గుజరాత్​ ఎన్నికలు.. మోదీని కలవరపరిచే సౌరాష్ట ఎవరికి 'సై' అంటుందో?

author img

By

Published : Nov 20, 2022, 8:16 AM IST

Saurashtra region holds key to power in Gujarat

గుజరాత్‌.. అనగానే భాజపాకు కంచుకోట అనుకుంటాం. ప్రతి చోటా ఆ పార్టీకి తిరుగులేదనుకుంటాం. కానీ... కమలనాథులను, నరేంద్ర మోదీని కూడా కలవరపరిచే ప్రాంతం ఒకటుంది. అదే సౌరాష్ట్ర! గత ఎన్నికల్లో భాజపా ఆధిక్యాన్ని తగ్గించిందీ... కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగు పర్చిందీ ఈ ప్రాంతమే! మరి ఈసారి సౌరాష్ట్ర ఎవరికి సై అంటుంది?

Gujarat Elections 2022 : 182 సీట్లున్న గుజరాత్‌ అసెంబ్లీలో 48 సౌరాష్ట్ర నుంచి వచ్చేవే! పాటిదార్‌, ఓబీసీల ప్రాబల్యమున్న ఈ ప్రాంతానికి రాష్ట్రంలో అధికారాన్ని నిర్ణయించే అవకాశాలున్నాయి. 2017 ఎన్నికల్లో సౌరాష్ట్ర నుంచి కాంగ్రెస్‌ పార్టీ 28 సీట్లలో విజయం సాధించగా భాజపా 19 సీట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

నాటి ఎన్నికల్లో కమలనాథులు మూడంకెల మార్కు దాటకపోవటానికి కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకోవటానికి సౌరాష్ట్రే కారణం. 2015నాటి పాటిదార్ల ఉద్యమం ప్రభావం కాంగ్రెస్‌కు లాభించగా భాజపాను దెబ్బతీసింది. అధికారంలోకి వచ్చినా అసెంబ్లీలో మెజార్టీ తగ్గింది. ఈ ప్రాంతంలోని 11 జిల్లాల్లో మూడింట (మోర్బి, గిర్‌ సోమ్‌నాథ్‌, అమ్రేలి) భాజపా అసలు ఖాతానే తెరవలేకపోయింది.

ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. ఐదేళ్లలో అనేక మార్పులు వచ్చాయి. అప్పటి పాటిదార్ల ఆందోళన ప్రభావం ఇప్పుడంతగా లేదు. గత ఎన్నికల అనుభవం నేపథ్యంలో... భాజపా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించింది. కాంగ్రెస్‌లోని కీలక నేతలు, ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆకర్షించింది. పాటిదార్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్‌ పటేల్‌ ఇప్పుడు భాజపాలో చేరి... ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. అలాగని పాటిదార్లంతా భాజపాకు మద్దతిస్తున్నారనుకోవటానికీ లేదు.

భాజపాపై ఆగ్రహం లేదు అలాగని పూర్తిస్థాయి అనుగ్రహమూ లేదు. అందుకే ఒకవేళ పాటిదార్ల మద్దతు పూర్తిగా లభించకుంటే ప్రత్యామ్నాయంగా ఓబీసీలను కూడగట్టడానికి భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో ఓబీసీలకు 40శాతం ఓట్లున్నాయి. 147 ఓబీసీ వర్గాలున్నాయి. అందుకే చాలామంది ఓబీసీలకు సీట్లిచ్చింది.

కొన్ని చోట్లయితే తమ సిట్టింగ్‌లను కాదని కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికి సీటు ఇవ్వటం గమనార్హం. ఈ పరిణామాలన్నింటితో కాంగ్రెస్‌ బలహీనపడింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్లను నిలబెట్టుకోవటం కాంగ్రెస్‌ ముందున్న అతిపెద్ద సవాలు. 2017 ఎన్నికల్లో నెగ్గిన సుమారు 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరగా వారిలో 10 మంది సౌరాష్ట్ర నుంచే ఉన్నారంటే కమలనాథుల మిషన్‌ సౌరాష్ట్ర ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పాటు సౌరాష్ట్రలో మకాం వేసి ప్రచారం చేయబోతున్నారు.

కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ ఆద్మీపార్టీ కూడా సౌరాష్ట్రపై దూకుడుగా వెళుతోంది. పాటిదార్లలో భాజపాపై తొలగని అసమ్మతిని సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది. సీట్ల కేటాయింపులో పాటిదార్లకు ప్రాధాన్యమిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 2015నాటి ఆందోళన సందర్భంగా 14 మంది పాటిదార్‌ యువకులు పోలీసు కాల్పుల్లో చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తోంది.

అంతేగాకుండా పాటిదార్లపై నాడు పెట్టిన కేసులను కూడా ఇంకా వెనక్కి తీసుకోకపోవటాన్ని ఎత్తిచూపుతోంది. పాటిదార్‌ ఆందోళనలో హార్దిక్‌ పటేల్‌ తర్వాతి నాయకత్వాన్ని ఆప్‌ చేరదీయటం గమనార్హం. గుజరాత్‌లో పాగా వేయటానికి ప్రాబల్యం పెంచుకోవటానికి సౌరాష్ట్రను నిచ్చెనగా భావిస్తోంది ఆప్‌!

ఇదీ చదవండి:శ్రద్ధ హత్య కేసులో కీలక ఆధారం.. చేతిలో బ్యాగ్​తో అఫ్తాబ్​ సీసీటీవీ ఫుటేజ్​!

మరో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.