ETV Bharat / business

హిండెన్‌బర్గ్​తో అదానీ సంపద పతనం.. నెలలో 11 లక్షల కోట్లు ఆవిరి!

author img

By

Published : Feb 23, 2023, 9:24 AM IST

Updated : Feb 23, 2023, 10:07 AM IST

హిండెన్‌బర్గ్‌ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో అక్కడక్కడా కనిష్ఠాల వద్ద ఉపశమన ర్యాలీ వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు వెలువడుతున్న కొత్త వార్తల వల్ల షేర్లు మరింత దిగజారుతున్నాయి. తాజాగా వికిపీడియా చేసిన ఆరోపణలతో 51,294 కోట్ల మదుపర్ల సంపద ఆవిరి కాగా.. మొత్తం మీద 11 లక్షల కోట్లు సంపద కరిగిపోయిందని అంచనా.

total loss of adani group till now
ఆవిరైన అదానీ సంపద

వికిపీడియా ఆరోపణలు, స్టాక్‌ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులతో అదానీ కంపెనీల షేర్ల అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఒక్కరోజే గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 51,294 కోట్ల వరకు ఆవిరైనట్లు అంచనా. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అత్యధికంగా 10.4 శాతం నష్టపోయింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదలైన తర్వాత జనవరి 25 నుంచి షేర్ల పతనం ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లకు పైగా కరిగిపోయింది. దాదాపు నెల వ్యవధిలో 60 శాతానికి పైగా విలువ ఆవిరైనట్లు అంచనా.

మరోవైపు ముంద్రాలో ఏర్పాటు చేయాలనుకున్న భారీ ప్లాంట్‌ నిర్మాణ ప్రణాళికలను పునఃసమీక్షించనున్నట్లు అదానీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేశిందర్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం గ్రూప్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులనూ చేపట్టబోమని ప్రకటించారు. కొత్త రోడ్డు ప్రాజెక్టులకు కూడా బిడ్లు దాఖలు చేయబోదని తెలిపారు. ఈ పరిణామం కూడా షేర్ల నష్టాల్లో భాగమైందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని జుగేశిందర్‌ తెలిపారు.

మరోవైపు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ పేరిట ఉన్న 1,500 కోట్ల రుణాన్ని అదానీ గ్రూప్ తిరిగి చెల్లించింది. అందులో వెయ్యి కోట్లను ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు, 500 కోట్లను ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌కు చెల్లించింది. దీంతో తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని అదానీ గ్రూప్‌ చెల్లించేసిందని ఎస్‌బీఐ ఎంఎఫ్‌ ప్రకటించింది. ఇక తమకు అదానీ గ్రూప్‌ ఎలాంటి బకాయి లేదని తెలిపింది.

కాగా, అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ.. అమెరికా కంపెనీ హిండెన్​బర్గ్​ రీసెర్చ్​ నివేదికను విడుదల చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్​ తీవ్రంగా ఖండించింది. అయితే ఈ ఆరోపణల కారణంగా అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

Last Updated :Feb 23, 2023, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.