ETV Bharat / business

వడ్డీ రేట్లు పెరిగాయని పాత FDలు రద్దు చేస్తే లాభమా, నష్టమా?

author img

By

Published : Nov 13, 2022, 2:32 PM IST

ఒకప్పటి వరకు తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. గతంలో తమ సొమ్మును తక్కువ వడ్డీకి జమ చేసిన వారు.. తమ పాత డిపాజిట్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో ఓ సారి తెలుసుకుందాం.

Increase in Fixed deposit interest rates
Increase in Fixed deposit interest rates

రెండేళ్ల క్రితం వరకు తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. దీంతో తక్కువ వడ్డీకి డిపాజిట్‌ చేసిన వారు తమ పాత డిపాజిట్లను రద్దు చేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులు గత కొన్నాళ్లుగా వడ్డీ రేట్లను పెంచుతూనే ఉన్నాయి. రుణాలకు గిరాకీ అధికంగా ఉండటంతో.. డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలను తీసుకొస్తున్నాయి. దీంతో నమ్మకమైన పెట్టుబడిగా పేరున్న ఎఫ్‌డీలవైపు మళ్లీ సంప్రదాయ పెట్టుబడిదారులు కొంత మేరకు మొగ్గు చూపుతున్నారు.

ఆచితూచి..
వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో వీటిలో మదుపు చేయాలనుకుంటున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకే మొత్తంలో ఎఫ్‌డీ చేసే బదులు చిన్న చిన్న మొత్తాలుగా విభజించి, వివిధ కాల వ్యవధులకు డిపాజిట్‌ చేయాలి. కనీసం మూడు వేర్వేరు ఎఫ్‌డీలను చేయడం మంచిది. ఉదాహరణకు ఆరు నెలల వ్యవధికి ఒకటి, ఏడాది కాలానికి మరోటి, 18-24 నెలల వ్యవధికి మూడో ఎఫ్‌డీ చేయొచ్చు.

స్వల్పకాలిక ఎఫ్‌డీలను ఆటో రెన్యువల్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా బ్యాంకు వడ్డీ రేటును పెంచినట్లయితే, మీరు వ్యవధి తీరిన తర్వాత ఎఫ్‌డీని రద్దు చేసుకొని, కొత్త వడ్డీ రేటులో డిపాజిట్‌ చేయొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా మరికొంత కాలం వడ్డీ రేట్ల పెంపు కొనసాగవచ్చు. ఇది ఎంత వరకూ ఉంటుందనేది స్పష్టంగా చెప్పలేం. కాబట్టి, మీరు ఎఫ్‌డీలను దీర్ఘకాలానికి కాకుండా స్వల్పకాలానికి మదుపు చేస్తూ ఉండాలి.

రద్దు చేసుకోవాలా? చాలామంది డిపాజిటర్లు తమ ప్రస్తుత ఎఫ్‌డీలను రద్దు చేసుకొని, తిరిగి అధిక వడ్డీ రేటు డిపాజిట్లలో జమ చేయాలనుకుంటున్నారు. దీనివల్ల వారికి రాబడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని అంశాలను పరిశీలించాకే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. తక్కువ వడ్డీ నుంచి అధిక వడ్డీ ఎఫ్‌డీలకు మారడం వల్ల రాబడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది. కానీ, ఎఫ్‌డీలను మధ్యలోనే ఉపసంహరించుకోవడం వల్ల వడ్డీ ఆదాయంపై రుసుములు, ఆదాయం పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ఎఫ్‌డీలను వ్యవధికి ముందే రద్దు చేసినప్పుడు వడ్డీ ఆదాయం తగ్గుతుంది. పైగా బ్యాంకులు అప్పటివరకూ ఇచ్చిన వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌)ను వర్తింప చేస్తాయి. కొన్ని బ్యాంకులు జరిమానాలూ విధిస్తుంటాయి. రుసుములు, పన్ను రూపంలో చెల్లించే మొత్తం అధికంగా ఉన్నప్పుడు.. కొత్త రేట్ల వల్ల వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. కాబట్టి, పాత వడ్డీ రేటు, కొత్త వడ్డీ రేటు మధ్య ఉన్న వ్యత్యాసం, రద్దు చేసుకుంటే ఉండే లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతే సరైన నిర్ణయం తీసుకోవాలి.

ఇదీ చదవండి:ఇంటి లోన్​ కోసం క్రెడిట్​ స్కోర్​ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ మీకోసమే!

భారత్​పై యాపిల్​ కన్ను.. ఐఫోన్​ తయారీలో మన హవా ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.