కొంపముంచిన మస్క్​ అల్టిమేటం.. ట్విట్టర్​లో గందరగోళం.. రాజీనామాకు ఉద్యోగులు సిద్ధం

author img

By

Published : Nov 18, 2022, 11:56 AM IST

elon musk

ట్విట్టర్​ను నిజమైన వాక్‌ స్వేచ్ఛకు వేదికగా మారుస్తానంటూ చెప్పిన మస్క్‌.. ఇప్పుడు సంస్థలో తీవ్ర గందరగోళానికి కారణమయ్యారు. ఆయన తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఉద్యోగులు విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఉంటారా.. వెళ్తారా.. అంటూ ఆయన జారీ చేసిన అల్టిమేటం మొదటికే మోసం తెచ్చినట్లుంది.

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు మార్పులు తప్పవని ప్రకటించిన మస్క్‌.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మొదటికే మోసమొచ్చే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అసలు ఆయన ఏం చేయనున్నారు? ట్విట్టర్‌ను ఎలా తీర్చిదిద్దనున్నారనే సంశయంతో ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన బుధవారం జారీ చేసిన ఓ అల్టిమేటం ఈ గందరగోళ పరిస్థితుల్ని మరింత తీవ్రం చేసింది.

కొంపముంచిన అల్టిమేటం..
కంపెనీని మెరుగుపరిచేందుకు కష్టపడి పనిచేస్తారా.. లేక వెళ్లిపోతారా అంటూ బుధవారం ఉద్యోగులకు మస్క్‌ ఓ మెయిల్‌ పంపిన విషయం తెలిసిందే. ఇలా లిఖితపూర్వకంగా హామీ కోరడాన్ని అనేక మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సమ్మతిస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనన్న భయంతో చాలా మంది కంపెనీని వీడడానికే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా సంస్థ కార్యకలాపాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మస్క్‌ ఇచ్చిన మూడు నెలల గడువు తర్వాత వెళ్లడానికి చాలా మంది సుముఖంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు తెలిపారు. కంపెనీ అంతర్గత సమాచార వేదికల్లో ఉద్యోగులంతా "సెల్యూట్‌ ఎమోజీ"లను పోస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఇలా అయితే కష్టమేనట!
కంపెనీని వీడుతున్న వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ట్విట్టర్‌ పనితీరు ఎలా ఉంటుందనే కీలక సమాచారం తెలిసిన వ్యక్తులు, బృందాలు సైతం కంపెనీని వీడడానికి సిద్ధమైనట్లు సమాచారం. మస్క్‌ తీసుకొస్తున్న మార్పుల వల్ల వచ్చే సమస్యల్ని పరిష్కరించడం బహుశా సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారట. పైగా మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. విద్వేష సమాచారం పెరిగిపోయి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తే దాంట్లో ట్విటర్‌ బయటపడే అవకాశం లేదని ఉద్యోగులు భావిస్తున్నారట!

అప్రమత్తమైన యాజమాన్యం..
ఉద్యోగుల మూకుమ్మడి నిర్ణయంతో అప్రమత్తమైన ట్విట్టర్‌.. సోమవారం వరకు కార్యాలయాలను మూసివేసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఈ మేరకు యాజమాన్యం ఉద్యోగులకు లేఖ రాసినట్లు సమాచారం. కంపెనీ నిబంధనల ప్రకారం.. ఎవరూ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయొద్దని ఉద్యోగులను కోరినట్లు తెలుస్తోంది. నిజానికి బుధవారం నాటి అల్టిమేటం వల్ల ఈ స్థాయిలో ఉద్యోగులు కంపెనీని వీడతారని మస్క్‌ అంచనా వేయలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది.

మస్క్‌ దిద్దుబాటు చర్యలు..
మొదటికే మోసం వస్తోందని గమనించిన మస్క్‌ వెంటనే అప్రమత్తమైనట్లు సమాచారం. అల్టిమేటం జారీ చేస్తూ పంపిన ఫారం సమర్పించడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా.. మస్క్‌ ఉద్యోగులకు ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో ఉద్యోగుల్ని బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నించారట! కొన్ని నిబంధనల విషయంలో వెనక్కి తగ్గారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా "ఇంటి నుంచి పని" విషయంలో.. పనితీరు బాగుందని మేనేజర్లు ధ్రువీకరించిన వారికి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నామని మస్క్‌ ఉద్యోగులకు వివరించే ప్రయత్నం చేశారట. అలాగే కంపెనీలోని కొంతమంది కీలక వ్యక్తులతో సమావేశం కూడా నిర్వహించినట్లు సమాచారం. అయినప్పటికీ ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.