ETV Bharat / business

'మహీంద్రా' భళా.. ఏడు రెట్లు పెరిగిన లాభం.. ఆదాయం భారీగా జంప్!

author img

By

Published : Aug 6, 2022, 7:02 AM IST

Mahindra and Mahindra Q1 results: జూన్ త్రైమాసికంలో ఏడు రెట్లు అధికంగా నికర లాభాన్ని నమోదు చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. రూ.2360 కోట్ల ఏకీకృత నికర లాభం గడించినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయం రూ.19171.91 కోట్ల నుంచి రూ.28412.38 కోట్లకు చేరింది.

Etv Bharat
Etv Bharat

M&M Q1 results: జూన్‌ త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) రూ.2360.70 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.331.74 కోట్లతో పోలిస్తే, ఇది 7 రెట్లు అధికం. వాహన, సాగు పరికరాల విభాగాలు గణనీయంగా రాణంచడం ఇందుకు కారణం. ఇదే సమయంలో ఆదాయం రూ.19171.91 కోట్ల నుంచి రూ.28412.38 కోట్లకు చేరింది. ఖర్చులు కూడా రూ.20286.24 కోట్ల నుంచి రూ.26195.01 కోట్లకు పెరిగాయి. సెమీకండక్టర్‌ చిప్‌ కొరత చాలావరకు తగ్గిందని, చైనా-తైవాన్‌ ఉద్రిక్తతల వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందో అప్పుడే ఏమీ చెప్పలేమని ఎం అండ్‌ ఎం ఎండీ అనిశ్‌ షా పేర్కొన్నారు.

  • వాహన విభాగ ఆదాయాలు రూ.6316.79 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.12740.94 కోట్లకు చేరాయి. విక్రయించిన వాహనాల సంఖ్య 85,858 నుంచి 74 శాతం అధికమై 1,49,803కు చేరాయి.
  • వ్యవసాయ పరికరాల విభాగ ఆదాయం రూ.7188.74 కోట్ల నుంచి రూ.8427.66 కోట్లకు పెరిగింది. ట్రాక్టర్ల విక్రయాలు 99127 నుంచి 18 శాతం పెరిగి 117413కు చేరాయి.
  • ఆర్థిక సేవల విభాగాదాయం రూ.2530.15 కోట్ల నుంచి రూ.2876.61 కోట్లకు, ఆతిథ్య విభాగాదాయం రూ.393.76 కోట్ల నుంచి రూ.613.19 కోట్లకు చేరాయి. స్థిరాస్తి విభాగాదాయం రూ.149.51 కోట్ల నుంచి 94.82 కోట్లకు తగ్గింది.

తయారీ పెరిగితే మరిన్ని ఉద్యోగాలు: ఆనంద్‌ మహీంద్రా
భారీఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిణామాలు భారత్‌కు అనుకూలంగా మారుతున్నందున, ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ 76వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన సూచించారు. దేశీయంగా నిరుద్యోగిత 7-8 శాతం ఉందని, జీడీపీ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. దేశంలో పనిచేయగల వీలున్న 90 శాతం మందిలో 40 శాతం మందే ఉద్యోగాలు చేస్తున్నారు లేదా పని కోసం చూస్తున్నారని వివరించారు. 'ప్రపంచంలోనే యువ జనాభా అధికంగా ఉన్న దేశం మనది. యువతకు ఉద్యోగాలు లభించకపోతే, సామాజిక అశాంతి' పెరుగుతుందని ఆనంద్‌ మహీంద్రా విశదీకరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.