ETV Bharat / business

Credit score myths : క్రెడిట్​ స్కోర్​పై ఉన్న అపోహలు - వాస్తవాలు మీకు తెలుసా?

author img

By

Published : Jul 7, 2023, 3:19 PM IST

Credit score misconceptions : నేటి కాలంలో బ్యాంకులు, రుణ సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందాలంటే.. క్రెడిట్​ స్కోర్​ తప్పనిసరి. అయితే చాలా మందికి క్రెడిట్​ స్కోర్​ విషయంలో అనేక సందేహాలు, అపోహలు ఉంటాయి. అందుకే క్రెడిట్​ స్కోర్​కు సంబంధించిన అపోహలు, వాస్తవాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

how to improve credit score
Credit score myths and facts

Credit score myths and facts : బ్యాంకులు లేదా రుణ సంస్థలు.. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు, వారి క్రెడిట్ స్కోర్​ని పరిశీలిస్తాయి. ముఖ్యంగా వక్తుల ఆదాయం ఎంత ఉంది? తీసుకున్న రుణాలకు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారా? లేదా? మొదలైన విషయాలను చాలా కచ్చితంగా చూస్తాయి. అందుకే రుణ వాయిదాలు, క్రెడిట్​ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించాలి. కానీ చాలా మంది ఈ విషయాల్లో చాలా ఉదాసీనంగా ఉంటారు. ముఖ్యంగా వారు క్రెడిట్​ స్కోర్​ పట్ల చాలా సందేహాలు, అపోహలు కలిగి ఉంటారు. అందులో క్రెడిట్​ స్కోర్​ గురించి వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం!

క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉంటే రుణాలు ఇస్తారా?
Factors that affect credit score : క్రెడిట్​ స్కోర్​ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి రుణం ఇవ్వాలా? లేదా? అని నిర్ణయించేందుకు బ్యాంకులు కచ్చితంగా క్రెడిట్​ స్కోర్​ను చూస్తాయి. సాధారణంగా బ్యాంకులు లేదా రుణ సంస్థలు.. లోన్​ తీసుకున్నవారి పూర్తి సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు ఇస్తుంటాయి. అప్పటి నుంచి క్రెడిట్​ బ్యూరోలు.. రుణ గ్రహీత సకాలంలో లోన్​ వాయిదాలు, క్రెడిట్​ కార్డు బిల్లు చెల్లిస్తున్నాడా? లేదా? అనే విషయాలను.. అతని క్రెడిట్​ హిస్టరీలో నమోదు చేస్తూ ఉంటాయి. సకాలంలో చెల్లిస్తూ ఉంటే, అతని క్రెడిట్ స్కోర్​ పెరుగుతుంది.. లేదంటే తగ్గుతుంది. క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉన్నవారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు.

తరచూ తనిఖీ చేస్తుంటే.. క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
వాస్తవానికి మీరు మీ క్రెడిట్​ స్కోర్​ను తరచూ తనిఖీ చేసుకోవచ్చు. దీని వల్ల మీ క్రెడిట్​ స్కోర్​పై, రుణ చరిత్రపై ఎలాంటి ప్రభావం పడదు. వాస్తవానికి సిబిల్​ లాంటి క్రెడిట్​ బ్యూరోల నుంచి సంవత్సరానికి ఒకసారి పూర్తి ఉచితంగా బేసిక్ క్రెడిట్​ స్కోర్​ను పొందవచ్చు. అలాగే ఇప్పుడు చాలా ఆన్​లైన్​ వేదికల్లో కూడా ఉచితంగా క్రెడిట్​ స్కోర్​ నివేదికలు పొందే అవకాశం లభిస్తోంది. వాస్తవానికి ఇలా తరచుగా క్రెడిట్​ స్కోర్​ తనిఖీ చేసుకోవడం వల్ల మీ రుణ చరిత్రపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, రుణదాతలు మీ క్రెడిట్​ స్కోర్​ను అధికారికంగా తనిఖీ చేసినప్పుడు మాత్రం మీ స్కోర్​ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, మీరు ఒక సారి రుణం కోసం దరఖాస్తు చేస్తే, బ్యాంకులు దానిపై ఎంక్వైరీ చేస్తాయి. అదే మీరు చాలా బ్యాంకుల్లో, చాలా సార్లు రుణాల కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు మీ క్రెడిట్​ స్కోర్​ బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆదాయం తక్కువగా ఉంటే క్రెడిట్​ స్కోర్​ తగ్గుతుందా?
Does your income affect your credit score : క్రెడిట్​ స్కోర్​కు, ఆదాయానికి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. అందువల్ల మీ ఆదాయం అనేది మీ క్రెడిట్ స్కోర్​పై ఎలాంటి ప్రభావం చూపించదు. వాస్తవానికి బ్యాంకులు లేదా రుణసంస్థలు.. మీరు తీసుకున్న రుణంపై.. సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారా? లేదా? అనేది మాత్రమే చూస్తాయి. మీకు ఎంత ఆదాయం వస్తోందన్న అంశాన్ని అవి పట్టించుకోవు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తూ ఉంటే, మీ క్రెడిట్ స్కోర్​ కచ్చితంగా పెరుగుతుంది.

