Free DEMAT: ఉచిత డీమ్యాట్​ ఆఫర్​లో నిజమెంత?

author img

By

Published : Jun 2, 2021, 11:50 AM IST

Who will maintain Demat accounts

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా(DEMAT account) ఉండాల్సిందే. వీటికి సంబంధించి చాలా ప్రకటనలు ఇంటర్నెట్​లో, టీవీల్లో చూస్తుంటాం. ఉచిత ఖాతా(Free DEMAT) మీము అందిస్తున్నాం అనేది వాటి సారంశంగా మెజార్టీ సందర్భాల్లో ఉంటుంది. అసలు డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? నిజంగా ఇవి ఉచితంగా ఉంటాయా? వాటిలో నిజం ఎంత?

ఏదైనా ఆస్తి కొన్నట్లయితే దానికి సంబంధించిన పత్రాలే యాజమాన్య హక్కులను తెలుపుతాయి. దీనికోసం రిజిస్ట్రేషన్, పట్టా తదితర దస్త్రాలు ఉండాలి. అయితే రోజుకు కొన్ని కోట్ల సంఖ్యలో చేతులు మారే స్టాక్స్ విషయంలో ఇలా పత్రాలను పొందటం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఎలక్ట్రానిక్ రూపంలో యాజమాన్య హక్కులను పొందుపరస్తారు. దీనికోసం ఉపయోగించేదే డీమ్యాట్ ఖాతా(DEMAT account).

డీమ్యాట్ అంటే డీ మెటీరియలైజేషన్. డీమ్యాట్ ఖాతా అనేది బ్యాంకు ఖాతా లాంటిది. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటాయి. అదే డీమ్యాట్​లో అయితే షేర్లు ఉంటాయి. డీమ్యాట్ వ్యవస్థ​ను దేశంలో 1996లో ప్రవేశపెట్టారు.

స్టాక్ మార్కెట్లో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా(DEMAT account) తప్పనిసరిగా ఉండాలి. ఈ ఖాతాలను బ్రోకరేజీ సంస్థలు సెంట్రల్ డిపాజిటరీల సహాయంతో అందిస్తాయి. సెంట్రల్ డిపాజిటరీలైన నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్​ఎస్​డీఎల్​) లేదా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) డీమ్యాట్ ఖాతాలను అందిస్తాయి. ఈ డిపాజిటరీలకు ఉండే ఏజెంట్లను డిపాజిటరీ పార్టిసిపెంట్(డీపీ) అంటారు. ఇవి పెట్టుబడిదారులకు, సెంట్రల్ డిపాజిటరీలకు మధ్యవర్తులుగా ఉంటాయి.

600ల డీపీలు..

జెరోదా, ఏంజెల్ బ్రోకింగ్, అప్​స్టాక్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సెక్యూరిటీస్​ తదితరాలన్ని డీపీలే. డీమ్యాట్ ఖాతాను ఎలక్ట్రానిక్ రూపంలో యాక్సెస్ చేసుకోవచ్చు. సీడీఎస్ఎల్ గణాంకాల ప్రకారం దాదాపు 600 డీపీలు రిజిస్టర్​ అయి ఉన్నాయి. డీమ్యాట్ ఖాతాలు సాధారణంగా ట్రేడింగ్ అకౌంట్​తో కలిసి వస్తాయి. బ్యాంకుల అయితే వీటితో పాటు సేవింగ్స్ ఖాతాను కూడా అందిస్తున్నాయి.

ఉచిత ఖాతాలు

డీమ్యాట్ ఖాతా తెరిచే ప్రక్రియ ఒకప్పుడు క్లిష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా సులభం అయింది. అంతేకాకుండా ఛార్జీలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. డీమ్యాట్ విషయంలో రెండు రకాల ఛార్జీలు ఉంటాయి. ఒకటి ఖాతా తెరిచేందుకు ఉండే ఛార్జీలు కాగా, రెండోది వార్షిక నిర్వహణ ఛార్జీలు.

మొదటి రకం ఛార్జీ ఒకసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. నిర్వహణ ఛార్జీ మాత్రం వార్షికంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని సంస్థలు ఉచితంగా డీమ్యాట్ ఖాతాను(Free DEMAT) అందిస్తున్నాయి. వార్షిక నిర్వహణ ఛార్జీలను కూడా కొన్ని సంస్థలు తీసుకోవటం లేదు. వీటిని గమనించి డీమ్యాట్ ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా బ్రోకరేజీ సంస్థలు డీమ్యాట్ ఖాతాతో పాటు ట్రేడింగ్ అకౌంట్ ను అందిస్తుంటాయి. డీమ్యాట్ ఖాతాను ఉచితంగా(Free DEMAT) ఇచ్చినప్పటికీ సంస్థలు బ్రోకరేజీ ఛార్జీలను ఎక్కువగా వసూలు చేస్తుంటాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉచితం చాలా తక్కువ..

ఖాతా తెరిచేందుకు ఛార్జీలు లేకుండా, వార్షిక నిర్వహణ ఛార్జీలు లేకుండా అంటే పూర్తి ఉచితంగా డీమ్యాట్ ఖాతాను అందించే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విభాగంలో వెంచూరా, విస్డమ్ క్యాపిటల్, ప్రో స్టాక్స్, ఆర్ మనీ లాంటి సంస్థలు ఉన్నాయి. కొన్ని వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేయకుండా ఒకే సారి కొంత మొత్తం తీసుకుంటున్నాయి. ట్రేడింగ్​కు సంబంధించిన ప్రఖ్యాత సంస్థలన్నీ రెండింటిలో ఏదో ఒక దానిని వసూలు చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.