అప్పు కావాలా? మరి తక్కువ వడ్డీ రుణం ఏదో తెలుసా?

author img

By

Published : Sep 10, 2021, 4:30 PM IST

Which is best loan

రుణాల్లో.. బంగారంపై రుణం (Gold loan), ఫిక్స్​డ్ డిపాజిట్​పై రుణం, వ్యక్తిగత రుణాలు (Personal loan) చాలా పాపులర్. మరి ఇందులో ఏ రుణంపై తక్కువ వడ్డీ (Low interest loans) ఉంటుంది? వేటి ద్వారా ప్రయోజనాలు ఎక్కువ? అనేది తెలుసుకుందాం.

ఆపద సమయంలో సరిపడా డబ్బు లేనట్లయితే రుణాల ద్వారా ఆ అవసరాన్ని తీర్చుకోవచ్చు. కొవిడ్ సమయంలో చాలా మందికి వేతనాల్లో కోత పడింది. మరికొంత మంది ఉద్యోగం కోల్పోయారు. అలాంటి వారంతా.. రుణాలను ఆశ్రయిస్తున్నారు. బంగారంపై రుణం ((Gold loan)), ఫిక్స్​డ్ డిపాజిట్​పై రుణం, వ్యక్తిగత రుణాలు (Personal loan).. అవసరానికి ఆదుకుంటాయి.

రుణాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ రుణం (Secured loans), మరొకటి అన్​సెక్యూర్డ్ రుణం. తనఖా ద్వారా పొందితే వాటిని సెక్యూర్డ్ రుణాలు అంటారు. ఎలాంటి తనఖా లేకుండా పొందేవి అన్​సెక్యూర్డ్ (Unsecured loans) రుణాలు.

ఫిక్స్​డ్ డిపాజిటపై, బంగారంపై రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత రుణాన్ని అన్​సెక్యూర్డ్ రుణంగా చెప్పొచ్చు.

ఫిక్స్​డ్ డిపాజిట్ రుణాలు (loan against Fixed Deposits)

ఈ తరహా రుణాలను సులభంగా పొందవచ్చు. ఫిక్స్​డ్ డిపాజిట్​పై వస్తోన్న వడ్డీరేటు కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేటుతో ఈ రుణాన్ని పొందవచ్చు. ప్రస్తుతం ఎఫ్​డీ వడ్డీ రేట్లు 5.5-7 శాతం మధ్య ఉన్నాయి. కాబట్టి 6 నుంచి 6.5 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో ఎఫ్​డీపై రుణం పొందవచ్చు.

బ్యాంకులిచ్చే రుణాల్లో దీనిని.. త్వరగా మంజూరయ్యేదిగా పరిగణించవచ్చు. ఇందులో వడ్డీ రేటు హోం లోన్​ కంటే తక్కువగా ఉంటుంది. చాలా బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు ప్రాసెసింగ్ ఫీజులు కూడా తీసుకోవు. అంతేకాకుండా ప్రీ పేమెంట్ ఛార్జీలు కూడా దాదాపు ఉండవు.

ఎఫ్​డీలో దాదాపు 90 శాతం రుణంగా పొందొచ్చు. అంటే రూ. లక్ష ఎఫ్​డీ ఉంటే అందులో.. రూ.90 వేలను రుణంగా పొందే వీలుంది. అయితే ఇది బ్యాంకును బట్టి మారుతుంది.

ఎఫ్​డీపై రుణం తీసుకుంటే ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. ఎఫ్​డీ మెచ్యూరిటీ కంటే ముందే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఏదైనా అత్యవసరం వల్ల ఎఫ్​డీని.. మెచ్యూరిటీ కంటే ముందే ఉపసంహరించుకోవాల్సి వస్తే.. దానికి బదులు ఎఫ్​డీపై రుణం తీసుకోవడం ఉత్తమమని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా అనవసర ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.

గోల్డ్ లోన్

ఇది కూడా సెక్యూర్డ్ రుణం. బంగారం భారతీయ కుటుంబాల్లో సంప్రదాయంగా పరిగణిస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. అందుకే దీనిని తనఖా పెట్టి అప్పు తీసుకునేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ రుణం సులభంగా దొరుకుతుంది. అంతేకాకుండా పేపర్ వర్క్ కూడా పెద్దగా ఉండదు. ఇతర సెక్యూర్డ్ రుణాలతో పోల్చితే ప్రాసెసింగ్ సమయం, ప్రాసెసింగ్ ఫీజు కూడా తక్కువ.

ఈ రుణాలకు.. దరఖాస్తుదారు ఆదాయం, క్రెడిట్ స్కోరును బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు దాదాపు పరిగణనలోకి తీసుకోవు. అయితే 18 క్యారెట్లు అంతకంటే.. ఎక్కువ నాణ్యతతో కూడిన బంగారంపై మాత్రమే రుణాన్ని ఇస్తాయి. ఎక్కువ స్వచ్ఛత ఉంటే.. ఎక్కువ రుణం లభిస్తుంది.

వడ్డీ లేదా ఈఎంఐ..

రుణం ఇచ్చిన బ్యాంకు, ఫినాన్స్ కంపెనీని బట్టి రిపేమెంట్ ఆప్షన్లు వేరు వేరుగా ఉంటాయి. కొన్ని.. నెల నెల వడ్డీ మాత్రమే తీసుకుని.. చివర్లో మొత్తం ఒకేసారి చెల్లించేందుకు అవకాశం ఇస్తాయి. కొన్ని ఈఎంఐ తరహాలో అసలుతో పాటు కొంత వడ్డీ చెల్లించమని అడుగుతుంటాయి. కొన్నైతే రుణం ఇచ్చినప్పుడే వడ్డీని తీసుకుంటాయి.

బంగారంపై రుణం సాధరణంగా స్వల్ప కాలానికి సంబంధించినది. సంవత్సరం గడువుతోనే ఎక్కువ బ్యాంకులు ఇలాంటి రుణాలను అందిస్తాయి.

సెక్యూర్డ్ రుణం విషయంలో.. అప్పు తిరిగి చెల్లించలేనట్లయితే తనఖా పెట్టిన బంగారం, ఎఫ్​డీని కోల్పోవాల్సి ఉంటుంది. బ్యాంకులు వీటి విక్రయం ద్వారా తమకు రావాల్సిన మొత్తాన్ని తిరిగి పొందుతాయి. ఇలా జరిగినట్లయితే... క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్​పై కూడా ప్రభావం ఉంటుంది.

వ్యక్తిగత రుణం

ఇందులో ఎలాంటి తనఖా ఉండదు. కేవలం రిపేమెంట్ హిస్టరీ, ఆదాయం, క్రెడిట్ స్కోరు ఆధారంగా బ్యాంకులు రుణాన్ని అందిస్తుంటాయి. కాబట్టి బ్యాంకుకు రిస్కు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ రేటు సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది.

ఈ రుణం ప్రాసెసింగ్ సమయం ఎక్కువ. అయితే పర్సనల్​ లోన్​ రీపేమెంట్​ గడువు కూడా ఎక్కువగా ఉంటుంది. రుణ మొత్తం ఎంత అనేది.. అప్పు తీసుకునే వ్యక్తి ఆదాయం, క్రెడిట్​ హిస్టరీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.