ETV Bharat / business

అమెజాన్ బాస్ సంపద ఒక్క రోజులో రూ.97 వేల కోట్లు ప్లస్

author img

By

Published : Jul 21, 2020, 2:01 PM IST

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ కేవలం ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రూ.97 వేల కోట్లు గడించారు. అమెరికా మార్కెట్లలో సంస్థ షేర్లు సోమవారం భారీగా పుంజుకోవడం ఇందుకు కారణం. దీనితో బెజోస్ మొత్తం సంపద రూ.14 లక్షల కోట్లు దాటింది.

jeff Bezos net worth
జెఫ్​ బెజోస్ సంపద కొత్త రికార్డు

ప్రపంచ అపరకుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్ మరో కొత్త రికార్డు నెలకొల్పారు. ఒక్క రోజులోనే (సోమవారం) బెజోస్ సంపద 13 బిలియన్​ డాలర్లు (రూ.97 వేల కోట్ల పైమాటే) పెరిగింది.

అమెరికా స్టాక్ మార్కెట్లలో అమెజాన్ షేర్లు జులై 20న దాదాపు 8 శాతం పెరిగి 3,196.84 డాలర్ల (జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది. దీనితో బెజోస్ సంపద ఈ స్థాయిలో వృద్ధి చెందింది.

సంక్షోభంలోనూ వృద్ధే..

బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద ఈ ఏడాది ఇప్పటి వరకు 74 బిలియన్ డాలర్లు పెరిగి.. 189.3 బిలయన్ డాలర్లకు (రూ.14 లక్షల కోట్లకుపైమాటే) చేరింది. ఇప్పటికే బెజోస్ ప్రపంచ ధనవంతుల్లో అగ్రస్థానంలో ఉన్నారు.

2012 నుంచి బ్లూమ్​బర్గ్ ఇండెక్స్ ప్రపంచ కుబేరుల సంపద వివరాలు వెల్లడిస్తోంది. అప్పటి నుంచి ఒక్క రోజులో వ్యక్తిగత సంపద ఈ స్థాయిలో పెరగటం ఇదే ప్రథమం.

కరోనా వల్ల అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంటే.. అమెజాన్ మాత్రం ఈ ఏడాది భారీగా పుంజుకోవడం గమనార్హం.

ఇదే సమయంలో బెజోస్​ మాజీ భార్య మెకాంజీ సంపద కూడా ఒక్క రోజులో (సోమవారం) 4.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితాలో ఈమె 13వ స్థానంలో ఉన్నారు.

ఇదీ చూడండి:సొంత 5జీ టెక్నాలజీతో 'క్లీన్​ టెల్కో'గా రిలయన్స్ జియో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.