ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గాలని అలా చేస్తే.. మీకే నష్టం!

author img

By

Published : Sep 10, 2022, 11:40 AM IST

Health insurance copay : ఆరోగ్య అత్యవసరాల్లో ఆదుకునేది ఆరోగ్య బీమా. చాలా సందర్భాల్లో ఈ పాలసీని తీసుకునేటప్పుడు అందులోని నిబంధనల గురించి సరిగ్గా పట్టించుకోం. తీరా ఆసుపత్రిలో చేరి, బిల్లులు క్లెయిం చేసుకున్నప్పుడు అవి మన జేబుకు భారాన్ని మిగులుస్తాయి. ఇలాంటి వాటిల్లో సహ చెల్లింపు (కో-పే) ఒకటి. చికిత్సకయ్యే ఖర్చులో కొంతమేరకు పాలసీదారుడు భరించడమే సహ చెల్లింపు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండకపోతే.. ఆర్థికంగా ఇబ్బంది తప్పదు.

health insurance copay
హెల్త్ ఇన్సూరెన్స్

కుమార్‌కు రూ.15లక్షల ఆరోగ్య బీమా పాలసీ ఉంది. పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 20 శాతం వరకు సహ చెల్లింపు ఉన్నా ఇబ్బంది లేదు అనుకున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన కుమార్‌కు రూ.8 లక్షల వరకు ఖర్చయ్యింది. సహ చెల్లింపు నిబంధన వల్ల ఇందులో రూ.1.60 లక్షల వరకు చేతి నుంచి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగిందనే కారణంతో ఇటీవల కాలంలో చాలామంది సహ చెల్లింపుతో పాలసీని తీసుకుంటున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు ప్రయోజనం లభించినా.. మున్ముందు ఇబ్బందులు తప్పవు. కాస్త ప్రీమియం అధికంగా ఉన్నా.. మొత్తం క్లెయిం వచ్చే పాలసీలే ఎప్పుడూ ఉత్తమం.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూర్తి స్థాయి బీమా పాలసీ ఉన్నా.. సహ చెల్లింపు నిబంధన వర్తిస్తుందని బీమా సంస్థలు చెబుతాయి. వీటిలో ముఖ్యమైన వాటిని గమనిస్తే..
* కొన్ని బీమా సంస్థలు.. నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో కాకుండా.. ఇతర చోట చికిత్స చేయించుకున్నప్పుడు ఈ సహ చెల్లింపు నిబంధనను పాటిస్తాయి. మీ సమీపంలో బీమా సంస్థ నెట్‌వర్క్‌ ఆసుపత్రి ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ లేకపోతే ముందుగా ఈ విషయాన్ని బీమా సంస్థతో చర్చించండి. అత్యవసర పరిస్థితుల్లో బీమా సంస్థ సహ చెల్లింపు నిబంధన నుంచి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది.

* ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న వారు.. ప్రథమ శ్రేణి నగరాల్లో చికిత్స చేయించుకోవాలనుకున్నప్పుడూ ఈ సహ చెల్లింపు వర్తిస్తుంది. కాబట్టి, పాలసీ తీసుకునేటప్పుడే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు ఖరీదైన ఆసుపత్రుల్లో చేరినప్పుడూ కో-పే కోసం అడుగుతాయి. ముఖ్యంగా గది అద్దె, ఐసీయూ ఛార్జీలు అధికంగా ఉన్నప్పుడు. కొన్ని ఆసుపత్రుల్లో గది అద్దె రోజుకు రూ.8వేల వరకు ఉంటుంది. కొన్ని బీమా పాలసీలు గది అద్దెపై పరిమితి విధిస్తాయి. ఇలాంటప్పుడు సహ చెల్లింపు తప్పదు.

* ముందస్తు వ్యాధులు ఉన్న సందర్భంలో బీమా సంస్థలు ఈ సహ చెల్లింపు నిబంధనను పాటిస్తుంటాయి. నిర్ణీత వ్యవధి వరకు వేచి ఉంటే ఇది వర్తించదు. కాబట్టి, పాలసీ తీసుకునేటప్పుడు మొదటి రోజు నుంచే వీటి చికిత్సకు పరిహారం ఇవ్వాలా.. వేచి ఉండే వ్యవధి తర్వాత ఇస్తే చాలా అనేది చూసుకోండి.
చిన్న వయసులో ఉన్నవారు.. బీమా ప్రీమియం భారం తగ్గించుకునేందుకు కో-పే నిబంధనను ఎంచుకోవచ్చు. కానీ, ముందస్తు వ్యాధులున్నవారు.. 45 ఏళ్లు దాటిన వారు సాధ్యమైనంత వరకు సహ చెల్లింపు, ఉప పరిమితులు లేని పాలసీని తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.