ETV Bharat / business

వంట గ్యాస్ ధర తగ్గింపు! ఎస్​బీఐలో ఆ సేవలు ఫ్రీ!! ఫిబ్రవరిలో వచ్చే మార్పులివే...

author img

By

Published : Jan 30, 2022, 3:50 PM IST

సామాన్యుడిపై ప్రభావం చూపే.. బ్యాంకింగ్​, రైల్వే, పోస్టాఫీసులకు సంబంధించిన నిబంధనలు, ఎల్​పీజీ ధరల్లో మార్పుల వంటివి చాలా ముఖ్యమైనవి. ఫిబ్రవరి 1న అమలులోకి రానున్న మార్పులేమిటి? వంట గ్యాస్​ ధర మరింత ప్రియం కానుందా? ఎస్​బీఐ ఐఎంపీఎస్​ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి?

lpg-price-changes
ఎస్​బీఐ ఛార్జీల్లో మార్పు

2022 కొత్త ఏడాదిలో మొదటి నెల పూర్తయి రెండో నెలలోకి అడుగుపెడుతున్నాం. అయితే, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సామాన్యుడిని ప్రభావితం చేసే బ్యాంకింగ్​ నిబంధనలు, ఎల్​పీజీ ధరల్లో మార్పులు జరగనున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

ఎస్​బీఐ ఐఎంపీఎస్​ ఛార్జీల్లో మార్పు..

SBI imps rates: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ).. కస్టమర్లకు శుభవార్త అందించింది. డిజిటల్​ ఇమీడియట్​ పేమెంట్స్​ సర్వీస్​(ఐఎంపీఎస్​) లావాదేవీల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి సేవా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2022, ఫిబ్రవరి 1న అమలులోకి వస్తాయని తెలిపింది. ఎస్​బీఐ వినియోగదారులు.. నెట్​ బ్యాంకింగ్​, మొబైల్​ బ్యాంకింగ్​, యోనో యాప్​ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచితంగా ఐఎంపీఎస్​ సేవలను పొందవచ్చు. గతంలో ఉచిత చెల్లింపులు రూ.2 లక్షల వరకే అందించగా.. డిజిటల్​ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.5 లక్షల వరకు పెంచినట్లు తెలిపింది బ్యాంక్​.

బ్యాంక్​ బ్రాంచ్​ ద్వారా చెల్లిస్తే..

ఏదైనా ఎస్​బీఐ బ్యాంక్​ శాఖ ద్వారా ఐఎంపీఎస్​ చెల్లింపులు చేస్తే.. ప్రస్తుతం ఉన్న స్లాబ్​ల ప్రకారమే సేవా రుసుములు ఉంటాయని, ఎలాంటి మార్పులు చేయటం లేదని స్పష్టం చేసింది. అయితే.. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లింపుల స్లాబ్​ను కొత్తగా తీసుకొచ్చింది ఎస్​బీఐ. దీనికి రూ.20+ జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఫిబ్రవరి 1న అమలులోకి రానుంది.

ప్రస్తుతం బ్యాంక్​ శాఖ ద్వారా రూ.వెయ్యిలోపు ఐఎంపీఎస్​ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు లేవు. రూ.1000 నుంచి రూ.10వేల లోపు చెల్లింపులకు రూ.2+జీఎస్​టీ, రూ.10వేల నుంచి రూ.లక్షలోపు చెల్లింపులకు రూ.4+ జీఎస్​టీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.12+జీఎస్​టీ, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ. 20+జీఎస్​టీ సేవా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్​పీజీ సిలిండర్​ ధర పెంపు?

LPG Price: ప్రతి నెల తొలి రోజున ఎల్​పీజీ సిలిండర్​ ధరలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తాయి చమురు సంస్థలు. ప్రస్తుత పరిస్థితుల్లో వంట గ్యాస్​ ధరలను పెంచే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి. అందుకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో పెరుగుదల కనిపించటం ఒక కారణం కావచ్చు. మరోవైపు.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో మోదీ ప్రభుత్వం గ్యాస్​ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో గృహవినియోగ ఎల్​పీజీ సిలిండర్​ ధర రూ.899.50గా ఉంది. కోల్​కతాలో రూ.926, ముంబయిలో రూ.899.50, చెన్నైలో రూ.915.50గా ఉంది. వాణిజ్య సిలిండర్​ ధర దిల్లీలో రూ.1998.50, కోల్​కతాలో రూ.2,076, ముంబైలో రూ.1,948.50, చెన్నైలో రూ.2,131గా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Budget 2022: కొవిడ్‌ అస్థిరతకు బడ్జెట్‌ మాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.