ETV Bharat / business

మొండి బకాయిలుగా విద్యా రుణాలు

author img

By

Published : Mar 28, 2021, 11:05 AM IST

బ్యాంకింగ్‌ రంగాన్ని వేధించే ప్రధాన సమస్యల్లో మొండి బకాయిలు ఒకటి. మొండి బకాయిలు అంటే వెంటనే గుర్తొచ్చేవి కార్పొరేట్‌ రుణాలే. కానీ ఆర్‌బీఐ చేపట్టిన పలు చర్యలతో ఈ మధ్యకాలంలో ఇవి అదుపులోకి వచ్చాయనే చెప్పొచ్చు. అయితే కరోనా పరిణామాలతో అధిక సంఖ్యలో విద్యారుణాలు మొండి బకాయిలుగా పేరుకుపోవడం బ్యాంకులను కలవరపెడుతోంది. ఉద్యోగ కోతలు, వేతనాలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.

Education loans are becoming burden for banks
మొండి బకాయిలుగా విద్యా రుణాలు

బ్యాంకులను విద్యా రుణాలూ బెంబేలెత్తిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈ రుణాలు మొండి బకాయిలుగా మారడం వాటికి ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో దాదాపు 9.55 శాతం విద్యా రుణాలను నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా ప్రభుత్వ రంగ బ్యాంకులు గుర్తించడమే ఇందుకు నిదర్శనం. మొత్తం 3,66,260 ఖాతాలకు చెందిన రూ.8,587 కోట్లు మొండిఖాతాలుగా మారాయి. ఇప్పటి వరకు కార్పొరేట్‌ రుణాల వసూలుపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన బ్యాంకులు, ఇప్పుడు విద్యా రుణాలపై కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

గతేడాది మార్చి తర్వాతే...

గత మూడు ఆర్థిక సంవత్సరాలు చూస్తే.. 2019-20 తర్వాత మొండి బకాయిలుగా మారిన విద్యా రుణాల శాతం ఎక్కువగా ఉంది. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం... 2017-18లో 8.11 శాతం, 2018-19లో 8.29 శాతం, 2020-21లో 7.61 శాతంగా మొండి బకాయిలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుకు ఇవి మళ్లీ 9.55 శాతానికి పెరిగాయి. గృహ, వాహన, రిటైల్‌ రుణాల కంటే విద్యా రుణాల్లో మొండి బకాయిలు అధికంగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం ఇచ్చిన రుణాలు ఎక్కువగా మొండి బకాయిలుగా మారుతున్నాయి. 1,76,256 ఖాతాలకు చెందిన రూ.4,041.68 కోట్లు మొండిగా మారాయి.

Education loans are becoming burden for banks
విద్యారుణాల లెక్కలు

దక్షిణాదిలోనే అధికం...

మొండి బకాయిలుగా మారిన విద్యారుణాల్లో దక్షిణాది వాటా దాదాపు 70 శాతంగా ఉంది. డిసెంబరుకు మొత్తం రూ.8,587 కోట్ల విద్యారుణ ఎన్‌పీఏలు ఉండగా.. అందులో తమిళనాడులోనే రూ.3,490.75 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి. తమిళనాడులో 20.3 శాతం, బిహార్‌లో 25.76 శాతం విద్యా రుణాలు ఎన్‌పీఏలుగా ఉన్నాయి. అయితే తమిళనాడుతో పోలిస్తే బిహార్‌లో రుణాల మొత్తం తక్కువే. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రుణ గ్రహీతలకు మారటోరియం అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఈ మొండి సెగ మరింత ఎక్కువగా ఉండేది.

Education loans are becoming burden for banks
విద్యారుణాలు ఎక్కువగా తీసుకున్నరాష్ట్రాలు

మొండి సెగకు కారణాలివే

విద్యార్థులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులే. కరోనా వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతు కావడం, వేతనాలు తగ్గడం బకాయిల చెల్లింపుపై ప్రభావం చూపింది. విద్య ముగించుకున్న విద్యార్థులకు సరైన కొలువులు దక్కకపోవడంతో విద్యా రుణాలను చెల్లించలేకపోతున్నారు. ఇక విద్యా రుణాలకు ఎటువంటి తనఖా ఉండకపోవడంతో.. మొండి బకాయిలుగా మారుతున్నా ఏమీ చేయలేకపోతున్నామని బ్యాంకర్లు అంటున్నారు. ఇంజినీరింగ్‌ వంటి కోర్సుల్లో డ్రాపవుట్‌ (మధ్యలోనే చదువు ఆపివేయడం)లు పెరగడం కూడా ఇందుకు కారణమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఎల్​టీసీ క్లెయిమ్​ చేశారా? ఇంకా కొద్దిరోజులే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.