ETV Bharat / business

అక్టోబర్​లో కొవావాక్స్ టీకా!​.. పిల్లలకు ఎప్పుడంటే...

author img

By

Published : Aug 6, 2021, 6:17 PM IST

Updated : Aug 6, 2021, 7:14 PM IST

'కొవావాక్స్​' కరోనా టీకాను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్​లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సంస్థ తెలిపింది. పిల్లల కోసం ఈ టీకాను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తామని చెప్పింది.

Covovax  vaccine
కొవావాక్స్ టీకా

వయోజనుల కోసం కొవావాక్స్​ టీకాను ఈ ఏడాది అక్టోబర్​లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా శుక్రవారం తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పిల్లలకు వినియోగించేందుకు ఈ టీకాను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు హోం మంత్రి అమిత్​ షాతో సమావేశం అనంతరం పూనావాలా మాట్లాడారు. దాదాపు 30 నిమిషాలపాటు వారిద్దరూ భేటీ అయ్యారు.

"టీకా ఉత్పత్తిలో మాకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాకారం అందిస్తోంది. అందుకు కృతజ్ఞతలు. డిమాండ్​కు తగ్గట్టుగా కొవిషీల్డ్​ టీకా ఉత్పత్తిని విస్తరించేందుకు మా సంస్థ ప్రయత్నిస్తోంది. డీసీజీఐ అనుమతి పొందిన అనంతరం.. కొవావాక్స్ టీకాను పెద్దల కోసం అక్టోబర్​లో విడుదల చేయాలని ఆశిస్తున్నాం. పిల్లల కోసం ఈ టీకాను వచ్చే ఏదాడి మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తాం."

-అదర్​ పూనావాలా, సీరం సంస్థ సీఈఓ

అంతకుముందు.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయాతోనూ అదర్​ పూనావాలా భేటీ అయ్యారు. కొవిషీల్డ్​ టీకా సరఫరాపై పూనావాలాతో ఫలప్రదమైన చర్చ జరిగిందని ట్విట్టర్​ వేదికగా మాండవీయా తెలిపారు.

కొవావాక్స్​ టీకా పిల్లల వినియోగానికి సంబంధించి రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ గత నెలలో సీరం సంస్థకు షరతులతో కూడిన అనుమతులిచ్చింది. 2 నుంచి 17 ఏళ్ల వయుసు మధ్య 920 మంది పిల్లలపై ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 12-17 ఏళ్ల వయసు పిల్లలు.. 460 మందిని ఒక గ్రూపుగా... 2 నుంచి 11 ఏళ్ల వయుసు మధ్య పిల్లలు 460 మందిని ఇంకో గ్రూపుగా విభజించి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ సంస్థ ఈ కొవావ్యాక్స్ టీకాను అభివృద్ధి చేసింది.

ఇదీ చూడండి: పిల్లల కోసం సీరం కొత్త టీకా- ఉత్పత్తి షురూ

Last Updated :Aug 6, 2021, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.