ETV Bharat / business

స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ఇది సరైన సమయమేనా?

author img

By

Published : Aug 30, 2021, 5:19 PM IST

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి ప్రదర్శన కనబరుస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ ఈ దూకుడు కొనసాగుతుందా? ఇప్పుడు పెట్టుబడులు పెట్టే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం పెట్టుబడులకు అనువుగా ఉన్న రంగాలేవి? నిపుణులు ఏమంటున్నారు?

Investing in Share market
షేర్ మార్కెట్లో పెట్టుబడి

షేర్ మార్కెట్లు ప్రస్తుతం దూకుడు ప్రదర్శిస్తున్నాయి. సూచీలు రోజు రోజు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex news) 57వేల స్థాయికి చేరువలో ఉంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty News) 17 వేలకు చేరువైంది.

గతేడాది కరోనా భయాలతో మార్కెట్లు రికార్డు స్థాయిలో పడిపోయాయి. తదనంతరం మళ్లీ అంతకంటే వేగంగా రికవరీ అయ్యాయి. కరోనా రెండో దశ ప్రభావం మార్కెట్లపై అంతగా పడలేదు. వ్యాక్సినేషన్ వేగం పెరగటం సహా.. దేశీయంగా, అంతర్జాతీయంగా ఇతర సానుకూలతలతో సూచీలు దూసుకెళ్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇప్పటికే లాభాల స్వీకరణ ఒత్తిడి..

సూచీలు భారీగా లాభపడినప్పటికీ.. అర్థవంతమైన కరెక్షన్ చూడలేదు. గత కొన్ని సెషన్ల నుంచి ఇండెక్స్ పెరిగినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్​లో షేర్లలో లాభాల స్వీకరణ వల్ల ఒత్తిడి కనిపిస్తోంది.

"స్వల్ప కాలంలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. దీనివల్ల లార్జ్ క్యాప్​లో కూడా కరెక్షన్ రావచ్చు. గత కొన్ని నెలలుగా చూస్తే అర్థవంతమైన కరెక్షన్ చూడలేదు."

- సతీశ్​ కంతేటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్ మనీ

దిద్దుబాటుకు అవకాశాలు..

అమెరికాలో ఫెడరల్ బ్యాంకు మానిటరీ పాలసీలో మార్పు(పాలసీ ట్యాపరింగ్) తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇటీవల ద్రవ్యలభ్యతను పెంచిన ఫెడ్.. ఇప్పుడు దానిని తగ్గించేందుకు కరెన్సీ ముద్రించటం, బాండ్ల కొనుగోలు తగ్గించటం వంటి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ఇది కరెక్షన్​కు ట్రిగ్గర్​గా పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఏమిటీ ట్యాపరింగ్​?

కరోనా వల్ల నష్టపోయిన ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు అమెరికా ఫెడరల్ బ్యాంకు ద్రవ్యలభ్యతను పెంచేందుకు కరెన్సీ ముద్రించటం, బాండ్ల కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం వీటిని తగ్గిస్తామని ప్రకటించింది. దీనినే సాంకేతికంగా మానిటరీ పాలసీ ట్యాపరింగ్​గా పరిగణిస్తారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నంతమేర ద్రవ్యలభ్యత ఉండకపోవచ్చు. ఫలితంగా మార్కెట్లపై స్వల్ప కాలంలో ప్రతికూల ప్రభావం పడుతుంది.

పెట్టుబడి ఎలా?

సూచీలు ప్రస్తుతం ఆల్​టైం గరిష్ఠాల వద్ద ఉన్నందువల్ల.. దీర్ఘకాల పెట్టుబడుల కోసమైతే.. ఒకేసారి ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టొద్దని నిపుణులు సూచిస్తున్నారు. స్వల్ప, మధ్యస్థ కాలానికి అయితే మార్కెట్ ఆసక్తి తక్కువ ఉన్న రంగాలను ఎంచుకోవటం ఉత్తమమని వారు సలహా ఇస్తున్నారు.

"మార్కెట్​లో తక్కువ ధరలు ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టొచ్చు. కానీ ఇప్పుడు సూచీలు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. ఎక్కువ మొత్తం ఒకేసారి మదుపు చేస్తే కరెక్షన్ వచ్చినప్పుడు అధికంగా నష్టపోయే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. 5 సంవత్సరాల కంటే దీర్ఘకాలం కోసం పెట్టుబడులు ప్రారంభించే వారు.. ఒకేసారి భారీగా కాకుండా విడతల వారీగా పెట్టుబడి పెట్టటం ఉత్తమం. మార్కెట్ తక్కువ ఆసక్తి ఉన్న యుటిలిటీ, పీఎస్​యూలలో రిస్కు తక్కువగా ఉంటుందని భావిస్తున్నాం. ఎఫ్​ఎంసీజీ లాంటి స్థిరమైన ప్రదర్శన కనబర్చే రంగాలను కూడా ఎంచుకోవచ్చు"

- సతీశ్​ కంతేటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్ మనీ

గమనిక: ఇందులోని సూచనలు, సలహాలు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇందులోని విషయాలపై మాత్రమే ఆధారపడి పెట్టుబడులు పెట్టొద్దని సలహా. పెట్టుబడులు ప్రారంభించే ముందు వ్యక్తిగత ఆర్థిక నిపుణుడిని ప్రత్యక్షంగా కలిసి.. తుది నిర్ణయం తీసుకోవడం మేలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.