట్టుబడుల తీరుపై కంప్యూటర్లలో వెతక్కుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఏయే కంపెనీల్లో మదుపు చేశారు? కొత్తగా ఆయన పోర్ట్‌ఫోలియోలో చేరిన కంపెనీలేవో నిరంతరం ట్రాక్‌ చేసే మదుపర్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారందరికీ ఆయన హఠాన్మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ తరుణంలో ఆయనకు బాగా లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు, ఆయన పెట్టుబడుల తీరు ఎలా సాగిందో.. ఓ సారి చూద్దాం..!

రాకేశ్‌ ఝున్‌ఝన్‌వాలాకు ఓ స్టాక్‌ బోక్రింగ్‌ సంస్థ ఉంది. సతీమణి రేఖతో పాటు ఆయన పేరులోని ఆంగ్ల అక్షరాలను కలిపి 'రేర్‌' అని దానికి పేరు పెట్టారు. ఈ కంపెనీయే ఆయన పోర్ట్‌ఫోలియోలను కూడా నిర్వహిస్తుంటుంది. 'ఫోర్బ్స్‌ రియల్‌ టైం బిలియనీర్స్‌ ఇండెక్స్‌' జాబితాలో ఆయన రూ.46.18 వేల కోట్లతో 438వ స్థానంలో ఉన్నారు. భారత్‌లో 36వ అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. దాదాపు 40 కంపెనీల షేర్లలో ఆయన మదుపు చేశారు.

  1. 1985లో సీఏ పూర్తి చేసిన ఆయన అదే సంవత్సరం మార్కెట్‌లో తొలిసారి మదుపు చేశారు. అప్పటికీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 150 వద్ద ఉంది. గత శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అది 59,462.78 పాయింట్ల వద్ద స్థిరపడింది.
  2. మార్కెట్‌లోకి ప్రవేశించిన దాదాపు ఏడాది తర్వాత తొలిసారి ఆయన పెద్ద లాభాన్ని రుచి చూశారు. అప్పట్లో 'టాటా టీ' షేర్లను ఒక్కోటి రూ.43 వద్ద కొనుగోలు చేశారు. సరిగ్గా మూడు నెలల తర్వాత ఒక్కో షేరు రూ.143కు విక్రయించారు. అలా ఆయన 1986లో రూ.5 లక్షల లాభాన్ని ఆర్జించారు. దాదాపు మూడింతల రాబడిని పొందారు.
  3. ఝున్‌ఝున్‌వాలాకు బాగా కలిసొచ్చిన స్టాక్‌గా టైటన్‌ను చెబుతుంటారు. 2002-2003లో ఆయన ఒక్కో షేరును సగటున రూ.3 దగ్గర కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.2,140. టైటన్‌లో ఆయనకు దాదాపు 4.4 బిలియన్ల షేర్లు ఉన్నాయి. మార్చి 2022 నాటికి కంపెనీలో ఆయన వాటా 5 శాతం.
  4. రాకేశ్‌ 2006లో లుపిన్‌ షేర్లను ఒక్కోటి రూ.150 వద్ద కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ షేరు రూ.635 దగ్గర ట్రేడవుతోంది. వీటితో పాటు క్రిసిల్‌, ప్రజ్‌ ఇండ్‌, అరబిందో ఫార్మా, ఎన్‌సీసీ.. వంటి కంపెనీలు ఝున్‌ఝున్‌వాలాకు అనేక రెట్ల లాభాలిచ్చి ఆయన్ని బిగ్‌బుల్‌ని చేశాయి.
  5. ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న మరికొన్ని కంపెనీలు- స్టార్‌ హెల్త్‌, ర్యాలీస్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ, అగ్రోటెక్‌ ఫుడ్స్‌, నజారా టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికం ముగిసే నాటికి ఆయనకు 47 కంపెనీల్లో వాటాలున్నాయి. టైటన్‌, స్టార్‌ హెల్త్‌, టాటా మోటార్స్‌, మెట్రో బ్రాండ్స్‌లో పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి.
  6. కొన్ని ప్రముఖ కంపెనీల బోర్డుల్లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సభ్యుడిగా వ్యవహరించారు. పలు సినిమాలనూ నిర్మించారు. 'ఇంగ్లిష్‌-వింగ్లిష్‌', 'శమితాబ్‌', 'కి అండ్‌ కా' చిత్రాలను ఆయనే ప్రొడ్యూస్‌ చేశారు. హంగామా డిజిటల్‌ మీడియాకు ఛైర్మన్‌గానూ ఉన్నారు.
  7. తాజాగా నాల్కో, కెనరా బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ను ఆయన తన పోర్ట్‌ఫోలియోకి జత చేసుకున్నారు. అంతకు ముందు సెయిల్‌లోనూ పెట్టుబడులు పెట్టారు.
  8. ఇటీవలే ఆయన ఆకాశ ఎయిర్‌ పేరిట విమానయాన రంగంలోకీ ప్రవేశించారు. 2022 ఆగస్టు 7న ప్రారంభమైన తొలి సర్వీసులో ఆయన ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణించారు. ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలాకు 40 శాతం వాటా ఉంది.
  9. రూ.5,000తో పెట్టుబడి ప్రారంభించి.. రూ.40 వేల కోట్లు గడించిన ఝున్‌ఝున్‌వాలా లెక్కలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి. దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ అలాంటి వాటిలో ఒకటి. అత్యంత నమ్మకంతో ఈ కంపెనీలో ఆయన ఒక్కో షేరును రూ.135 వద్ద 25 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. కానీ, ఆయన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఆ కంపెనీ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని కుప్పకూలింది.
  10. సల్మాన్‌ ఖాన్‌ 'బీయింగ్‌ హ్యూమన్‌' బ్రాండ్‌కు రిటైలర్‌గా వ్యవహరించిన 'మంధన రిటైల్‌' విషయంలోనూ రాకేశ్‌ అంచనాలు తప్పాయి. 2016లో ఒక్కో షేరు రూ.247 వద్ద కొనుగోలు చేశారు. చివరకు 2021 డిసెంబరులో ఒక్కో షేరు ధర రూ.16 వద్ద ఉన్నప్పుడు నిష్క్రమించారు. ఆయనకు నష్టాలను మిగిల్చిన కంపెనీల జాబితాలో మరో ప్రముఖ సంస్థ డీబీ రియాలిటీ.

ఇవీ చదవండి: అధిక రాబడినిచ్చే ట్రేడింగ్ వ్యూహం ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్

బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.