ETV Bharat / business

ఈపీఎఫ్​ఓ వడ్డీరేటుపై ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్​

author img

By

Published : Oct 29, 2021, 3:53 PM IST

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదారులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను... ఉద్యోగుల భవిష్య నిధిపై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.

epfo
ఈపీఎఫ్‌ఓ

2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఉద్యోగుల భవిష్యనిధి(ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్‌-ఈపీఎఫ్‌)పై 8.5శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌పై 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేయాలని ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్‌ఓ నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు ప్రతిపాదించింది. ఇందుకు కార్మిక శాఖ కూడా సమ్మతించింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించినట్లు సదరు వర్గలు పేర్కొన్నాయి. 5కోట్లకు పైగా ఈపీఎఫ్‌ చందాదారులకు త్వరలోనే ఈ వడ్డీని జమ చేసే అవకాశాలున్నట్లు తెలిపాయి.

2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు. అయితే కొవిడ్‌ సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని 8.5శాతానికి తగ్గించారు. ఏడేళ్లలో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. ఈ దఫా కూడా వడ్డీరేటును తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినా.. 8.5శాతం చొప్పున వడ్డీ జమ చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.