కుటుంబ సభ్యుల ప్రభావం.. మన క్రెడిట్ స్కోర్​పై ఉంటుందా?
క్రెడిట్​ బ్యూరో సంస్థలు పాన్ కార్డు ఆధారంగా క్రెడిట్​ స్కోర్​ను గణిస్తూ ఉంటాయి. కనుక తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల క్రెడిట్​ స్కోరులు.. మీ వ్యక్తిగత క్రెడిట్​ స్కోర్​పై నేరుగా ప్రభావం చూపించవు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు తీసుకున్న రుణాలకు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నా, లేకున్నా.. మీ క్రెడిట్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడదు. కాకపోతే, వారు తీసుకున్న రుణాలతో మీకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం ఉండకూడదు.

ఇతరుల రుణాలకు మీరు హామీగా ఉంటే?
వాస్తవానికి వేరొకరు తీసుకున్న రుణానికి హామీ ఇచ్చినా, లేదా సహదరఖాస్తుదారుగా ఉన్నా.. మీరూ రుణం తీసుకున్నట్లే లెక్క. అందువల్ల అలాంటి రుణాలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మీపైనా ఉంటుంది. ఒక వేళ రుణం తీసుకున్న వ్యక్తి, సకాలంలో వాయిదా చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా.. అప్పుడు ఆ రుణం మీరు తీర్చాల్సి ఉంటుంది. మీరు కూడా ఆ బాకీని చెల్లించకపోతే.. మీ క్రెడిట్​ స్కోర్​ తగ్గిపోతుంది. అందువల్ల ఇతరులకు హామీలు ఇచ్చేటప్పుడు, సహదరఖాస్తుదారుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

అసలు పూర్తిగా రుణాలు తీసుకోకపోతే!
జీవితంలో అప్పు చేయాల్సిన అవసరం రాకపోవడం అనేది నిజంగా అదృష్టమే. అయితే ఇది ప్రతి ఒక్కరికీ సాధ్యంకాదు. జీవితంలో అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇల్లు, వాహనాల కొనుగోలు విషయంలో, పిల్లల చదువుల కోసం, ఆనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు.. అప్పులు చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పు చేస్తే.. భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అదే మీ క్రెడిట్​ స్కోర్​ 750కి మించి ఉంటే.. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

రుణం తీసుకోకపోయినా.. క్రెడిట్ స్కోర్​ చూడాలా?
Free credit score check online : అవును. రుణం తీసుకోకపోయినా.. కచ్చితంగా మీరు క్రెడిట్​ స్కోర్​ తనిఖీ చేస్తూ ఉండాలి. ఇటీవల అనేక మంది ఆర్థిక నేరగాళ్లు.. వ్యక్తులకు తెలియకుండా, వారి పేరుపైన మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. దీని ఫలితంగా ఆయా వ్యక్తుల క్రెడిట్​ స్కోర్​లు బాగా దెబ్బతిన్నాయి. కనుక మీరు కూడా రుణం తీసుకోకపోయినా.. కనీసం ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు క్రెడిట్ స్కోర్​ను చెక్​ చేసుకోవడం ఉత్తమం.

క్రమశిక్షణ కోల్పోకండి!
How to improve credit score : క్రెడిట్​ స్కోర్​ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఒక్క నెల వాయిదా చెల్లింపు ఆలస్యం జరిగినా.. మీ క్రెడిట్​ స్కోర్​లో 100 పాయింట్లు వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనిని రికవరీ చేసుకోవడానికి మీకు చాలా కాలం పడుతుంది. ఈ లోపు మరోసారి మీరు అత్యవసరంగా కొత్త రుణం కోసం దరఖాస్తు చేస్తే.. అది తిరస్కరణకు గురికావచ్చు లేదా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి రావచ్చు. కనుక వాయిదాల చెల్లింపు విషయంలో చాలా క్రమశిక్షణ అవసరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.