ETV Bharat / business

'అప్పటికల్లా రూ.75లక్షల కోట్లకు ఎగుమతులు'

author img

By

Published : Aug 12, 2021, 6:37 AM IST

దేశ మర్చండైజ్ ఎగుమతులు లక్ష కోట్ల డాలర్ల(దాదాపు రూ.75 లక్షల కోట్ల)కు చేరుకోగలవని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యం అంచనా వేశారు. 2027-28 కల్లా ఇది సాధ్యపడుతుందని అన్నారు.

exports
ఎగుమతులు

2027-28 కల్లా దేశ మర్చండైజ్‌ ఎగుమతులు లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.75 లక్షల కోట్ల)కు చేరుకోగలవని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యం అంచనా వేశారు. ఇందు కోసమే ప్రభుత్వం ఒక్కో జిల్లాను ఒక్కో ఎగుమతి కేంద్రంగా మార్చే పథకంతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 419 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.31.42 లక్షల కోట్ల) ఎగుమతులను వాణిజ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సవివర విశ్లేషణనూ జరిపింది. దేశం, వస్తువు, ప్రాంతం, రాష్ట్రాల స్థాయిలో ఈ లక్ష్యాన్ని విభజించారు. 'గత 10 ఏళ్లుగా భారత ఎగుమతులు 290-330 బి. డాలర్ల (రూ.22-25 లక్షల కోట్ల) మధ్య కదలాడుతున్నాయి. ముందుగా 500 బిలియన్‌ డాలర్ల స్థాయికి, తదుపరి లక్ష కోట్ల డాలర్లకు చేరేందుకు కార్యాచరణ ప్రణాళిక రచించాం. మా అంచనాల ప్రకారం.. 2027-28 నాటికి లక్ష కోట్ల డాలర్ల స్థాయికి మర్చండైజ్‌ ఎగుమతులు చేరొచ్చు' అని సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన వివరించారు.

సేవల రంగంపై దృష్టి: '2027-28 కల్లా సేవల రంగంలో ఎగుమతులను 700 బి. డాలర్లకు చేర్చాలని భావిస్తున్నాం. సేవల ఎగుమతి రంగం ప్రభుత్వంలో 30 విభాగాల్లో విస్తరించి ఉండడంతో సరైన దృష్టి ఉండడం లేదు. ఏటా 200 బి. డాలర్ల సేవలను ఎగుమతి చేస్తున్న మనం 2027-28 కల్లా 700 బి. డాలర్లకు వాటిని చేర్చడానికి తగిన చర్యలను తీసుకోబోతున్నాం' అని ఆయన అన్నారు. ఈ లక్ష్యాలను చేరడానికి ఏ చర్యలు తీసుకుంటామన్నది ఆయన వివరించారు. ఎమ్‌ఈఐఎస్‌, ఎస్‌ఈఐఎస్‌ పథకాలు నిలిచిపోయిన నేపథ్యంలో శుక్రవారం కల్లా రెమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రోడక్ట్స్‌(ఆర్‌ఓడీటీఈపీ) రేట్లను ప్రభుత్వం నోటిఫై చేయనుంది. జౌళి రంగం కోసం రిబేట్‌ ఆఫ్‌ స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ ట్యాక్సెస్‌ అండ్‌ లెవీస్‌(ఆర్‌ఓఎస్‌సీటీఎల్‌) పథకాన్ని కూడా త్వరలోనే తీసుకొచ్చి ఎగుమతులకు భారీ ఊరటనివ్వాలని భావిస్తున్నారు. 'ఒక్కో జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా పిలిచే ఒక పథకాన్ని తీసుకువస్తున్నాం. 100-150 జిల్లాలకు నిధులను ఇచ్చి ఎగుమతి మౌలిక వసతుల నాణ్యతను మెరుగుపరుస్తామ'ని తెలిపారు. ఇలా పలు రకాల ఎగుమతి సంబంధిత చర్యలను తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:నిరాశపరిచిన జొమాటో- 3 రెట్లు పెరిగిన క్యూ1 నష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.