'భయం వద్దు.. మన విమానాల్లో ప్రయాణం సురక్షితం!'

author img

By

Published : Jul 31, 2022, 3:33 PM IST

airline safety india

Airline safety India : భారత విమానయాన రంగం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు డీజీసీఏ సారథి అరుణ్ కుమార్. స్పైస్​జెట్ సహా కొన్ని దేశీయ సంస్థల విమానాల్లో ఇటీవల సమస్యలు తలెత్తినా.. అవి ఆందోళన చెందాల్సినంత తీవ్రమైనవి కాదని భరోసా ఇచ్చారు.

Airline safety India : ఇటీవల కొన్ని విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు మొత్తం పరిశ్రమపై పెను ప్రభావం చూపేంత తీవ్రమైనవేమీ కాదని విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. గత 16 రోజుల్లో భారత్‌కు వచ్చిన విదేశీ విమానాల్లోనూ ఈ తరహా సమస్యలు వెలుగుచూసినట్లు వెల్లడించారు. దేశ విమానయాన రంగం సురక్షితంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ICAO) నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తున్నామని తెలిపారు.

చిన్న చిన్న సమస్యలు తలెత్తడం విమానాల్లో సాధారణమని.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశీయ విమానాల్లో ఇటీవల వెలుగుచూసిన సమస్యల వంటివే విదేశీ విమానయాన సంస్థలు సైతం తమ విమానాల్లో గుర్తించాయని తెలిపారు. ఇటీవల స్పైస్‌జెట్‌, ఇండిగో సహా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పైలట్లు అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. డీజీసీఏ ఆయా సంస్థలకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది. రెండు నెలల ప్రత్యేక తనిఖీలను ప్రారంభించింది. అందులో భాగంగా స్పైస్‌జెట్‌కు చెందిన దాదాపు 50 శాతం సర్వీసుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశీయ విమానాల భద్రతపై పలు వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది.

కరోనా సంక్షోభంతో తీవ్ర గడ్డు పరిస్థితుల్లోకి జారుకున్న దేశీయ విమానయాన పరిశ్రమ క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం రోజుకి 6000-7000 'ఎయిర్‌క్రాఫ్ట్‌ మూవ్‌మెంట్లు' నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 మధ్య దాదాపు 150 సందర్భాల్లో పలు విమానాల్లో సమస్యలు తలెత్తినట్లే పౌరవిమానయాన శాఖ ఇటీవల తెలిపింది. ఈ నేపథ్యంలో మే 2 నుంచి జులై 13 మధ్య డీజీసీఏ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.