ETV Bharat / bharat

'భారత్‌లో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు.. అప్రమత్తత అవసరం'

author img

By

Published : Jan 29, 2022, 3:08 PM IST

WHO on India Covid cases: భారత్​లో కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవటంపై దృష్టి సారించాలని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దేశంలోని చాలా ప్రాంతాల్లో కేసులు తగ్గుతున్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండటం అవసరమని స్పష్టం చేసింది.

WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO on India Covid cases: భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నమోదవుతున్నప్పటికీ.. మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు తగ్గుతున్నాయని, అయితే.. ఈ ట్రెండ్‌ను గమనించాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్ డా.పూనమ్‌ ఖేత్రపాల్ సింగ్‌ తాజాగా ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. దేశంలో కరోనా ముప్పు కొనసాగుతోందన్నారు. స్థానికంగా వ్యాప్తి తీరుతో సంబంధం లేకుండా.. ఏ దేశం ఇంకా మహమ్మారి నుంచి బయటపడలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కొవిడ్‌ ముగింపు దశలోకి ప్రవేశిస్తోందా? అనేదానిపై స్పందిస్తూ.. మనమింకా మహమ్మారి మధ్యలోనే ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తిని నియంత్రించడం, ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని సూచించారు. పైగా, ముగింపు దశకు చేరుకున్నంత మాత్రాన.. వైరస్ ఆందోళనకరం కాదని అనుకోవడానికి లేదన్నారు. మరోవైపు.. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌పై టీకాలు తక్కువ ప్రభావం చూపుతోన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. కానీ, తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల బారినుంచి ఇవి కాపాడుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను విస్తృతం చేయాలని కోరారు. బూస్టర్ డోసులతో రక్షణ పెరుగుతోందని పేర్కొన్నారు.

శనివారం దేశంలో 2.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత మూడో వేవ్‌లో జనవరి 21న దేశంలో అత్యధికంగా 3.47 లక్షల కేసులు నమోదు కాగ, అప్పటినుంచి సంఖ్య తగ్గుతూ వస్తోంది!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: కరోనా కొత్త వైరస్​ 'నియో కోవ్‌'పై డబ్ల్యూహెచ్‌ఓ ఏమంటోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.