'ఒప్పో భారీ స్కామ్.. రూ.4,389కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేత!'

author img

By

Published : Jul 13, 2022, 1:07 PM IST

Updated : Jul 13, 2022, 1:44 PM IST

oppo customs duty scam

స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఏకంగా రూ.4,389 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగ్గొట్టినట్లు డైరక్టరేట్​ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ వెల్లడించింది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. ఏకంగా రూ.4,389 కోట్ల కస్టమ్స్ సుంకం చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు తేలింది. ఒప్పో సహా అనుబంధ సంస్థల కార్యాలయాలు, ఉన్నత ఉద్యోగుల నివాసాల్లో సోదాల తర్వాత ఈ విషయం నిర్ధరించినట్లు డైరక్టరేట్​ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్​-డీఆర్​ఐ వెల్లడించింది.
మొబైల్ ఫోన్ల తయారీ కోసం ఒప్పో భారత్​కు దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల వివరాల్ని తప్పుగా చూపినట్లు ఆధారాలు లభించాయని పేర్కొంది. ఇలా తప్పుడు వివరాలు సమర్పించడం ద్వారా 'ఒప్పో ఇండియా' సంస్థ అర్హత లేకపోయినా రూ.2,981కోట్ల మేర పన్ను మినహాయింపులు పొందినట్లు డీఆర్​ఐ వివరించింది. సంస్థకు చెందిన కొందరు ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడించింది.

చైనాలోని వేర్వేరు సంస్థలకు రాయల్టీ, లైసెన్స్ ఫీజు చెల్లించే విషయంలోనూ ఒప్పో ఇండియా సంస్థ రూ.1,408కోట్ల మేర సుంకం ఎగ్గొట్టిందని డీఆర్​ఐ తేల్చింది. పన్ను ఎగవేతకు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే రూ.450కోట్లు స్వచ్ఛందంగా చెల్లించిందని తెలిపింది. బకాయిలు, పెనాల్టీలు అన్నీ కలుపుకుని.. మొత్తం రూ.4,389కోట్ల కస్టమ్స్ సుంకం చెల్లించాలని ఆ సంస్థకు షోకాజ్​ నోటీసులు జారీ చేసినట్లు డైరక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ వెల్లడించింది.
ఒప్పో, వన్​ ప్లస్, రియల్​మీ ఫోన్లను భారత్​లో విక్రయిస్తుంది ఒప్పో ఇండియా.

వివో కేసులో ఇలా...
బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ వివో దాఖలు చేసిన పిటిషన్​పై స్పందించాలని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. వారం రోజుల్లోగా ఈడీకి రూ.950కోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి, సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఖాతాలు ఫ్రీజ్​ చేసిన సమయంలో ఉన్న రూ.251కోట్ల బ్యాలెన్స్​ను తగ్గకుండా చూడాలని వివోకు సూచించింది. విచారణను దిల్లీ హైకోర్టు జులై 28కి వాయిదా వేసింది.
మనీలాండరింగ్​ సహా ఇతర ఆరోపణలపై వివోకు చెందిన వేర్వేరు కార్యాలయాల్లో జులై 5న ఈడీ దాడులు చేసింది. రూ.1200కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలు స్తంభింపచేసింది.

Last Updated :Jul 13, 2022, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.